బయటికి అడుగు పెట్టామంటే సాయంత్రంలోపు రెండు మూడు కప్పుల టీ, కాఫీలన్నా లాగించకపోతే తోచని వాళ్లు చాలామందే ఉంటారు. ప్రయాణాలు, ఆఫీసు ఇలా ఎక్కడైనా సరే బయట టీ తాగుతున్నాం అంటే అది సాధారణంగా ఒక్కసారి వాడిపారేసే డిస్పోజబుల్ కప్పుల్లోనే ఉంటుంది. అయితే దీనికి బదులు మనం సొంత కప్పును తీసుకువెళితే ఆరోగ్యాన్ని ఎంతో కాపాడుకున్న వాళ్లమవుతాం అంటున్నారు ఆరోగ్యనిపుణులు. సాధారణంగా పేపర్ కప్‌లకు లోపలివైపు ప్లాస్టిక్ లైనింగ్ ఉంటుంది.
వేడి ద్రవాలు తగలగానే ఈ లైనింగ్ నుంచి సూక్ష్మమైన ప్లాస్టిక్ అణువులు వాటిలోకి చేరిపోతాయి. కాఫీ/ టీల ద్వారా శరీరంలోకీ వెళతాయి. అధ్యయనాల ప్రకారం 80 నుంచి 90 డిగ్రీల సెల్షియస్ ఉండే 100 మిల్లీ లీటర్ల ద్రవంలోకి 15 నిమిషాల్లో 25,000 ప్లాస్టిక్ రేణువులు విడుదల అవుతాయట. ఆ లెక్కన ఒక మూడు కప్పుల కాఫీ, టీలు తాగితే మనకు తెలియకుండానే శరీరంలోకి 75,000 ప్లాస్టిక్ రేణువులు చేరుకుంటాయి.
క్రమేణా అవి మన శరీరంలోని ప్రధాన భాగాలైన గుండె, మెదడు, గర్భిణిగా ఉండే వారిలో మాయ… ఇలా వివిధ భాగాల్లో చేరిపోతుంటాయి. దీంతో ఊబకాయం, హార్మోన్ల అసమతుల్యత, నరాల సమస్యలతో పాటు క్యాన్సర్‌లాంటి జుబ్బులూ వచ్చే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. అందుకే బయటికి వెళ్లినప్పుడు వాటర్‌బాటిల్ తీసుకెళ్లినట్టే స్టీలు, గాజు, పింగాణీలాంటి వాటితో చేసిన సొంత టీ కప్పును తీసుకువెళ్లడం ద్వారా ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చని సూచన చేస్తున్నారు.