విద్యారంగంలో పెరుగుతున్న పోటీతత్వం.. విద్యార్థులపై ఒత్తిడిని పెంచుతున్నది. అది వారి మానసిక, శారీరక వికాసంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నది. పసివాళ్ల బాల్యాన్ని చిత్తు చేస్తున్నది. ఈ పరిస్థితి దీర్ఘకాలంలో వారి అభ్యాసన సామర్థ్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో పిల్లల మానసిక ప్రవర్తనపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉన్నదని సూచిస్తున్నారు. ఒత్తిడికి గురయ్యే చిన్నారులు.. దేనిపైనా దృష్టి కేంద్రీకరించలేరు. వారి ఏకాగ్రత దెబ్బతింటుంది. పనితీరు కూడా మందగిస్తుంది. మతిమరుపు, జ్ఞాపకశక్తి లోపం, వారిలో వారే మాట్లాడుకోవడం, చదువులో వెనకబడటం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఇవన్నీ.. పిల్లలపై వారి సామర్థ్యాన్ని మించి ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని చెప్పడానికి సూచనలు. చదువుకు సంబంధించిన ఒత్తిడి వల్ల విద్యార్థులను ఆందోళన, నిద్రలేమి కూడా వేధిస్తుంది. దీర్ఘకాలంలో వారి మానసిక స్థితిలో మార్పులకూ కారణం అవుతుంది. జర్నల్ ఆఫ్ అడోలెసెన్స్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం.. విద్యా ఒత్తిడి అనేది విద్యార్థులలో ఆందోళన, నిరాశ పెంచుతుందనీ, మానసిక స్థితిపైనా ప్రతికూల ప్రభావం చూపుతుందని వెల్లడైంది. అందుకే.. తల్లిదండ్రులు పిల్లల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి.
పిల్లలపై ఒత్తిడిని తగ్గించడంలో తల్లిదండ్రులే కీలకపాత్ర పోషించాలి. తాము సురక్షితంగా, భద్రంగానే ఉన్నామనే భావన వారిలో కలిగించాలి. అందుకు తగ్గట్టుగా ఇంటి వాతావరణాన్ని మార్చుకోవాలి. సాధారణంగా పాఠశాలలో చాలామంది విద్యార్థులు బెరుకుగానే ఉంటారు. వారు స్వేచ్ఛగా ఉండేది, మాట్లాడేది.. ఇంట్లోనే! కాబట్టి, పిల్లలతో బలమైన కమ్యూనికేషన్‌ను ఏర్పరుచుకోవాలి.
అప్పుడే.. ఒత్తిడితో కూడిన పరిస్థితులను వారు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. పిల్లలకు సానుకూల బలాన్ని అందించడం.. వారి మానసిక పెరుగుదలను ప్రోత్సహించడంలో సాయపడుతుంది. చివరిగా.. చిన్నారుల లక్ష్యాలను వారే నిర్దేశించుకునేలా ప్రోత్సహించాలి. అప్పుడే.. భవిష్యత్తుపై స్పష్టమైన
అవగాహనకు వస్తారు. పెద్దగా కష్టపడకుండానే, తమకిష్టమైన రంగంలో నిలదొక్కుకుంటారు.