చలికాలం.. చర్మానికి గడ్డుకాలం. చల్లని గాలులతో చర్మ ఆరోగ్యం పాడవుతుంది. చర్మాన్ని సంరక్షించుకోవడం కూడా.. కష్టంగా మారుతుంది. అందుకే, స్నానం చేసే సమయంలో కొన్ని చిట్కాలు పాటిస్తే.. శీతాకాలంలోనూ చర్మం మెరిసిపోతుంది.
చలికాలం అనగానే అందరూ వేడినీటి స్నానానికే మొగ్గు చూపుతారు. కానీ, వేడినీళ్లు చర్మానికి హాని కలిగిస్తాయి. శరీరంలోని తేమను తొలగిస్తాయి. కాబట్టి, గోరు వెచ్చని నీటితోనే స్నానం చేయండి. అది కూడా 10 నిమిషాలకు మించకుండా చూసుకోండి. స్నానపు నీటిలో కొద్దిగా తేనె లేదా కొబ్బరి నూనె లాంటి హైడ్రేటింగ్ పదార్థాలను కలపడం ద్వారా.. తేమ త్వరగా కోల్పోకుండా ఉంటుంది. ఇక స్నానానికి సబ్బులకు బదులుగా బాడీ వాష్లను ఎంచుకోవడం మంచిది. ఎందుకంటే, సబ్బును ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే.. చర్మం అంతగా పొడిబారుతుంది. అదే సమయంలో.. బాడీ వాష్‌లు చర్మానికి తేమను అందించే గుణాన్ని కలిగి ఉంటాయి. ఇక, బాత్ స్క్రబర్లు, బాడీ బ్రష్‌లు కూడా చర్మానికి హాని కలిగిస్తాయి.
వాటిని పక్కన పెట్టేయాల్సిందే! తలస్నానం తర్వాత జుట్టుకు కండిషన్ అప్లయి చేయండి. ఇతర కాలాలతో పోలిస్తే.. చలికాలంలో జుట్టు పొడిగా మారుతుంది. కాబట్టి, షాంపూ తర్వాత కండిషనర్ వాడండి. స్నానం పూర్తయిన వెంటనే.. బాడీ మొత్తం మాయిశ్చరైజ్ చేసుకోవాలి. చర్మం తడిగా ఉన్నప్పుడే మాయిశ్చరైజర్‌ను అప్లయి చేస్తే.. తేమ ఎక్కువ సమయంపాటు నిలిచి ఉంటుంది. చర్మాన్ని చికాకు పెట్టే దుస్తులను దూరం పెట్టాలి. చాలామంది రాత్రిపూట ఉన్ని స్వెటర్లను డైరెక్టుగా వేసుకుంటారు. బదులుగా.. కాటన్ దుస్తులు ధరించి, వాటిపైన స్వెటర్ తొడుక్కోండి. ఎందుకంటే, ఉన్ని.. చర్మాన్ని చికాకు పెట్టడంతోపాటు పొడిగా మార్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి చిట్కాలతో.. చలికాలంలోనూ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.