Hair Split Ends | చర్మ సౌందర్యం ఎంత ముఖ్యమో జుట్టు ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమైనది. ఎంత అందంగా తయారైనా కూడా జుట్టు సరిగా లేకపోతే ఆకర్షణీయంగా కనిపించరు. అందుకే జట్టు ఆరోగ్యం కోసం మనవాళ్లు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. జుట్టు చివర్లు చిట్లిపోయే సమస్య సాధారణంగా చాలా మంది ఆడవాళ్లలో కనిపిస్తుంది. మనం తీసుకునే ఆహారంలో పోషకాల లోపం కారణంతోపాటు వాయు కాలుష్యం వల్ల జుట్టు సమస్యలు వస్తుంటాయి. కొందరిలో జుట్టు రాలిపోతుండగా.. మరికొందరిలో చుండ్రు సమస్య వేధిస్తుంటుంది. ఇంకొందరిలో జుట్టు చివర్లలో చిట్లిపోతుంటుంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఇంటి పట్టునే తయారుచేసుకునే మాస్కులతో ఎంతో ఉపయోగం ఉంటుంది.
కోడిగుడ్డులో విటమిన్ ఏ, బీ, ఈ లతో పాటు వివిధ ఖనిజాలు ఉండి జుట్టును మెరిసేలా మృదువుగా చేస్తుంది. జుట్టు చివర్లు చిట్లిపోకుండా గుడ్డు సొన కాపాడుతుంది. పెరుగు స్కల్ఫ్ ఎక్స్‌ఫోలియేషన్‌లో, గుడ్డు వాసనను తొలగించడంలో సాయపడుతుంది. రోజ్మేరీ ఆయిల్ జుట్ట రాలకుండా కాపాడుతుంది.
కావాల్సిన పదార్థాలు : కోడిగుడ్లు, రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్, అలీవ్ ఆయిల్, పెరుగు
తయారీ విధానం : ఒక గిన్నెలో 2 స్పూన్ల పెరుగు తీసుకుని 2 నిమిషాలు గిలకొట్టాలి. దీనికి రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్, ఆలివ్ ఆయిల్‌ను చేర్చి బాగా కలపాలి. ఈ మాస్క్‌ను స్కాల్ప్స్ నుంచి చివర్ల వరకు అప్లై చేసి షవర్ క్యాప్‌తో కప్పుకోవాలి.
జెలటిన్ జుట్టుకు అద్భుతమైన ప్రోటీన్ అందిస్తుంది. ఇది జుట్టు ఆకృతిని మెరుగుపరచడానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. జుట్టును నిటారుగా, మెరిసేలా చేస్తుంది. ఇందులో వాడే గుడ్డు పచ్చసొన జుట్టుకు అవసరమైన పోషకాలను అందిస్తుంది. పొడి జుట్టు ఉన్నవారు కొంచెం తేనెను కలుపుకోవాలి. ఈ మాస్క్ జుట్టును బలపడేలా చేయడమే కాకుండా జుట్టు పగుళ్లను తగ్గిస్తుంది.
కావాల్సిన పదార్థాలు : జెలటిన్ పొడి, వేడి పాటు, కోడిగుడ్డు పచ్చసొన
తయారీ విధానం : ఒక గిన్నెలో తగినంత గోరువెచ్చని నీరు వేసి జెలటిన్ పొడిని కలపాలి. తర్వాత వేడి పాలు, గుడ్డు పచ్చసొనను వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు పొడవు అంతటా అప్లై చేసి షవర్ క్యాప్‌తో కప్పి పెట్టాలి. జెలటిన్ పొడి నీటిలో వేయగానే తొందరగా గట్టిపడుతుంది. అలా కాకుండా ఉండేందుకు తప్పనిసరిగా ఆవిరి పట్టాలి. మాస్క్‌ను కనీసం 15-30 నిమిషాలు ఉంచుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
అవకాడోలో కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉండి పొడి, చిట్లిన జుట్టుకు అద్భుతంగా పనిచేస్తుంది. అవోకాడో, అరటిపండు రెండూ మంచి పోషకాలను కలిగి ఉంటాయి. కాగా, జోజోబా ఆయిల్ జుట్టును లోపలికి తేమగా ఉంచడంలో సాయపడుతుంది.
కావాల్సిన పదార్థాలు : అవకాడో, జోజోబా నూనె, అరటిపండు
తయారీ విధానం : గిన్నెలో ఒలిచిన అరటిపండు, నాలుగో వంతు అవకాడో ముక్కను కలపాలి. ఫోర్క్ లేదా బ్లెండర్ ఉపయోగించి వీటిని బాగా మాష్ చేసి.. ఒక చెంచా జోజోబా ఆయిల్ కలపాలి.
ఈ మాస్క్‌ను అప్లై చేసి తలను షవర్ క్యాప్‌తో కప్పుకోవాలి.
గుడ్లు జుట్టుకు పోషకాలను అందించడమే కాకుండా జుట్టు ఘాటైన వాసనను వదిలివేసేలా చేస్తుంది. తేనె కూడా మరొక అద్భుతమైన పదార్ధం. ఇది జుట్టుకు తేమను అందిస్తుంది. పొడిని తొలగిస్తుంది. ఆలివ్ ఆయిల్ తల చర్మం పోషణకు సాయపడుతుంది.
కావల్సిన పదార్థాలు : కోడిగుడ్డు, తేనె, ఆలివ్ ఆయిల్
తయారీ విధానం : గిన్నెలో గుడ్డు వేసి అందులో తేనె, ఆలివ్ ఆయిల్ కలపాలి.
దీన్ని జుట్టు చివరికల్లా అప్లై చేసి 30 నిమిషాల పాటు అలాగే ఉంచి షాంపూతో కడిగేయాలి.
ఇది పొడి, చిట్లిన జుట్టు కోసం అద్భుతమైన మాస్క్. బడ్జెట్ ఫ్రెండ్లీ మాస్క్ కూడా. ఇది తల చర్మం, జుట్టు తంతువులను లోతుగా తేమగా చేస్తుంది. మరోవైపు పెరుగు స్కాల్ప్ ఎక్స్‌ఫోలియేషన్‌కు సహాయపడుతుంది. ఈ మాస్క్‌లో ఉండే లాక్టిక్ యాసిడ్ జుట్టును మెరిసేలా చేస్తుంది.
కావాల్సిన పదార్థాలు : పెరుగు, అవకాడో
తయారీ విధానం : ఒక గిన్నె తీసుకుని పెరుగు, అవకాడోను కలపండి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసి 20-30 నిమిషాలు అలాగే ఉంచాలి. తలను షవర్ క్యాప్ కప్పిపెట్టి ఉంచాలి.
అలోవేరా జుట్టు, చర్మ సమస్యలకు అద్భుతమైన పరిష్కారం. ఇది జుట్టు చీలిక చివర్లకు చికిత్స చేస్తుంది. జిడ్డు జుట్టు ఉన్నవారికి ఈ మాస్క్ ఒక అద్భుతమైన ఎంపిక. కలబంద జుట్టుకు పోషణను అందివ్వడమే కాకుండా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. సన్‌ఫ్లవర్ ఆయిల్ జుట్టుకు కూడా చాలా మంచిది. ఇందులో విటమిన్ ఈ అధికంగా ఉండి.. స్కాల్ప్, హెయిర్‌ని హైడ్రేషన్లో సాయపడుతుంది.
కావాల్సిన పదార్థాలు : అలోవేరా జెల్, సన్‌ఫ్లవర్ ఆయిల్
తయారీ విధానం : స్వచ్ఛమైన అలోవెరా జెల్లో ఒక చెంచా సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను కలపాలి.
జెల్ అందుబాటులో లేకపోతే తాజాగా సేకరించిన కలబంద గుజ్జును కూడా ఉపయోగించవచ్చు. దీన్ని బ్లెండర్ సహాయంతో బాగా కలిపి జుట్టు పొడవున అప్లై చేయాలి. ఈ మాస్క్‌ను 30 నిమిషాలు ఉంచుకోవడం ద్వారా మంచి ఫలితం పొందవచ్చు.