ప్రస్తుతం చాలామంది ‘హెయిర్ స్టయిలింగ్ టూల్స్’ను వాడుతున్నారు. జుట్టును స్ట్రెయిట్‌గా, కర్లీగా.. రకరకాలుగా మార్చేసుకుంటున్నారు. అయితే, ఇలా చేయడం వల్ల జుట్టు అందంగా కనిపించినా.. దీర్ఘకాలంలో సమస్యలు వస్తాయని సౌందర్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. హెయిర్ స్టయిలింగ్ టూల్స్ నుంచి వెలువడే అధిక వేడి వల్ల కుదుళ్లు, జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుందని చెబుతున్నారు. వెంట్రుకల చివర్లు చిట్లిపోవడం, పొడిబారిపోవడం, తెగిపోవడం లాంటి సమస్యలు వస్తాయని అంటున్నారు. ఇలా దెబ్బతిన్న జుట్టుకు మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలంటే.. కొన్ని చిట్కాలు పాటించాలని సూచిస్తున్నారు.
పొడి జుట్టు సమస్యను పరిష్కరించడంలో పెరుగు, నూనె సమర్థంగా పనిచేస్తాయి. ఒక గిన్నెలో అరకప్పు పెరుగు, రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ నూనె, ఆరు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి. తక్కువ గాఢత కలిగిన షాంపూతో తలస్నానం చేసిన తర్వాత.. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు బాగా పట్టించాలి. ఆ తర్వాత నెత్తిని ప్లాస్టిక్ లేదా షవర్ క్యాప్‌తో కప్పి ఉంచాలి. 15-20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే.. జుట్టు సున్నితంగా మారుతుంది. జుట్టురాలడం కూడా తగ్గుతుంది.
పొడిబారిన జుట్టుకు మళ్లీ తేమను అందించడంలో కొబ్బరినూనె దివ్యౌషధమే! వెంట్రుకలు కుదుళ్ల నుంచి బలంగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది. ఒక గిన్నెలో టేబుల్ స్పూన్ ఆర్గాన్ ఆయిల్, రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె తీసుకోవాలి. ఇందులో ఒక విటమిన్ ఇ క్యాప్సుల్, కొద్దిగా షియా బటర్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి.. గంట తర్వాత తక్కువ గాఢత కలిగిన షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తే వేడివల్ల దెబ్బతిన్న జుట్టుకు తేమ అందుతుంది.