పండుగలు, ఫంక్షన్లప్పుడు అతివలు స్పెషల్‌గా కనిపించాలని కోరుకుంటారు. దానికోసం వారం ముందు నుంచే రకరకాల బ్యూటీ టిప్స్ ఫాలో అవుతుంటారు. అసలు రోజు వేకప్ అయింది మొదలు మేకప్ చేసుకుంటూనే ఉంటారు. సెలెబ్రిటీల నుంచి సామాన్యుల వరకు దీనికి అతీతులేం కాదు. అయితే, మేకప్ వేసుకోవడం అన్ని సందర్భాల్లోనూ సాధ్యం కాకపోవచ్చు. పైగా ఖర్చుతో కూడుకున్న పని. అదేపనిగా వేసుకున్నా.. చర్మ సహజత్వం దెబ్బతింటుంది. అయితే మేకప్ లేకుండా కూడా ముఖారవిందాన్ని కమలం కన్నా కోమలంగా తీర్చిదిద్దుకోవచ్చు.
రోజువారీ జీవనశైలిలో చిన్నపాటి మార్పులతో సహజ సిద్ధమైన మెరుపు పొందవచ్చు. ప్రతిరోజూ ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగడం తప్పనిసరి. దీనివల్ల శరీరంలోని టాక్సిన్లు బయటికి వెళ్లిపోతాయి. దాంతో చర్మం సహజంగా కాంతిని సంతరించుకుంటుంది.
వారానికి రెండుసార్లయినా ఐస్‌క్యూబ్స్‌తో ముఖంపై మర్దనా చేసుకుంటూ ఉండాలి. ఐదారు నిమిషాల పాటు ఇలా చేస్తే.. చర్మం తేలికగా మారుతుంది. ముడతలు తగ్గి చర్మం బిగుతుగా తయారవుతుంది. దద్దుర్లు ఉంటే తగ్గిపోతాయి.
మానసిక ఒత్తిడి, శారీరక బడలిక వల్ల కండ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. రోజూ పడుకునే ముందు అలోవెరా జెల్‌తో గానీ, కొబ్బరి నూనెతో గానీ కండ్ల కింద మర్దనా చేయాలి. పడుకునే ముందు ముఖాన్ని మంచినీటితో శుభ్రంగా కడుక్కోవాలి. అప్పుడు ముఖంపై చేరిన దుమ్ము కణాలు తొలగిపోయి చర్మం మృదువుగా కనిపిస్తుంది. ఈ టిప్స్ ఫాలో అయిపోతే.. మేకప్ లేకుండానే మీరు షో స్టాపర్‌గా కనిపిస్తారు.