ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ కంపెనీల్లో ఉన్నత హోదాలు, డైరెక్టర్ స్థానాల్లో మహిళల శాతం ప్రస్తుతం 12గా ఉందని ఐబీఎం-చీఫ్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో తేలింది. అయితే 2019 నుంచీ కంపెనీల కీలక స్థానాల్లో మహిళల సంఖ్య ఎనిమిది శాతం దగ్గరే ఉండి పోయింది. ఇప్పుడు కొంత పురోగతి కనిపించడం సంతోషకరం. కాకపోతే, ఉన్నత స్థానాల్లో మరింత మంది మహిళలకు చోటు ఇవ్వాల్సిన అవసరం ఉందనే ఆకాంక్ష అంతర్జాతీయంగా వినిపిస్తున్నది.
ఈ ప్రయత్నంలో ప్రభుత్వాల విధానాల కంటే.. ఆయా కంపెనీల చొరవే కీలకం. ఈ విషయంలో కొన్ని సూచనలు చేస్తున్నారు ‘చీఫ్’ సహ వ్యవస్థాపకురాలు లిండ్సే కప్లాన్. బోర్డు డైరెక్టర్ల స్థాయిలో.. ప్రతి నలుగురిలో కనీసం ఇద్దరు మహిళలు ఉండేలా చూడాలి. మహిళా సిబ్బంది నైపుణ్యాల మెరుగుదలకు తగినన్ని నిధులు కేటాయించాలి. పని ప్రదేశంలో మహిళకు గుర్తింపు, గౌరవం పెరగాలి. ప్రశంస దక్కాలి. పదోన్నతులు వరించాలి. తగినంత భద్రత కూడా లభించాలి.