యోగా మన సనాతన సంప్రదాయంలో ప్రధాన జీవనాడి. మనిషిని భౌతికంగా దృఢంగా మారుస్తూనే, మానసిక శక్తిని ప్రచోదనం చేసే దివ్యమైన ఔషధం ఇది. ఎటువంటి పరికరాలూ, ప్రత్యేక పరిసరాలూ అవసరం లేకుండా, కేవలం శరీర భంగిమలను మార్చడం ద్వారా ఆరోగ్యాన్ని అందిపుచ్చుకునే అద్భుత రహస్యం యోగా సాధనలో దాగుంది. పేద, ధనిక భేద రహితంగా ఎవరైనా ఆచరించే యోగా మానవజాతికి తరగని నిధి. అంతేకాదు, సయాటికా, స్పాండిలైటిస్, డయాబెటిస్‌లాంటి నేటి జీవనశైలి రోగాలకూ అందులో మందు ఉందంటే… వేల ఏండ్లనాటి యోగా మనదాకా రావడం వెనుక కారణమేంటో అర్థం చేసుకోవచ్చు.
అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఏటా ఒక ప్రత్యేక థీమ్‌ను ఎంపిక చేస్తుంటారు. ఆ ఏడాది లక్ష్యాలు, ఉద్దేశాలను అది తెలియజేస్తుంది. 2025 సంవత్సరానికి ‘యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్’ అన్న నినాదాన్ని ముందుకు తెచ్చారు. ఇది భూమిని కాపాడుకుంటూ ఆరోగ్యాన్నీ కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతుంది. యోగా దినోత్సవం సందర్భంగా కొన్ని విలువైన యోగాసనాలు మీకోసం..
ఇది నిలబడి వేసే ఆసనం. నిటారుగా నిలబడి కాళ్లు రెండూ దగ్గరగా ఉంచి, చేతులను నిటారుగా ఉంచాలి. ఇప్పుడు రెండు చేతులనూ కలిపి అరచేతులు బయటి వైపునకు వచ్చేలా తిప్పాలి. అలాగే రెండు చేతుల్నీ పైకి నిటారుగా ఎత్తాలి. ఇదే సమయంలో మడమలనూ ఎత్తి మునివేళ్ల మీద పది పదిహేను సెకండ్లు నిలబడాలి.
లాభాలు: నిరంతరం కూర్చుని ఉండే మన జీవనశైలి వల్ల శరీరం సరైన భంగిమలో ఉండదు. దాన్ని సరిచేయడానికి అంటే, శరీరాన్ని నిటారుగా ఉంచడానికి ఇది తోడ్పడుతుంది. అలాగే ఎదిగే పిల్లలు ఈ ఆసనం వేస్తే ఎత్తు పెరుగుతారు. శరీరంలో ఉండే ఎముకలన్నీ చురుగ్గా మారతాయి.
నిటారుగా నిలబడి చేతులను కూడా సమంగా ఉంచాలి. తర్వాత ఒక బిందువును చూస్తూ కుడికాలిని చేతితో ఎత్తి పాదాన్ని ఎడమ తొడమీద ఉంచాలి. తర్వాత ఊపిరి తీసుకుంటూ రెండు చేతులూ పైకి ఎత్తి నమస్కార భంగిమలో కొద్ది సెకండ్లపాటు నిలబడాలి. శ్వాస వదులుతూ చేతులు కాళ్లు సాధారణ స్థితికి తెచ్చుకోవాలి. ఇలాగే రెండో కాలుతోనూ చేయాలి.
లాభాలు: ఇది క్రమం తప్పకుండా చేయడం వల్ల కాళ్లు బలపడతాయి. ఏకాగ్రత పెరుగుతుంది. శరీర సమతుల్యత ఏర్పడుతుంది. వెన్నునొప్పి, సయాటికాలాంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
లాభాలు: ఈ ఆసనం వేయడం వల్ల డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. క్లోమ గ్రంథి (పాంక్రియాస్) మీద ఒత్తిడి పడటం వల్ల మధుమేహం అదుపులోకి వస్తుంది. కడుపుతో ఉన్నప్పుడు చాలామందికి షుగర్ వస్తుంది. దాని ప్రభావం గర్భిణి ఆరోగ్యం మీదే కాదు గర్భస్థ శిశువుపైనా పడుతుంది. అలాంటి వాళ్లకూ ఇది ఎంతో మేలుచేస్తుంది.
లాభాలు: వజ్ర త్రికోణాసనం వల్ల కటి ఎముకలు బలంగా తయారవుతాయి. కిడ్నీకి రక్త ప్రసరణ మెరుగవుతుంది. వెన్నెముక దృఢత్వం పెరుగుతుంది. సయాటికా నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. గర్భిణులు ఇలాంటి ఆసనాలు సాధన చేయడం వల్ల కాన్పు తర్వాత వాళ్ల శరీరంలో జరిగే మార్పులకు అడ్డుకట్ట వేయవచ్చు. ఆరోగ్యంగానూ ఉండవచ్చు.
లాభాలు: నావాసనం చేసినప్పుడు కడుపు మీద ఒత్తిడి ఎక్కువగా పడుతుంది. ఇది పొట్ట ఎక్సర్‌సైజ్‌లలో ఒకటి. పొట్ట చదునుగా ఉండాలన్నా, కడుపు కండరాలు బలపడాలన్నా ఈ ఆసనం ఉపయోగపడుతుంది. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగు పరిచేందుకు సహకరిస్తుంది.
రోజూ క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం వల్ల లెక్కకు మిక్కిలి లాభాలు ఉన్నాయి. ప్రాణశక్తిని ఉద్దీపింపజేసి, ఎముకలు, కండరాలను బలోపేతం చేస్తుంది. ఒంటిని వింటిలా వంచే సామర్థ్యం పట్టుబడితే ఇక శరీరం ఎంత చురుగ్గా ఉంటుంది అన్నదీయోగా ద్వారా తెలుసుకోవచ్చు.
– అనితా అత్యాల యోగా నిపుణురాలు 6309800109