ఉచితం అంటే చాలు.. ఎగేసుకుంటూ వెళ్తుంటారు కొందరు. అందులోనూ ‘ఫ్రీ వై-ఫై’ అంటే.. రోజంతా అక్కడే తిష్ఠ వేసుకొని కూర్చుంటారు. విమానాశ్రయాలు, బహిరంగ ప్రదేశాలు, కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో లభించే ఉచిత వై-ఫైకి చాలామంది బానిసలుగా మారుతున్నారు. అయితే, ఇలాంటి సర్వీసులను ఆచితూచి వాడుకోవాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. పబ్లిక్ వై-ఫైని ఎక్కువగా ఉపయోగించడం వల్ల వినియోగదారుల వ్యక్తిగత, ఆర్థిక సమాచారం ప్రమాదంలో పడుతుందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా, ఫ్రీ వై-ఫై నెట్‌వర్క్‌లో కనెక్ట్ అయినప్పడు బ్యాంకింగ్, ఆన్లైన్ షాపింగ్ వంటి ఆర్థిక లావాదేవీలు ఎట్టిపరిస్థితుల్లోనూ చేయవద్దని సలహా ఇస్తున్నారు.
పబ్లిక్ వై-ఫై నెట్‌వర్క్‌కు సరైన భద్రత ఉండదనీ, ఇవి హ్యాకర్లు, స్కామర్లకు సులభమైన లక్ష్యాలుగా మారతాయనీ అంటున్నారు. పబ్లిక్ వై-ఫై ద్వారా ఇ-మెయిల్స్ చెక్ చేసుకోవడం, సోషల్ మీడియా ఖాతాలలోకి లాగిన్ కావడం వంటివి కూడా ప్రమాదకరమేనట. ‘ఈ పబ్లిక్ వై-ఫై ద్వారా అన్సెక్యూర్డ్ కనెక్షన్లను సైబర్ నేరగాళ్లు సులభంగా అడ్డుకోగలరు. దీనివల్ల వినియోగదారుల వ్యక్తిగత డేటాను దొంగిలించడంతోపాటు ఆర్థిక మోసాలకు కూడా పాల్పడే ప్రమాదం ఉంది’ అని చెబుతున్నారు. అలాగే ఆన్లైన్ ఖాతాలకు స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌ను ఉపయోగించుకోవాలనీ, ఫోన్లో ఉండే ముఖ్యమైన డాక్యుమెంట్స్‌ను విడిగా బ్యాకప్ తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. ఫ్రీ వై-ఫై జోన్లో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే.. ఇబ్బందులు పడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.