నాకెందుకో సైన్సు సబ్జెక్టుల్లో బోటనీ అంటే చాలా ఇష్టంగా వుండేది. ఫిజిక్స్ బాగుండేది, మార్కులు కూడా ఎక్కువే వచ్చేవి గానీ, జువాలజీ పెద్దగా నచ్చేది కాదు. కెమిస్ట్రీ మరీ బోర్ అనుకునేదాన్ని. అన్ని సబ్జెక్టులూ బాగానే చదివేదాన్ని. బహుశా మా నాన్న వ్యవసాయదారుడవడం, చిన్నప్పట్నుంచీ నేను పల్లెటూర్లోనే పెరగడం, చేన్లూ, చెల్కలూ, పొలాలూ, పంటలూ, పెద్ద పెద్ద చెట్లూ, వాటికి పూచే పూలూ, కాసే కాయలూ, పండ్లూ రోజూ చూస్తూ పెరగడం వల్లనేమో..
వృక్షశాస్త్రం అంటే బాగా ఇష్టం ఏర్పడింది. ‘ఈనెల వ్యాపనము, బీజ వ్యాప్తి’ లాంటి పాఠాలు ఇప్పటికీ గుర్తున్నాయి. మొక్కల్లో ఆకుల అమరిక, చెట్లల్లో కొమ్మల వ్యాపనము.. ఒక్కొక్కటీ ఒక్కో డిజైన్‌లో ఎంత అందంగా వుంటాయో, అడ్డదిడ్డంగా కాకుండా ఒక్కో కొమ్మ కాండానికి సరిగ్గా అంతే దూరంలో అంతే కొలతలో ఎలా వస్తుందో తెలుసుకుంటుంటే.. మనం రోజూ చూసే చెట్లకు ఇంత శాస్త్రం వుందా? అనిపించేది. కాయల్లో, పళ్లల్లో భద్రంగా, అందంగా గింజల అమరిక చూసి ఈ సృష్టి ఎంత గొప్పదో అనే భావన కలిగేది.
ఇంటర్ సెకండియర్‌లో పరీక్షలకు ముందు రికార్డులు మొత్తం రాసి చూపించాల్సి ఉంటుంది. బోటనీలో ‘హెర్బేరియం’ అనే రికార్డు తయారుచేయాల్సి ఉండేది. అన్ని మొక్కల లేలేత ఆకుల్ని ఈనెలతో సహా సేకరించి, ప్రెస్ చేసి, ఎండబెట్టి.. డ్రాయింగ్ బుక్‌లో అతికించి, కింద ఆ మొక్క వివరాలు రాసి సబ్మిట్ చేస్తే దానికి కూడా మార్కులు వుండేవి. అలాగే రకరకాల గింజలు కూడా! అయితే.. ఈ పని నాకు అత్యంత ఇష్టమైనది. చెట్లకు, మొక్కలకు కూడా ఫ్యామిలీస్ వుంటాయని, ఒకేలాంటి ఆకులు, కాయలు వుండే మొక్కలు ఒకే కుటుంబానికి చెందుతాయని తెలిసి ఆశ్చర్యపోయాను.
అపోసైనేసి, లెగోమినేసి, యూఫోర్బియేసి, సోలనేసి, అకాసి అంటూ మొక్కల కుటుంబాల పేర్లు చదువుతూ, తేలిగ్గా గుర్తుండడానికి వీలుగా ‘ఆకేసి, పప్పేసి, బువ్వేసి’ అని గుర్తులు పెట్టుకుని నవ్వుకునేవాళ్లం. అందరూ తమకు వీలైనట్టుగా దగ్గరున్న పార్కుకో, పబ్లిక్ గార్డెన్‌కో వాళ్ల పేరెంట్స్‌తో వెళ్లి సేకరించి తేవడం మొదలుపెట్టారు. నేను మాత్రం మా ఊరికెళ్లి అక్కడ దొరికే తుమ్మ, వేప, చింత లాంటి ఆకులు, ఈనెలతో సహా తెచ్చేద్దామనే బ్రహ్మాండమైన ఆలోచన చేశాను.
ఈ వంకతో ఓ వీకెండ్లో ఇంటికెళ్లి ఒకట్రెండు రోజులు వుండైనా అమ్మానాన్నల్ని చూసిరావచ్చు. పైగా నాన్నకు చెబితే ఆ ఆకులూ, తీగెలూ, కొమ్మలూ ఎవరికైనా చెప్పి ఇంటికే తెప్పిస్తాడు. వాటిల్లోంచి ‘ఆకులో ఆకునై.. పూవులో పూవునై’ అని ఆడుతూ పాడుతూ నాక్కావలసినవి ఏరుకోవచ్చు అనుకున్నాను. అయితే, ఈ లోగా ఇంటర్ ఎగ్జామ్ ఫీజు కట్టాలని నోటీసు వచ్చింది. మేమెప్పుడైనా మా ఫీజులు బ్యాంకులోనే కట్టేవాళ్లం. మేము ముగ్గురం వెళ్లి ఫీజు కట్టి ఎవరి రసీదు కాపీ వాళ్లం తీసుకున్నాం. మర్నాడు కాలేజీలో అప్లికేషన్ తీసుకుని నింపి ఫొటోలు అతికించి ఫీజు చెల్లించిన రసీదు మరొక కాపీతో కలిపి కాలేజీ ఆఫీసులో ఇవ్వాల్సి ఉంది. తీరా నేను వెళ్లేసరికే అక్కడ పెద్ద క్యూ ఉంది.
ఆ రోజెందుకో క్లర్క్ సుచిత్ర మేడమ్ చాలా కోపంగా వున్నారు. అందరి మీదా అరుస్తున్నారు. లైను అస్సలు ముందుకు కదలట్లేదు. ఎంతో సేపు నిలబడ్డాక నా వంతు వచ్చింది. నా అప్లికేషన్ ఫారం పూర్తిగా పరిశీలించి సంతృప్తిగా తల పంకించారు. వెంటనే పక్కనే ఉన్న రిజిస్టర్లో చూసి ‘ఏంటమ్మాయ్, నువ్వు హెర్బేరియం సబ్మిట్ చేయలేదు కదా!’ అన్నారు. నా గుండెలు గుబగుబలాడాయి. ‘ఎస్ మేడమ్! ఇవ్వలేదు’ అన్నాను. ‘అయితే సబ్మిట్ చేశాకే అప్లికేషన్ ఇవ్వు. అంతదాకా నేను తీసుకోను, నీ దగ్గరే పెట్టుకో!’ అన్నారామె విసురుగా అప్లికేషన్ నా చేతికి ఇచ్చేస్తూ. నాకు చాలా భయమేసింది.
అయినా అప్లికేషన్ని వెనక్కు తీసుకోకుండా ‘ప్లీజ్ మేడమ్! రెండు మూడు రోజుల్లో సబ్మిట్ చేస్తాను, తీసుకోండి’ అని బతిమిలాడాను. ‘ప్లీజ్ ఏంటి ప్లీజ్! నేనేమైనా నీ ఫ్రెండునా? నాకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వున్నాయి, ఏ రికార్డు ఇవ్వకపోయినా ఎగ్జామ్ అప్లికేషన్ తీసుకోవద్దని. ఇంతమంది స్టూడెంట్స్‌లో ఇలా బకాయి బిజినెస్ పెట్టుకుంటే అయినట్టే! నాకు గుర్తుండకపోతే ఇక అంతే సంగతులు! తీసుకెళ్లు. ఏ ఒక్క రికార్డు ఇవ్వకపోయినా గానీ, ట్యూషన్ ఫీజు, ఎగ్జామ్ ఫీజు కట్టకపోయినా గానీ, అప్లికేషన్ యాక్సెప్ట్ చేసే ప్రసక్తే లేదు. నీకు తెల్సో లేదో, నేను చాలా స్ట్రిక్టు’ చాలా విసుగ్గా, కోపంగా అన్నారామె. ‘ఫీజులు కరెక్ట్ గానే కట్టాను మేడమ్!’ గొణిగాను. ‘ఏది లేదో అది నేను చెప్తున్నాను. ఏది వుందో అది నువ్వు చెప్తున్నావు. వున్నదేదో నాకు కనబడ్తుందిగా! మళ్లీ నువ్వు చెప్పడం ఎందుకూ? పక్కకు జరుగు’ అంటూ నా అప్లికేషన్ విసిరేశారు.
నేను నా వెనకున్న వాళ్ల వైపు చూశాను. ‘మేడమ్ వద్దన్నారంటే ఇక వినరోయ్! రేపో ఎల్లుండో రికార్డ్ ఇచ్చాకే అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చుగా!’ అంది ఒకమ్మాయి. సుమిత్ర మేడమ్ కుర్చీని బర్రున జరిపి ‘అబ్బబ్బబ్బా! నా తల పగిలిపోతోంది. ఇట్లాంటి కేసులు రోజూ రెండు తగిలితే నేను ఔటే! బీపీ రావడం ఖాయం’ అంటూ లేచి వెళ్లిపోయింది.
నేను ఆ ఫామ్‌ని అందుకుని పక్కగా జరిగి నిలబడ్డాను. ఏం చేయాలో తోచడం లేదు. అక్కడున్న వాళ్లంతా సుమిత్రా మేడమ్ కోపానికి నేనే కారణమన్నట్టు చూస్తున్నారు. నాకు చాలా బాధగా, దిగులుగా అనిపించింది. బలవంతంగా కన్నీళ్లు ఆపుకొన్నాను. నా తరఫున మాట్లాడటానికి ఎవరూ లేరు, రారు కూడా. మా నాన్న వ్యవసాయదారుడై ఊర్లో వుండకుండా ఈ సిటీలో పెద్ద ఆఫీసరైతేనో, బాగా డబ్బున్న బిజినెస్‌మాన్ అయి కార్లో వస్తేనో ఇట్లా పక్కకు నిలబెట్టేవారా? అనిపించింది.
కాసేపటికి సుమిత్రా మేడమ్ టీ తాగి వచ్చి మళ్లీ కుర్చీలో కూర్చుని వరుసగా అప్లికేషన్స్ తీసుకోవడం మొదలుపెట్టారు. నన్ను ఏమాత్రం పట్టించుకోలేదు. మొత్తం అందరి ఫామ్స్ తీసుకోవడం అయిపోయాక టేబుల్ మీదవన్నీ సర్దుకుని డెస్క్‌కు లాక్ చేసుకున్నారు. తాళం చేతులు బ్యాగులో వేసుకోబోతూ నన్ను చూసి ‘ఏంటి ఇంకా నిలబడ్డావ్? చెప్పానుగా తీసుకోనంటే తీసుకోనని!’ అంటూనే మళ్లీ నా మొహం చూసి ఏమనుకున్నారో ఏమో ‘సరే! ఓ పని చెయ్యి, రేపు మీ బోటనీ లెక్చరర్‌తో ఓ స్లిప్ రాయించుకునిరా, అప్పుడు నీ అప్లికేషన్ తీసుకుంటాను’ అన్నారు. ‘నేను థాంక్స్ మేడం!’ అంటుండగానే వెళ్లిపోయారు.
నెల్లుట్ల రమాదేవి
రచయిత్రి