ఆ వ్యక్తి పెరిగిన ఊరు.. తిరిగిన చోట్లు.. నడిచిన బాటలు అంతటా పచ్చదనం పలకరించేది. వనసీమలో విహరించిన అతని బాల్యం పచ్చని చెట్లే ప్రగతికి మెట్లు అన్న సూక్తిని నేర్పింది. అలా చిన్నప్పటి నుంచి ప్రకృతితో మమేకమైన ఆయన లెక్కకుమించి మొక్కలు నాటాడు. ఇప్పుడు పచ్చదనాన్ని పరిరక్షించడంలో శక్తికిమించి ప్రయత్నిస్తున్నాడు. వివిధ కారణాల వల్ల కూల్చివేతకు గురవుతున్న భారీ వృక్షాలకు ఆయువు పోస్తున్నాడు. మోడువారిన మానులకు నిలువ నీడనిస్తున్న సుంకిశాల సత్తయ్య చేస్తున్న ప్రయత్నం ఆయన మాటల్లోనే..
మాది జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామం. నాన్న వాళ్లు కల్లుగీత కార్మికులుగా పనిచేస్తూ వచ్చారు. చిన్నప్పటి నుంచి నేను వారితో అటవీ ప్రాంతానికి వెళ్తుండేవాణ్ని. అక్కడ కనిపించే చెట్లను చూస్తే భలే ముచ్చటేసేది. పచ్చని చెట్లు, వాటికి అల్లుకున్న తీగలు, పూసిన పూలు, వాలిన పక్షులు.. పచ్చదనం ఉన్నచోట ఇంత గొప్పగా ఉంటుందా అనిపించేది. అలా ప్రకృతితో ఏదో తెలియని అనుబంధం ఏర్పడింది. నేను పెరిగే కొద్దీ ఆ మమకారం మరింత ఎక్కువైంది. చెట్లు, మొక్కల గురించి ఉంటుందనే ఇంటర్లో బైపీసీ తీసుకున్నా! తర్వాత డిగ్రీలో బీఎస్సీ బీజెడ్సీ పూర్తిచేశాను.
డిగ్రీ తర్వాత కులవృత్తినే జీవనాధారంగా ఎంచుకోవాల్సి వచ్చింది. చిన్నప్పటి నుంచి మొక్కలు పెంచడం అలవాటుగా ఉండేది. ఒకవైపు పచ్చదనం పెరుగుతుంటే.. మరోవైపు అభివృద్ధి పేరుతో జరుగుతున్న ప్రకృతి విధ్వంసం మనసుకు కష్టం కలిగించేది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ‘హరిత హారం’ నాకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. గ్రామస్తుల సహకారంతో, చందాలు వేసుకొని మరీ మొక్కలు నాటడమే పనిగా పెట్టుకున్నాను. వాటిని రక్షించే క్రతువులో అందరం భాగమయ్యాం. మా ఊళ్లో ప్రకృతి వనాన్ని ఏర్పాటుచేశాను.
ట్రాన్స్‌లొకేషన్
ఇలా హరిత హారంలో ఉన్న క్రమంలోనే ట్రాన్స్‌లొకేషన్ (చెట్ల తరలింపు) చేపట్టవచ్చని తెలిసింది. రహదారుల విస్తరణలో భాగంగా కూల్చేసిన భారీ వృక్షాలను వేరేచోట నాటి మళ్లీ చిగురింపజేశారన్న వార్తలు నాలో అసక్తిని పెంచాయి. దీనిపై మరింత అధ్యయనం చేశాను. ఫైకస్ జాతికి చెందిన మర్రి, జువ్వి, రావి లాంటి భారీ వృక్షాలు మాత్రమే ట్రాన్స్‌లొకేషన్ ద్వారా తిరిగి బతుకుతాయని తెలుసుకోగలిగాను. ఈ క్రమంలోనే గతేడాది మా గ్రామానికి చెందిన చెన్నమనేని హిమవంత రావుగారి తోటలో అరవై, డబ్బు ఏండ్ల వయసున్న భారీ వృక్షాలను తొలగిస్తున్నారని తెలిసింది.
ఆ చెట్లను ఎలాగైనా బతికించాలని అనుకున్నాను. హిమవంతరావు గారితో, ప్రభుత్వ అధికారులతో మాట్లాడాను. వారు నా చొరవను ప్రశంసించారు. చెట్లను ట్రాన్స్‌లొకేషన్ చేయడానికి సహకరిస్తామన్నారు. అయితే, కొందరు మాత్రం నన్ను పిచ్చోణ్ని చూసినట్టు చూశారు. అవేవీ పట్టించుకోలేదు. చెట్లను వేర్లు సహా తరలించడానికి హిమవంతరావు గారే జేసీబీ, ట్రాక్టర్ ఏర్పాటుచేశారు. పదిహేను భారీ వృక్షాలను బతికించే పనిని ప్రారంభించాను. ముందుగా చెట్ల కొమ్మలన్నిటినీ తొలగించాను. కాండం, వేర్లు మాత్రమే ఉండేలా చూసి, వృక్షాన్ని పెకిలించి ట్రాక్టర్లో తరలించేందుకు ఏర్పాటుచేశాను.
నా పట్టుదల చూసి గ్రామస్తులు కూడా ఈ ప్రయత్నంలో భాగమయ్యారు. అధికారుల చొరవతో ఇటిక్యాల వాగు పక్కనున్న పోరంబోకు (ప్రభుత్వ భూమి) స్థలంలో ఈ చెట్లను తరలించి నాటాం. కాండాలను నాటిన తర్వాత వాటికి ఫంగస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. వివిధ రసాయనాలు వాడుతూ, నెల రోజులపాటు క్రమం తప్పకుండా వాటర్ క్యూరింగ్ చేశాను. మా ప్రయత్నం ఫలించింది. మేం ట్రాన్స్‌లొకేషన్ చేసిన 15 చెట్లలో 14 బతికాయి. మోడువారిన ఆ చెట్లు ఇప్పుడు పచ్చగా కళకళలాడుతూ కనువిందు చేస్తున్నాయి. వాటిని చూస్తుంటే చనిపోయిన జీవి మళ్లీ ప్రాణం పోసుకొని.. కండ్లముందు తిరుగుతున్నట్టు అనిపిస్తున్నది.
మళ్లీ బతికిద్దాం..
మారిన కాలంలో రోడ్ల విస్తరణ చాలా కీలకమైంది. ఈ క్రమంలో భారీ వృక్షాలు తొలగించాల్సి వస్తుంటుంది. వాటిని అలాగే రోడ్ల పక్కగా వదిలేయొద్దు. ట్రాన్స్‌లొకేషన్ చేస్తే ఏడాదిలోనే వందేండ్ల వృక్షం మళ్లీ జీవం పోసుకొని.. మరో నూరేండ్లు నీడనిస్తుంది. ఒక భారీ వృక్షాన్ని ట్రాన్స్‌లొకేషన్ చేసి, బతికించడానికి సుమారు రూ.12 వేల వరకు ఖర్చు అవుతుంది. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు తలుచుకుంటే ఇదేమంత పెద్ద వ్యయం కాదు. జగిత్యాల- కరీంనగర్ రహదారి విస్తరణలో కొన్ని పెద్దపెద్ద చెట్లు తొలగించాల్సి వస్తున్నదని వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాను. అధికారులు అండగా నిలిస్తే, వాటిని ట్రాన్స్‌లొకేషన్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను.
…? కొత్తూరి మహేశ్ కుమార్, జగిత్యాల
బొమ్మకంటి వెంకట రమణ,రాయికల్