వేసవిలో ‘చియా విత్తనాలు’ ఓ దివ్యౌషధం! ఎండల్లో ఎదురయ్యే అనేక సమస్యలకు ‘చియా వాటర్’ అమృతంతో సమానం! అయితే, చలికాలంలోనూ ‘చియా సీడ్స్’ తీసుకోవడం మంచిదేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ‘చియా వాటర్’తో శీతకాలపు సమస్యలకు చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు.
సాధారణంగా చల్లటి వాతావరణంలో నీళ్లు తక్కువగా తాగుతుంటారు. ఫలితంగా శరీరం డీహైడ్రేషన్‌కు గురవడంతోపాటు జీర్ణక్రియ మందగిస్తుంది. ఈ రెండు సమస్యలకూ ‘చియా సీడ్స్’ చక్కని పరిష్కారం చూపుతాయి. ఒక గ్లాస్ నీటిలో రెండుమూడు టేబుల్ స్పూన్ల చియా విత్తనాలు వేసి.. రాత్రంతా నానబెట్టాలి. ఆ నీటిని ఉదయం పరగడుపునే తాగితే.. శరీరం రోజంతా హైడ్రేటెడ్‌గా ఉంటుంది. పీచు పదార్థం పుష్కలంగా లభించి.. జీర్ణక్రియ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మలబద్ధకం నుంచీ ఉపశమనం లభిస్తుంది.
చలికాలంలో చర్మ సమస్యలు ఎక్కువగా వేధిస్తుంటాయి. చియా విత్తనాల్లో ఉండే యాంటి ఆక్సిడెంట్లు.. చర్మం తేమను కోల్పోకుండా కాపాడుతాయి. చర్మ సమస్యలను దూరం చేయడంతోపాటు చర్మంపై మచ్చలను తగ్గించేందుకూ సాయపడుతాయి. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు చర్మ సంరక్షణలోనూ ముందుంటాయనీ, చర్మం పొడిబారడాన్ని తగ్గిస్తాయనీ జర్నల్ ఆఫ్ డెర్మటోలాజికల్ సైన్స్ పరిశోధన చెబుతున్నది.
చియా గింజల్లో యాంటి ఆక్సిడెంట్లు ఎక్కువ. ఇవి ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షించడంలో సాయపడతాయి. ఇందులోని యాంటి ఇన్ఫ్లమేటరీ, యాంటి క్యాన్సర్ లక్షణాలు.. కణాల నష్టాన్ని నివారిస్తాయి.
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అంటేనే.. సాల్మన్ చేపలు గుర్తొస్తాయి. కానీ, వాటిలో కంటే ఎక్కువగా చియా విత్తనాల్లోనే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో, వాపును తగ్గించడంలో, మెదడు పనితీరును మెరుగుపరచడంలో కీలకంగా వ్యవహరిస్తాయి. క్యాన్సర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలోనూ ముందుంటాయి.
యాంటి ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్‌తో కూడిన చియా విత్తనాలు.. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. జలుబు, దగ్గు, ఫ్లూ వంటి వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడటంలో కీలకంగా పనిచేస్తాయి.