అది కూడా ఏటీఎం లాంటిదే. కాకపోతే వంద, ఐదొందలు, రెండువేల రూపాయల నోట్లకు బదులుగా.. కథ, కవిత్వం, వ్యాసం, పద్యం.. తదితర సాహితీ సంపద బయటికొస్తుంది. పజిల్స్, అమేజింగ్ ఫ్యాక్ట్స్ కూడా అందుతాయి. ఆ ప్రింటవుట్‌ను అపురూపంగా అందుకుని.. ఇష్టంగా చదివేసుకోవచ్చు. అక్షర కుబేరులు అనిపించుకోవచ్చు. హైదరాబాద్‌కు చెందిన ఆంత్రప్రెన్యూర్ అపర్ణ విశ్వనాథన్ తన ‘లైబ్రరీ సొల్యూషన్స్’ బృందంతో కలిసి ఈ స్టోరీ బాక్స్‌ను రూపొందించారు.
‘నాలుగేండ్ల క్రితం మేం ఫ్రాన్స్ నుంచి స్టోరీ టెల్లింగ్ మెషీన్ తెప్పించుకున్నాం. కాకపోతే, అదో ఖరీదైన వ్యవహారం. కరోనా సమయంలో బోలెడంత ఖాళీ దొరికింది. ఆ నమూనాలోనే దేశీయంగా కథల పెట్టెలను రూపొందించాం. ప్రస్తుతం రామకృష్ణ మఠం, ప్రొ. జయశంకర్ అగ్రికల్చరల్ వర్సిటీ.. ఇలా నగరంలోని దాదాపు పాతిక ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేశాం. భవిష్యత్తులో ఇవి సంప్రదాయ గ్రంథాలయాలకు ప్రత్యామ్నాయం అవుతాయేమో!’ అంటారు అపర్ణ. రోజుకు పదిహేను నిమిషాలు కేటాయించినా చాలు. పుస్తకాల మీద ప్రేమను నిలుపుకోవచ్చు. అక్షరంతో అనుబంధం కొనసాగించవచ్చు. ఆ దిశగా అపర్ణ విశ్వనాథన్ ప్రయత్నాన్ని ప్రశంసించాల్సిందే.