పచ్చగా పండే నేల.. చల్లగా వీస్తున్న గాలి.. నిమ్మళంగా సాగుతున్న బతుకు.. ఇన్నాళ్లూ చింతల్లేకుండా ఉందా తల్లి! విష వాయువులు వెదజల్లే ఇథనాల్ కంపెనీ రాకతో భవిష్యత్తు ఎంత భయంకరంగా ఉండబోతున్నదో ఆమెకు అర్థమైంది. పండే నేల పడావ్ పడతదని బెంగ పెట్టుకుంది. చల్లని గాలి విషాన్ని మోసుకొస్తదని గుబులు రేగింది. తమ బతుకులు ఆగమైతయని ఆమె గుండె తల్లడిల్లింది. కన్నపేగులాంటి ఊరితో బంధం తెగిపోతున్నది, తమ అస్తిత్వానికే ముప్పు వస్తున్నదని గ్రహించింది. ఆ ప్రాంతాన్ని దుర్గంధంగా మార్చడానికి దుర్మార్గ పాలకులు పన్నుతున్న కుట్రలపై పిడికిలి ఎత్తింది.
తమ ఆయువు తీసే విషపు కంపెనీని అడ్డుకునేందుకు పోరుబాట పట్టింది పెద్ద ధన్వాడకు చెందిన నల్లబోతుల మరియమ్మ. కనికరం కరువైన చోట ధిక్కార స్వరం వినిపించింది. ఆ విషపు కంపెనీ కోరలు పీకేందుకు ప్రాణాలైనా అర్పిస్తానని ప్రతినబూనింది. అరాచక శక్తుల దాడిలో తల పగిలినా.. తలొగ్గేది లేదంటున్న మరియమ్మ సమరం ఇది…
2025 జూన్ 5.. పెద్ద ధన్వాడలోని ఇథనాల్ కంపెనీ దగ్గర శాంతియుతంగా నిరసన కొనసాగుతున్నది. 14 గ్రామాలకు చెందిన బాధితులు అందులో పాల్గొన్నారు. ఊళ్లు కలుషితమై పోతాయన్న ఆవేదన.. తమ నేలతో రుణం తీరిపోతుందన్న బాధ.. మనసును కకావికలం చేస్తున్నా, గాంధేయ మార్గంలో తమ గళం వినిపిస్తున్నారు.
కండలు తిరిగిన 25 మంది బౌన్సర్లు అక్కడికి చేరుకున్నారు. నిరసనకారులను చెల్లాచెదురు చేయడానికి బలప్రయోగానికి దిగారు. కులం పేరుతో దూషించారు. దళితులను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. అక్కడే ఉన్న పోలీసులు.. తతంగాన్ని చూసీచూడనట్లుగా వ్యవహరించారు. ‘ఈ కంపెనీ మాకొద్దు’ అని నినదిస్తున్న వారిపైకి బౌన్సర్లు దూసుకొచ్చారు. ఒక్కసారిగా బాధితుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వారంతా తిరగబడేలోపే.. ఆ ప్రైవేట్ మూకకు అండగా పోలీసులు రంగంలోకి దిగారు. దొరికిన వారిని దొరికినట్టు కొట్టారు. లాఠీలు ఝళిపించారు. ఈ దమనకాండను నిరసిస్తూ దాడులకు తెగబడుతున్న వారికి అడ్డంగా నిలిచింది మరియమ్మ. ‘ఇథనాల్ కంపెనీ మాకొద్ద’ని గొంతెత్తి నినదించింది. ‘పోలీసు జులుం నశించాల’ని పిడికిలి ఎత్తి గర్జించింది.
అంతే.. దోపిడీ వర్గానికి కొమ్ముకాసిన బౌన్సర్లు, పోలీసులు కలిసి మరియమ్మను విచక్షణారహితంగా కొట్టారు. ఆమె తలపగిలింది.. నెత్తుటి ధారల్లో మరియమ్మ నిలువెల్లా తడిసిపోయింది. సిలువను మోసిన క్రీస్తులా… తల్లి మరియమ్మ తన ఊరి భవిష్యత్తు కోసం.. నెత్తురు చిందుతున్నా ఎత్తిన పిడికిలి దించలేదు. ఈ సంఘటనలో ఆమెతోపాటు మరో 12 మంది మహిళలకు, 18 మంది రైతులకు గాయాలయ్యాయి.
కందిపోయిన బాధితుల ముఖాలు.. పోలీసుల లాఠీ దెబ్బలు, ప్రైవేట్ సైన్యం దాడికి… సాక్ష్యంగా నిలిచాయి. నెత్తురోడుతున్నా న్యాయం కోసం బాధితులు పోలీస్ స్టేషన్ తలుపు తడితే.. కేసు తీసుకునేది లేదని తెగేసి చెప్పారు. కార్పొరేట్‌కు కొమ్ము కాస్తున్న ప్రభుత్వం ఇథనాల్ కంపెనీ పెట్టాల్సిన అవసరం ఎందుకో చెప్పలేదు. కనీసం బాధిత గ్రామాల ప్రజలతో మాట్లాడలేదు. వారి అభిప్రాయాలు తీసుకోలేదు. అందుకే పెద్ద ధన్వాడ రగిలిపోతున్నది. ఇథనాల్ కంపెనీ వద్దంటూ బాధితులంతా కలిసి జాతీయ మానవ హక్కుల కమిషన్ వరకూ వెళ్లారు.
ఇథనాల్ కంపెనీని వ్యతిరేకిస్తూ 14 గ్రామాల నుంచి రైతులు, వారి ప్రతినిధులు 70 మంది వరకూ జాతీయ మానవహక్కుల కమిషన్ బహిరంగ విచారణకు వచ్చారు. తమకు జరుగుతున్న అన్యాయంపై కమిషన్ ముందు మాట్లాడారు. ఆ పోరాటంలో మరియమ్మ తలకు తగిలిన గాయాన్ని చూసి మానవ హక్కుల కమిషన్ నివ్వెరబోయింది. ఓ మహిళను తల పగిలేలా కొడితే కేసు ఎందుకు పెట్టలేదని పోలీసులను నిలదీసింది. ఈ సందర్భంగా తమ గ్రామంతో ఉన్న అనుబంధాన్ని మరియమ్మ చెప్పుకొన్నది. భూమితోనే తమకు బతుకంటూ మొరపెట్టుకున్నది.
ప్రమాదకరమైన ఇథనాల్ కంపెనీ వద్దంటూ కమిషన్‌కు చెప్పింది. ఆ కంపెనీకి అన్ని అనుమతులు వచ్చాయని కమిషన్ సభ్యులు అంటే.. అవన్నీ దొడ్డిదారిన వచ్చాయని మరియమ్మ మీడియాకు చెప్పింది. తమ పోరాటంలో భాగస్వాములు కావాలని జర్నలిస్టులను కోరింది. ‘మా బిడ్డల భవిష్యత్ కోసం పోరాటం తప్పదు’ అంటూ పిడికిలి ఎత్తింది.
‘సార్.. మావి రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులు. కూలీనాలీ చేసుకునేటోళ్లం. నాడు దళితులకు మూడు ఎకరాలు ఇస్తామన్న పెద్దసారు కేసీఆర్ అన్నమాట ప్రకారం ఆ భూములు కొని మాకు ఇచ్చిండు. అప్పట్నుంచి ఆ భూములు సాగు చేసుకుంటూ మా బతుకులు మార్చుకున్నం. ఎన్నో దళిత కుటుంబాలు నోటికింత ముద్ద తింటున్నయ్. మా పచ్చని బతుకుల్లోకి విషం కంపెనీని తెస్తరట. మమ్మల్ని ఒప్పుకోమని ప్రభుత్వం, అధికారులు అంటున్నరు. కేసీఆర్ సారు ఇచ్చిన భూములకు పక్కనే ఈ విషపు కంపెనీ పెడుతున్నరు. ఇప్పుడా కంపెనీ వస్తే.. చుట్టుపక్కల 14 గ్రామాలు ఊర్లు ఇడ్సిపెట్టి పోవాలె. మా బిడ్డలకు ఉద్యోగాలిస్తమంటున్నరు.. ఏం కొలువులు ఇస్తరు సార్? పెద్ద ఉద్యోగాలు ఇయ్యరు! మూటలు ఎత్తుమంటరు. ఆ కంపులో మా బిడ్డలు ప్రాణాలతో పోరాడుకుంటూ పనిచేయాల్నా? ఆ కంపెనీ వస్తే మా ఊర్ల పోరలకు ఎవ్వలు పిల్లనియ్యరు. మేమంతా దేశం పట్టుకొని పోవాలె ఇగ! అందుకే చావైనా బతుకైనా మా ఊర్లనే అనుకొని పోరాటం చేస్తున్నం’ అంటున్నది మరియమ్మ.
కంపెనీకి అన్ని అనుమతులు ఉన్నయనడంపై చదువురాని మరియమ్మ తీవ్ర స్థాయిలో మండిపడింది. ‘అసలు మా ఊళ్ల గీ కంపెనీ పెడుతున్నట్టు మాకు చెప్పింది లేదు సార్! పర్యావరణం సారోళ్లు అనుమతులు ఇచ్చిన్రట, రెవెన్యూ సార్లు కన్వర్షన్లకు ఇచ్చిన్రట, కరెంటోళ్లు తీగలకు పర్మిసన్ ఇచ్చిన్రట, ఇరిగేషనోల్లు నీళ్లు ఇస్తరట… మా గ్రామాల్లో ఒక్కణ్ని పిలవంది, తలవంది, ఎవ్వన్తోని మాట్లాడకుంట.. గిన్ని పర్మిషన్లు యాడికెంచి అచ్చినయ్! మా బతుకులను ఆగం చేసే కుట్ర ఇది. మమ్మల్ని ఇడ్సిపెట్టుండ్రి. మా బతుకులు మేం బతుకుతం. మంచి కంపెనీలు తీస్కరండ్రి, మా బతుకులు మార్చండ్రి. గంతేకానీ, మా బతుకులు ఆగం జేసే గిసొంటి కంపెనీలు మాకొద్దు’ అని పాలకులను కడిగిపారేసింది మరియమ్మ.
పొద్దంతా పొలం పనులు చేసుకునే మరియమ్మ అక్షరం ముక్క చదువుకోలేదు. అయినా, తను పుట్టిపెరిగిన ఊరు, తన ముందు తరాల బతుకుల కోసం ధైర్యంగా నిజం మాట్లాడుతున్నది. తనకు తెలిసిన విషయాన్ని తోటి మహిళలకు చెబుతున్నది. పాలకులను నిలదీసి ప్రశ్నిస్తున్నది. నేల తల్లి క్షేమం కోసం, బిడ్డల భవిష్యత్తు కోసం మరియమ్మ చూపిస్తున్న తెగువ ప్రశంసనీయం. ఆమె పోరాటం మొద లైంది ఇప్పుడే! ఢిల్లీ వరకైనా వెళ్లి కొట్లాడేందుకు సిద్ధంగా ఉన్నానంటున్న మరియమ్మ తెలంగాణ పోరాట స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనం.
మా భూములు ఇచ్చే ప్రసక్తే లేదు. అవసరమైతే అన్ని గ్రామాల మహిళలను కూడగడతాం. సార్ ఇప్పుడు హైదరాబాద్ వరకూ వచ్చాం.. అవసరమైతే ఢిల్లీకి పోతం. మా ప్రాణాలు పోయినా కూడా భూములు ఇచ్చేది లేదు. మా పోరాటంలో న్యాయం ఉంది. మాపై ప్రభుత్వానికి ఎందుకింత పట్టింపో అర్థం కావడం లేదు. మంచి కంపెనీలు వస్తే మాకే మంచిది. మా బతుకులు ఆగం చేసే విషపు కంపెనీలు ఎందుకు సార్? మా గ్రామం నుంచి ఆ కంపెనీని ఎల్లగొట్టాలె. నాయకులారా పార్టీలకు అతీతంగా మా పోరాటంలో కలిసిరండి. మీకు రుణపడి ఉంటాం. ప్రభుత్వ పెద్దలారా మనసుపెట్టి ఆలోచన చేయండి. ఎక్కడెక్కడో వద్దన్న విషపు కంపెనీలు మాకెందుకు?
– లక్ష్మీదేవి, పెద్ద ధన్వాడ ఇథనాల్ బాధితురాలు
– రవికుమార్ తోటపల్లి