Working Hours | ఓ జాతీయ బ్యాంక్‌లో ఉద్యోగం వస్తే ఎంత బాగుంటుంది. పైగా అందులో వెంటవెంటనే పదోన్నతులు వచ్చేస్తే… విన్నవాళ్లకి ఈర్ష్య కలిగేంత అదృష్టంగా తోస్తుంది. కానీ పని ఒత్తిడి వల్ల అదే బ్యాంక్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంటే? ఓ యాభై ఏళ్ల క్రితం వరకట్న హత్యల గురించి వార్తలు వినిపిస్తే, ఇప్పుడు పని ఒత్తిడితో ఇలాంటి మరణాల వార్తలు ఎక్కువవుతున్నాయి. సమాజంలో అంతా సవ్యంగా ఉందని ఎలా అనుకోగలం? చదువుతోనో, మహిళలకు ఉద్యోగ స్వేచ్ఛతోనో మనలో పరిపక్వత వచ్చేసిందని ఎలా సంబరపడగలం? అందుకే మరోసారి వృత్తిగత-వ్యక్తిగత జీవితాల మధ్య సమన్వయం గురించి మాట్లాడుకోవాల్సిందే! లేకపోతే సంస్థలు, వ్యాపారవేత్తల విజయం కోసం పాటుపడే బడుగు జీవులకు ఆ లాభాల్లో వాటా ఎలాగూ దక్కదు సరికదా… సాయంకాలపు షికార్లు, పిల్లల కబుర్లు, ఇష్టమైన పాటలు, అనుబంధాలు, ఆరోగ్యాలూ… అన్నీ చేజారిపోతాయి. నష్టాల పేరుతోనో, వ్యవస్థీకరణ అంటూనో అదే సంస్థ చేయి విదిలించిన రోజు… తన భవిష్యత్ గడ్డివాములా చిటికెలో కాలిపోవడం కనిపిస్తుంది.
‘మీతో ఆదివారాలు కూడా పనిచేయించుకునే అవకాశం లేకపోవడం దురదృష్టం. అయినా ఇంటికి వెళ్లి ఏం చేస్తారు? ఎంతసేపని పెళ్లాం మొహం చూస్తూ కూర్చుంటారు? నేనైతే వారానికి 90 గంటలు పనిచేస్తాను’ దేశంలోనే అతిపెద్ద నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ కంపెనీ చైర్మన్ అన్నమాటలివి. ‘మన సంస్థను తప్ప నా కుటుంబాన్ని పట్టించుకోను. మీరు కూడా పట్టించుకోవడానికి వీల్లేదు. మీ కుటుంబం ఏమైపోయినా నాకు అనవసరం!’ ఓ జూమ్ మీటింగ్‌లో ఉన్నతాధికారి ఇచ్చిన తాఖీదు ఇది. పైకి చెప్పకపోవచ్చు, చెప్పినా అవి బయటికి రాకపోవచ్చు. కానీ, చాలా సందర్భాల్లో ఇలాంటి అభిప్రాయాలే యువతరంతో పనిచేయిస్తున్నాయి.
‘YourDOST’ అనే సంస్థ 21-30 ఏళ్ల వయస్కుల్లో ఒత్తిడిని నమోదు చేసే ప్రయత్నం చేసింది. ఇందుకోసం అయిదువేల మందిని ప్రశ్నించగా వారిలో 64 శాతం మంది ఉద్యోగంలో ఒత్తిడిని ఎదుర్కొంటున్నామని చెప్పుకొన్నారు. విచారించదగ్గ విషయం ఏమిటంటే మగవారితో పోలిస్తే, మహిళలు పని వాతావరణంలో మరింత ఒత్తిడికి లోనుకావడం. ఆఫీసుకు వెళ్లినా కూడా ఇల్లు, పిల్లల బాధ్యత కూడా తనదే అనే తీరు ఇందుకు కారణం కావచ్చు. వ్యక్తిగత జీవితాన్ని మాయం చేసేలా ఈ సమస్య ఎందుకు వస్తున్నది? దాని పర్యవసానాలు, పరిష్కారాలు ఓసారి తెలుసుకోవాల్సిందే!
Depression
ఒకచోట తన పాత్ర, బాధ్యత, ప్రవర్తన… మరో వ్యవస్థను ప్రభావితం చేస్తున్నదంటే కచ్చితంగా వృత్తి-కుటంబాల మధ్య సమన్వయం లోపించినట్టే. కానీ, అసలు సమస్య ఎందుకు వస్తున్నదీ అంటే కొన్ని స్పష్టమైన కారణాలు కనిపిస్తాయి.
☞ ఏ పనికి ఎంత సమయం ఇవ్వవచ్చు అనే విశ్లేషణ సంస్థల్లో లేకపోవడం. పై నుంచి వస్తున్న పనిని వచ్చినట్టుగా… కొంతమంది ఉద్యోగులతోనే పూర్తి చేయించే ప్రయత్నం. ఉద్యోగిని ఖాళీగా ఉంచకూడదు అనే దృక్పథం. పనిభారం ఎక్కువైనప్పుడు అది ఎంతైనా తట్టుకోవాల్సిందే అనే ఆలోచన.
☞ ముందు యంత్రాలు, తర్వాత కంప్యూటర్, తర్వాత కృత్రిమ మేధ… ఒక్కో తరంలో ఒక్కో సాంకేతికత పలకరిస్తున్నది. అది వెల్లువలా ముంచెత్తినప్పుడల్లా ఉద్యోగుల మదింపు ఉంటున్నది. వీటికి తోడు కొవిడ్, ఆర్థిక మాంద్యం, యుద్ధం లాంటి సందర్భాల్లోనూ ఉపాధికి కోత ఉంటున్నది. ఈ అనిశ్చితిలో ఉద్యోగాన్ని స్థిరంగా ఉంచుకునేందుకు మరింత శ్రమిస్తున్నారు.
☞ కొవిడ్ ముప్పు ఎప్పుడో తొలగిపోయింది. కానీ, అది అలవాటు చేసిన వర్క్ ఫ్రం హోమ్ మాత్రం అలాగే ఉండిపోయింది. పేరుకే ఇంట్లోంచి పని. కానీ అన్నివేళలా అందుబాటులో ఉండాల్సిందే. ఆఖరికి కంపెనీలు తెరుచుకున్నా సరే… ఇంటికి వెళ్లాక కూడా పనిచేసే సౌకర్యాన్ని యజమానులు వీలైనంత మేరకు వినియోగించుకుంటున్నారు.
☞ ఒకప్పుడు కార్మిక సంఘాలు ఉండేవి. ఉద్యోగుల తరఫున మాట్లాడేవి. సంస్థలో కూడా ఉద్యోగుల మధ్య స్పష్టమైన పని విభజన ఉండేది. ఇప్పుడు ఈ రెండు కొరవడటంతో ఎవరితో ఏ పనైనా చేయించవచ్చు, అడిగితే ఊరుకునేది లేదు అనే పరిస్థితి కనిపిస్తున్నది.
☞ ఎవరు ఎక్కువ పనిచేస్తే వాళ్లే గొప్ప, వ్యక్తిగత జీవితాన్ని ఎంతలా త్యాగం చేస్తే అంత మంచి ఉద్యోగి, ఆఫీసు పూర్తయినా… ఆదివారాలైనా అందుబాటులో ఉండేవాడిదే నిబద్ధత అనే తరహా భావనలు పెరిగిపోవడం. సమయానికి వచ్చి, సమయానికి వెళ్లిపోవడాన్ని బద్ధకంగా చూసే దృక్పథం.
☞ రోజుకు పది గంటలపాటు అజమాయిషీ చేయడం, పది గంటలపాటు శ్రమించడం రెండూ ఒకటే అనే అపోహలో ఉండే యజమానులు… తాము పనిచేస్తున్నాం కాబట్టి ఉద్యోగులు కూడా పనిచేయాలని కోరుకోవడం.
ఎంతవరకు పనిచేయాలి, చేయడం కుదరదని ఎప్పుడు చెప్పాలి, కుటుంబాన్ని తేలికగా తీసుకోకుండా వారికి ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వాలి, ఇంట్లో సమయం గడపడం అంటే కాలక్షేపం కాదు కలిసి ఉండటం… లాంటి ఎన్నో అంశాల్లో ఉద్యోగులలో అస్పష్టత, అయోమయం.
Narayana
కొన్ని దశాబ్దాల నుంచి, మరీ ముఖ్యంగా ప్రపంచీకరణ నేపథ్యంలో ఇంటికీ, ఆఫీసుకీ మధ్య సరిహద్దులు చెరిగిపోయిన పరిస్థితుల నుంచీ… వర్క్-లైఫ్ బ్యాలెన్స్ గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. పనిగంటల ప్రస్తావనా మోగుతున్నది. కానీ, గత ఏడాది ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి ఈ పనిగంటల గురించి కొన్ని కఠినమైన అభిప్రాయాలు చెప్పినప్పటి నుంచి వేడి రాజుకుంది. ఓ పాడ్‌కాస్టులో మాట్లాడుతూ మూర్తి ‘పేదరికాన్ని తప్పించుకోవాలి అంటే కష్టపడి పనిచేయాల్సిందే అని మా తల్లిదండ్రులు నేర్పారు. ఆ మాటను అనుసరిస్తూ నేను 70 గంటల పనివారాన్ని సూచిస్తాను. ఎన్నో ఏళ్లుగా నేను వారానికి 85-90 గంటలు పనిచేస్తూనే వచ్చాను. పొద్దున 6.20 కల్లా ఆఫీసుకు వెళ్లి, రాత్రి 8:30 తర్వాతే బయటికి వచ్చేవాడిని’ అన్నారు.
ఈ మాటలు తీవ్రమైన చర్చకు, ట్రోలింగ్కి దారితీశాయి. తన కెరీర్‌ను నిర్మించుకునే వ్యక్తికీ, ఇతరుల కోసం చాకిరీ చేసే వ్యక్తికీ మధ్య పనిలో ఉండే ఉత్సాహాన్ని, ఆ పని అందించే ఫలితాలను ఈ సూచన పట్టించుకోలేదన్నది అన్నిటికంటే ముఖ్యమైన విమర్శ. సంస్థల్లో తెలియకుండా పెరుగుతున్న పని ఒత్తిడికీ, యాజమాన్యాల అత్యాశకీ, కరిగిపోతున్న కుటుంబ సమయానికీ ఈ మాటలు ప్రతీక అని చాలామంది భావించారు. కానీ నారాయణమూర్తి మాత్రం తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. తన మాటలకు ఎంతోమంది నుంచి అభినందనలు వెల్లువెత్తాయని మురిసిపోయారు. భర్తకు అండగా నిలిచే సుధామూర్తి ఈ వ్యాఖ్యల విషయంలోనూ భర్తను బలపరిచారు.
వారానికి 70 గంటలు పనిచేసే అలవాటు తమ కుటుంబం అంతా ఉందని చెప్పారు. కానీ తమ వ్యాఖ్యల పట్ల మధ్యతరగతి కుటుంబాల్లో, సాధారణ ఉద్యోగులలో తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందని గ్రహించారో అప్పుడు మూర్తి స్వరం మారింది. అది తన వ్యక్తిగత అభిప్రాయం అనీ, ఎన్ని గంటలు పనిచేయాలీ అన్నది ఒకరి పరిస్థితులు, ఇష్టాయిష్టాలను బట్టి ఉంటాయని… వాటిని బలవంతంగా ఆపాదించలేమని చెప్పుకొచ్చారు.
పారిశ్రామిక విప్లవం మొదలయ్యాక ఎంత త్వరగా, ఎంత ఎక్కువసేపు పనిచేస్తే అంత వేతనం అన్న తీరు మొదలైంది. ‘ఒక మనిషికి ఓ పని అప్పచెప్పి… రోజంతా చెయ్యమన్నా చేస్తాడు, పావుగంటలో చేయమన్నా చేస్తాడు. కాబట్టి వీలైనంత తక్కువ సమయంలోనే చేయించుకునే ప్రయత్నం చేయాలి’ అనే నమ్మకం బలపడింది. దాంతో పనిగంటలు పెరిగిపోయాయి. వాటిని నియంత్రించేందుకు కార్మిక చట్టాలు వచ్చినా కూడా, వాటి ప్రభావం స్వల్పం. పైగా ఇంటర్నెట్, వర్క్ ఫ్రం హోం లాంటి పరిస్థితుల్లో ఏ పని ఎక్కడి నుంచైనా చేయించుకునే సౌలభ్యం వచ్చింది. ఆఫీసు కాస్తా నేరుగా పడకగదిలోకి దూరిపోయింది. దాంతో వృత్తి-కుటుంబాల మధ్య సమన్వయం గురించి రకరకాల సిద్ధాంతాలు మొదలయ్యాయి. వాటిలో కొన్ని…
బోర్డర్ థియరీ: కుటుంబం, ఆఫీసు, స్నేహితులు, చుట్టాలు… మనిషి ఇలా వేర్వేరు సామాజిక వ్యవస్థలలో ఉంటాడు. వీటిమధ్య కదులుతుంటాడు. వీటిలో ఏ ఒక్క వ్యవస్థ తనను కట్టడి చేసినా, ఇతర వ్యవస్థల్లోకి చొచ్చుకుపోయినా సమస్య తప్పదు.
బౌండరీ థియరీ: బోర్డర్ థియరీ పరిమితుల గురించి మాట్లాడితే బౌండరీ థియరీ పాత్రల గురించి చెబుతుంది. ఓ తండ్రిగా, భర్తగా, ఉద్యోగిగా, యజమానిగా, మిత్రుడిగా, బంధువుగా, వినియోగదారుడిగా… వేర్వేరు పాత్రలలో ఉండే మనిషి వాటిమధ్య అయోమయానికి గురైతే బంధాలు బీటలువారతాయి. ఉదా॥ ఉద్యోగిగా వచ్చిన చిరాకును భర్తగా చూపించడం.
కాంపెన్సేషన్ థియరీ: ఒక వ్యవస్థలో తనకు సంతృప్తి కలగకపోతే… మరో వ్యవస్థలో దానికి పరిహారం పొందే ప్రయత్నం చేస్తామనే సిద్ధాంతమే ఇది. ఇంట్లో సమస్యలు ఉంటే ఆఫీసులో మరింతగా కష్టపడటం, బాస్ సరిగ్గా లేకపోతే బార్లో సేదతీరడం ఈ కోవలోకే వస్తాయి.
ఇన్స్ట్రుమెంటల్ థియరీ: ఒక వ్యవస్థలో సంతోషం కోసం మరో వ్యవస్థలో మరింత తీవ్రంగా పనిచేస్తామని సూచించే సిద్ధాంతం ఇది. ఉదాహరణకు కుటుంబంతో కలిసి సెలవులకు వెళ్లేందుకు కొన్నాళ్లు ఆఫీసులో పడీపడీ పనిచేయవచ్చు. జీతం పెంచుతారనే ఆశతో ఇంటిని పట్టించుకోకపోవచ్చు.
ఇవే కాదు స్పిల్ ఓవర్, సెగ్మెంటేషన్, ఫోర్ బర్నర్, ఫెసిలిటేషన్… వ్యక్తిగత-వృత్తిగత సమన్వయాల గురించి చాలా సిద్ధాంతాలే ప్రచారంలో ఉన్నాయి. ఇవన్నీ చెప్పే మాట ఒక్కటే! కారణం ఏదైనా… పని, కుటుంబం రెండిటి మధ్య ఉండే విభజన రేఖ చెరిగిపోతే సమస్యలు తప్పవు. కానీ అలా జరిగిందని తెలుసుకునేదెలా? అందుకు పర్యవసానాలేంటి?
☞ ఉద్యోగపు ఒత్తిడితో ముందు పాడయ్యేది ఆరోగ్యం. రక్తపోటు పెరగడం, కుంగుబాటు, సంతానలేమి, కూర్చుని కూర్చుని మధుమేహం లాంటి సమస్యలు రావడంతో పాటు… చిన్నపాటి వైరస్‌ను ఎదుర్కోలేనంతగా రోగ నిరోధక శక్తి తగ్గిపోతుందని తేలింది. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ పరిశోధనలో వారానికి 55 గంటలకు మించి పనిచేసేవారిలో గుండెపోటు వచ్చే అవకాశం 13 శాతం ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు.
☞ గాలప్ అనే సంస్థ కనీసం 74 శాతం మంది ఉద్యోగులు ఏదో ఒక సమయంలో తట్టుకోలేని ఒత్తిడిని అనుభవిస్తున్నారనీ, ఓ 23 శాతం అయితే ఏకంగా హాస్పిటల్లో చేరుతున్నారని తేల్చింది.
☞ ఎక్కువ పనిచేయడం వల్ల ఎక్కువ ఉత్పాదకత పెరగడం అనేది భ్రమే అంటున్నారు. విరామం లేకుండా పనిచేయడం వల్ల ‘బ్రెయిన్ ఫాగ్’ లాంటి సమస్యలతో ఏకాగ్రత లోపిస్తుంది. నిస్సత్తువ, తలనొప్పి, అయోమయం లాంటి ఇబ్బందులు తలెత్తుతాయి.
☞ ఒకప్పుడు దశాబ్దాల తరబడి ఒకే సంస్థలో ఉద్యోగాలు చేసేవారు. కానీ, ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. దీనికి ముఖ్య కారణం ఒత్తిడి అని పేర్కొంటున్నారు. ఈ విషయమై ‘క్రోనోస్’ అనే సంస్థ తలపెట్టిన అభిప్రాయ సేకరణలో 46 శాతం మంది మానవవనరుల అధికారులు… ఉద్యోగులు మానేయడానికి ఒత్తిడే ముఖ్య కారణంగా పేర్కొన్నారు. ఈ పరిస్థితి దీర్ఘకాలికంగా అటు యాజమాన్యానికీ, ఇటు ఉద్యోగులకు కూడా నష్టమే కలిగిస్తుంది.
☞ గాలప్ సంస్థ చేసిన మరో సర్వేలో కేవలం 21 శాతం మందే తాము చేస్తున్న పనిని ఇష్టపడుతున్నట్టుగా చెప్పారు. మూడోవంతు మంది మాత్రమే వృత్తితోపాటు వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకోగలుగుతున్నట్టు ఒప్పుకొన్నారు.
☞ చాలామంది ఎక్కువ పని ఒత్తిడితో జీవితమంటేనే విరక్తి చెందుతున్నారు. ఆర్థిక సమస్యలు ఎదురైనా సరే, ఎంత విలువైన ఉద్యోగాన్నయినా సరే తృణప్రాయంగా వదిలేస్తున్నారు. క్వైట్ క్విటింగ్, గ్రేట్ రెజిగ్నేషన్ లాంటి ట్రెండ్స్ ఇందుకు అద్దం పడుతున్నాయి. పనికి మారుపేరుగా నిలిచే జపాన్‌లాంటి దేశాల్లోనే ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తున్నదంటే… పనితో జనం ఎంతగా విసిగిపోయారో అర్థం చేసుకోవచ్చు.
Family
అనుమానం లేదు. కుటుంబం, ఉద్యోగాల మధ్య వైరుధ్యం స్పష్టంగానే ఉంది. కానీ ఇదేమీ పరిష్కారం లేని సమస్య కాదు. పెద్దల దగ్గర నుంచి వ్యక్తిత్వ వికాస నిపుణుల వరకూ చాలామంది చెబుతున్న సూచనల్లో కొన్ని ముఖ్యమైనవి ఇవీ!
☞ ఆఫీసు కూడా కుటుంబంలాంటిదే అని చెప్పడం తేలికే. కానీ ఉద్యోగి తన అసలు కుటుంబానికి కూడా కాస్త సమయం కేటాయించేలా సంస్థలే వెసులుబాటు కల్పించాలి. కచ్చితమైన పనివేళలు, నైపుణ్యానికి తగిన పని, శ్రమకు తగిన గుర్తింపు… ఇవేవీ అసాధ్యం కాదు. అవసరం కూడా! సంస్థకు ఏం కావాలి, ఉద్యోగి ఏం చేయాలనుకుంటున్నాడు అనే అంశాల మధ్య సమన్వయం సాధిస్తే పని తేలికైనట్టే!
☞ మానవవనరుల విభాగం అంటే కేవలం ఉద్యోగులను నియమించే, తొలగించే, సదుపాయాలు కల్పించే వ్యవస్థగానే ఇప్పటికీ ఉంది. అది యజమానికి అనుగుణంగానే పనిచేస్తుందనే అపప్రథ బలపడుతూనే వస్తున్నది. ఉద్యోగులతో వ్యక్తిగతంగా మాట్లాడటం, వారి ఇబ్బందులను తెలుసుకోవడం లాంటి చర్యలు ఉండాలి. అవసరమైతే ఒక మానసిక నిపుణుడు కూడా అందుబాటులో ఉండాలి.
☞ సెలవులను వాడుకోవడం ఓ హక్కు. చేస్తున్న పనికి ప్రతిఫలం. కుటుంబంతో గడిపేందుకు, సేదతీరేందుకు అవకాశం. అందుకే చాలా సంస్థలు సెలవులను పూర్తిగా వాడుకోమంటూ ప్రోత్సహిస్తున్నాయి.
☞ షిఫ్ట్ డ్యూటీలలో పనిచేసేవారికి ఈ వర్క్-లైఫ్ సమన్వయం మరింత గడ్డుగా మారుతుంది. వీరికి Compressed Working Week అమలుచేయాలని సూచిస్తున్నారు. వారంలో నాలుగు రోజులు ఎక్కువ గంటలు పనిచేసి, మిగతా మూడు రోజులు సెలవు తీసుకోవడం ఈ విధానానికి ఓ ఉదాహరణ.
☞ ఇంట్లో మొబైల్ ఫోన్ల వాడకం శ్రుతిమించడం వల్ల అందులో ఉండే ఆఫీసు పనుల మీద దృష్టి మళ్లుతుందనీ, అలాకాక కాలక్షేపం కోసం ఫోన్ చూసినా… కుటుంబంతో గడిపే సమయం మీద ప్రభావం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
☞ భార్యాభర్తలు ఇద్దరూ ఇంటి పనిని పంచుకోవడం వల్ల ఆఫీసు ఒత్తిడిని మర్చిపోతారనీ, కుటుంబంతో బంధాన్ని పెంచుకుంటారనీ పరిశోధనలు చెబుతున్నాయి.
☞ వృత్తి నైపుణ్యాలను పెంచుకోవడం వల్ల ఉద్యోగ భద్రత పెరుగుతుంది. తక్కువ పనివేళలతో ఎక్కువ ప్రభావాన్ని చూపగలుగుతారు. నచ్చిన సంస్థను ఎంపిక చేసుకోగలుగుతారు. ఆఫీసు రాజకీయాలతో పనిలేకుండా రాణించగలుగుతారు. అలాంటివారి వృత్తి-వ్యక్తిగత జీవితాల మధ్య సమన్వయం ఎక్కువగా ఉన్నట్టు తేలింది.
ఇవి కొన్ని సూచనలు మాత్రమే! సమస్య ఉందీ అని గుర్తించడమే కీలకం. అది స్పష్టమయ్యాక అటు యాజమాన్యాలు, ఇటు ఉద్యోగులు ఏదో ఒక పరిష్కారం కోసం ప్రయత్నించినప్పుడు సవాలక్ష మార్గాలు కనిపిస్తాయి. ఇంట్లో వ్యక్తులు కూడా తమ మధ్యే తిరుగుతూ మధనపడుతున్న ఆ వ్యక్తి బాధను గుర్తించే ప్రయత్నం చేయాలి. ‘ఏదో ఆఫీసు గొడవ అయి ఉంటుంది’ అని సరిపెట్టుకోకుండా తన బాధను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇంటికి వచ్చాక ఆఫీస్ మెయిల్స్ చూసుకోవడం, అవసరమైనప్పుడు వాటికి జవాబు ఇవ్వడం చాలా చిన్నవిషయంగా తోచవచ్చు. కానీ అలాంటి పనులు కూడా వ్యక్తిగత జీవితంలోకి చొరబాటే అంటున్నది వర్జీనియా టెక్ వెలువరించిన ఓ పరిశోధన పత్రం.
రోజూ కాసేపు వ్యాయామం చేయడం వల్ల మరింత ఆత్మవిశ్వాసంగా, చురుగ్గా పని చేయగలమనీ… తద్వారా ఉద్యోగపు ప్రభావం వ్యక్తిగత జీవితం మీద ఉండదని ఓ 500 మంది మీద జరిగిన పరిశోధనలో తేలింది.
వర్క్-లైఫ్ బ్యాలెన్స్ మనుషుల సమస్య మాత్రమే కాదట. పుట్టిన పిల్లల్నీ, వేటనీ చూసుకోవాల్సిన సింహాలు; పెద్ద గుంపు మధ్య ఉండే చీమలకు కూడా ఈ ఇబ్బంది ఉన్నదట.
డెస్క్ పక్కన ఓ చిన్న మొక్క పెట్టుకోవడం లేదా… పనిచేసేవారికి కనిపించేట్టుగా మొక్కలు ఉంచడం వల్ల పని ఒత్తిడి తగ్గి ఇంటికి దగ్గరగా ఉన్న భావన కలుగుతుందని జపాన్‌లోని హ్యోగో విశ్వవిద్యాలయంలో జరిగిన పరిశోధన చెబుతున్నది.
పని ఒత్తిడి ఎక్కువగా ఉండేవారు తమ పిల్లల పోషక అవసరాలను సరిగా తీర్చలేకపోతున్నారని ‘టెంపుల్ యూనివర్సిటీ’ పరిశోధన నిరూపించింది. 3,700 మంది తల్లిదండ్రులను పరిశీలించాక తేల్చిన విషయమిది.
వారానికి 70 లేదా 90 గంటలు పనిచేయాలన్న మాట పెద్ద చర్చకే దారితీసింది. ఈ సందర్భంగా కొందరు వ్యాపారవేత్తలు చెప్పిన అభిప్రాయాలు కూడా ఆసక్తికరంగానే ఉన్నాయి.
1 ఎంతసేపు పని చేశాం అన్నది కాదు… ఎంత నాణ్యంగా పనిచేశామన్నదే ముఖ్యం. అయినా ఇంట్లో గడపకుండా, స్నేహితులతో మాట్లాడకుండా, పుస్తకాలు చదవకుండా, ఆలోచించడానికే సమయం ఇవ్వకుండా… మనం సరైన నిర్ణయాలను ఎలా తీసుకోగలం? (ఆనంద్ మహీంద్ర – మహీంద్ర గ్రూప్ చైర్మన్)
2 మన దేశంలో పని సంస్కృతి మారాలి. పై స్థాయిలో వ్యక్తులు కేవలం కబుర్లతోనే ఆగిపోకూడదు. ఆ మాటకు వస్తే ఎక్కువ గంటలు పనిచేయాలనే సిద్ధాంతం వారితోనే మొదలైతే బాగుంటుంది. (రాహుల్ బజాజ్ – బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్)
3 నేను వారానికి వంద గంటలు పనిచేసిన రోజులు కూడా ఉన్నాయి. దానివల్ల నా ఆరోగ్యం దెబ్బతిన్నది. ఒత్తిడితో ఏడ్చేదాన్ని. కానీ ఎంత ఎక్కువ పనిచేస్తే అంత ఉత్పాదకత అన్న భ్రమలు తొలగిపోయాయి. ఎంత తెలివిగా, సులువుగా పనిచేస్తామో అంత ఉత్పాదకత వస్తుంది. (రాధిక గుప్త – ఎడల్వెస్ మూచ్యువల్ ఫండ్ సీఈఓ)
4 అతిగా పనిచేయడం విజయానికి కాదు, అనారోగ్యానికి దారితీస్తుంది. వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యం ఇవ్వడం అనేది ఓ ఎంపిక కాదు అవసరం. నా దృష్టిలో తెలివిగా పనిచేయడానికీ బానిసలా పనిచేయడానికీ తేడా ఉంది. (హర్ష్ గోయెంకా – ఆర్పీజీ గ్రూప్ చైర్మన్)
పని ఒత్తిడి… ఆధునిక జీవితం కోసం చేసిన త్యాగమో, కష్టపడటం వల్ల ఏర్పడే దుష్ప్రభావమో కాదు. దాన్ని ఓ సామాజిక సమస్యగా అందరూ గుర్తించినప్పుడే వ్యక్తికీ, తను చేసే పనికీ, తను భాగస్వామి అయిన సమాజానికి విలువ, సార్థకత!
– కె.సహస్ర