Chandigarh : చండీగఢ్‌లో దారుణం జరిగింది. ఒక యువతిని కిడ్నాప్ చేసి, చెట్టుకు కట్టేసి దహనం చేశారు నిందితులు. ఆ యువతి 54 రోజులు చికిత్స పొందుతూ గత బుధవారం మరణించింది. తన కుమార్తె మృతిపై బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలివి. చండీగఢ్‌లోని సెక్టార్ 123లో ఉండే మంజీత్ కౌర్ (28) అనే యువతి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, ఇన్ఫ్లుయెన్సర్గా పేరు తెచ్చుకుంది.
ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాకు 1.46 లక్షల మంది ఫాలోవర్లున్నారు. జూలై 3న ఆమె శుభి, పిండా అనే వ్యక్తుల్ని కలవడానికి సెక్టార్ 34లోని ఒక లిక్కర్ షాప్ వద్దకు వెళ్లింది. మంజీత్ అక్కడకు వెళ్లగానే వారు ఆమెను కారులో ఎక్కించుకుని, మోరిండా వైపు తీసుకెళ్లారు. అక్కడి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి, చెట్టుకు కట్టేసి ఆమెను దహనం చేశారు. పక్కనే ఉన్న ఒక వ్యక్తి వచ్చి, మంటల్ని ఆర్పాడు. అనంతరం ఆమెను మొహాలిలోని ఒక ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత జూలై 9న మెరుగైన చికిత్స కోసం చండీగఢ్‌లోని పీజీఐ ఆస్పత్రికి తరలించారు.
అప్పటికే ఆమె శరీరం కాలిపోవడంతో కోమాలో ఉండిపోయింది. ఆగష్టు 5న కోమాలోంచి బయటకు వచ్చింది. మంజీత్.. కోమాలోంచి బయటకు వచ్చిన తర్వాత జరిగిన విషయం చెప్పింది. తర్వాత ఆగష్టు 26న మరణించింది. మృత్యువుతో 54 రోజులు పోరాడి ప్రాణాలు కోల్పోయింది. అయితే, పోలీసులు ఆమె వాంగ్మూలం తీసుకోలేదని తల్లి కాంతా దేవి ఆరోపించింది. మంజిత్ భర్త నుంచి విడాకులు తీసుకోగా.. ఆమెకు ఏడేళ్ల కొడుకు ఉన్నాడని ఆమె తల్లి తెలిపింది. మంజీత్ మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులపై కిడ్నాప్, మర్డర్ సహా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.