హోలీ వేడుకలను దేశవ్యాప్తంగా వైభవంగా జరుపుకొంటారు. అన్నిచోట్లా హోలికా దహనం, రంగులు చల్లుకోవడంతోపాటు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. అయితే, కొన్ని ప్రాంతాల్లో మాత్రం.. హోలీ పండుగను వినూత్నంగా నిర్వహిస్తారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ‘బర్సానా’ పట్టణంలో.. ‘లఠ్మార్ హోలీ’ జరుపుకొంటారు. శ్రీకృష్ణుడు-రాధ నేపథ్యంలో ఈ వేడుక సాగుతుంది. హోలీ నాడు బర్సానా పొరుగున ఉండే
నందగావ్ నుంచి పెద్ద ఎత్తున పురుషులు తరలివస్తారు. అలా బార్సానాకు వచ్చిన వారిని స్థానిక వనితలు కర్రలు పట్టుకొని తరుముతారు. అప్పుడు మగవాళ్లు తమను తాము రక్షించుకోవడానికి ప్రయత్నిస్తారు. సందడి వాతావరణంలో జరిగే ఈ వేడుక ఆద్యంతమూ ఆహ్లాదభరితంగా సాగుతుంది.
విశ్వేశ్వరుడు కొలువైన వారణాసిలో.. శ్మశానంలో దొరికే బూడిదను చల్లుకుంటూ హోలీ పండుగను చేసుకుంటారు. ‘మసాన్ హోలీ’గా పిలిచే ఈ వేడుకలో సాధువులు, శివ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. పరమేశ్వరుడిని పూజించిన అనంతరం.. చితిలోని బూడిదతో హోలీ నిర్వహిస్తారు.
గోవాలో.. ‘షిగ్మో’ పేరుతో వేడుకలు నిర్వహిస్తారు. గోవా సంప్రదాయ జానపద సంగీతం, నృత్యాలతో ఆనందంగా గడుపుతారు. ప్రజలు రంగురంగుల దుస్తులు ధరించి వీధుల్లో ఊరేగింపులు నిర్వహిస్తారు.
రాజుల నగరం ఉదయ్‌పూర్‌లో.. హోలీ వేడుకలు రాజరికపు వైభవంతో సాగుతాయి. అందుకే, ఈ వేడుకలకు ‘రాయల్ హోలీ’ అని పేరు. రాజస్థాన్‌లోనే అతిపెద్దదైన సిటీ ప్యాలెస్‌లో జరిగే ఈ వేడుకల్లో స్థానిక రాజకుటుంబాల వారసులు పాల్గొంటారు. స్థానికులు, సందర్శకులూ పెద్ద సంఖ్యలో తరలివస్తారు. సంప్రదాయ రాజస్థానీ సంగీతం, జానపద నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
దేశవ్యాప్తంగా రంగులతో సాగిపోయే హోలీ వేడుకలు.. శ్రీకృష్ణుడి జన్మస్థలమైన బృందావనంలో మాత్రం సువాసనలు పులుముకుంటాయి. ఇక్కడ రంగురంగుల పూలను చల్లుకుంటూ హోలీ సంబురాలు జరుపుకొంటారు. బృందావన్ దేవాలయాలకు వేలసంఖ్యలో భక్తులు తరలివస్తారు. రాధ-కృష్ణులుగా భావిస్తూ.. ఒకరిపై ఒకరు పూలు చల్లుకుంటారు.