Life style : సాధారణంగా భార్యాభర్తల మధ్య రహస్యాలు ఉంటే జీవితం నరకప్రాయమవుతుందని చెబుతుంటారు. సంసారం సాఫీగా సాగాలంటే అన్ని విషయాలను ఒకరికొకరు పంచుకోవాలని అంటుంటారు. కానీ అచార్య చాణిక్యుడు మాత్రం మగవాడు తన జీవితం నరకం కాకూడదంటే భార్య దగ్గర ఓ నాలుగు విషయాలను రహస్యంగా ఉంచాలని తెలిపాడు. పొరపాటున కూడా ఆ నాలుగు విషయాలను భార్యకు చెప్పకూడదని తన నీతిశాస్త్రంలో పేర్కొన్నాడు. చాణిక్యుడు భార్య దగ్గర గోప్యంగా ఉంచాలన్న నాలుగు విషయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
తన బలహీనత
మగవాళ్లు తమ బలహీనతను ఎప్పుడూ భార్యలకు తెలియకుండా దాచుకోవాలని ఆచార్య చాణిక్యుడు చెప్పారు. భర్త బలహీనతలు తెలిస్తే భార్య వాటిని ఉపయోగించుకుని తనకు కావాల్సిన పనులు చేయించుకుంటుందని, నలుగురిలో మిమ్మల్ని మీరుగా ఉండకుండా చేస్తుందని పేర్కొన్నారు. దాంతో మగవాళ్లు ప్రజా జీవితంలో ఇబ్బంది పడుతారని తెలిపారు.
తన సంపాదన
భర్త తన బలహీనతతోపాటు భార్య దగ్గర దాచి ఉంచాల్సిన మరో విషయం సంపాదన అని చాణిక్యుడు పేర్కొన్నారు. భర్త తన పూర్తి సంపాదన గురించి భార్యకు చెబితే.. అందులోని ప్రతి పైసాకు లెక్కలు అడుగుతుందని, అవసరమైన ఖర్చులకు కూడా అడ్డు తగులుతుందని తెలిపారు. దాంతో చిన్న ఖర్చు కూడా భార్యకు తెలిసి గొడవకు దిగుతుందని, ఇది సంసారాన్ని దెబ్బతీస్తుందని చెప్పారు.
చేసిన దానం
భార్య దగ్గర భర్త దాచి ఉంచాల్సిన మూడో విషయం తాను చేసిన దానం గురించి. చేసిన దానం గురించి భార్యకు చెబితే ఆ దానం ఎందుకు చేశావని గొడవపడవచ్చునని, దాంతో చేసిన దానం వ్యర్థమవుతుందని చాణిక్యుడు చెప్పారు. అలాంటి దానంతో పుణ్యం దక్కదని అన్నారు.
జరిగిన అవమానం
భర్త తన భార్య దగ్గర గోప్యంగా ఉంచాల్సిన మరో విషయం జరిగిన అవమానమని అచార్య చాణిక్యుడు తెలిపాడు. భర్తకు జరిగిన అవమానం ఏ భార్య కూడా సహించదు. దాంతో భర్తకు జరిగిన అవమానం గురించి తలుచుకుని బాధపడుతుందని, ఇంట్లోని ఇతరులకు చెప్పుకుని ఆవేదన చెందుతుందని, దాంతో ఇంట్లోని వారందరూ బాధపడే పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు.