శరీర సౌందర్యంలో ముఖంతోపాటు కాళ్లూ, చేతులదీ కీలకపాత్రే. అమ్మాయి అందానికి అదనపు ఆకర్షణగా నిలిచే వీటిమీద చాలామంది సరైన శ్రద్ధ పెట్టరు. దానితోపాటు హార్మోన్ల ప్రభావం, చర్మ సమస్యలు, ఎండలో తిరగడంలాంటి వాటివల్ల ఈ ప్రాంతాల్లో మచ్చలు ఏర్పడుతుంటాయి. ఇవిపోయి… మెరిసే చర్మం సొంతం కావాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సరి!
ఒక టీ స్పూన్ ఓట్స్‌ను మిక్సీలో వేసి పొడిగా చేసుకోవాలి. దానిలో పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని కాళ్లూ చేతులపై రాసి ఆరనివ్వాలి. తర్వాత చల్లటి నీళ్లతో శుభ్రంగా కడిగేయాలి. ఇలాచేస్తే చర్మంపై ఏర్పడిన మచ్చలు నెమ్మదిగా తగ్గుముఖం పడతాయి.
ఒక టమాటా తీసుకుని మధ్యలో కోయాలి. దానిమీద చక్కెర చల్లి మచ్చలు ఉన్న ప్రదేశంలో స్క్రబ్ చేసుకోవాలి. లేదా టమాటాను మెత్తగా చేసి ఆ ప్రాంతంలో రాసినా ఫలితం ఉంటుంది. క్రమం తప్పకుండా దీన్ని ప్రయత్నిస్తే మచ్చలు మాయమవుతాయి.
రెండు స్పూన్ల శనగపిండిలో కొద్దిగా నీళ్లు కలిపి పేస్టులా చేయాలి. ఈ పిండిని కాళ్లు, చేతులకు రాసి కాసేపు వదిలేయాలి. ఆరిన తర్వాత కొద్దికొద్దిగా నీళ్లు చల్లుతూ స్క్రబ్ చేయాలి. వారానికి కనీసం మూడుసార్లు ఇలా చేస్తే సమస్య తగ్గుముఖం పడుతుంది.
చాలామంది సన్‌స్క్రీన్ లోషన్‌ను కేవలం ముఖంపై మాత్రమే రాస్తుంటారు. కాళ్లు, చేతులకు కూడా ఉపయోగించే బాడీ సన్‌స్క్రీన్ లోషన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. బయటకు వెళ్లడానికి అరగంట ముందు ఇది రాసుకోవడం ద్వారా ఎండ నుంచి చర్మాన్ని కాపాడుకోవచ్చు.