‘చెయ్యి చూశావా ఎంత రఫ్‌గా ఉందో.. రఫ్పాడించేస్తా!’ గ్యాండ్లీడర్ సినిమాలో హీరో చిరంజీవి డైలాగ్ ఎంత పాపులరో తెలిసిందే! సందర్భాన్ని క్రియేట్ చేసుకొని మరీ ఈ డైలాగ్ విసురుతుంటారు చాలామంది. అయితే, చెయ్యి ఎంత రఫ్‌గా ఉన్నా.. ఫ్రెష్‌గా లేకపోతే.. అనారోగ్యం మనల్ని రఫ్ఫాడించేస్తుంది అంటున్నారు నిపుణులు. సరిగ్గా హ్యాండ్ వాష్ చేసుకోకపోవడమే సమస్త ఆరోగ్య సమస్యలకూ మూల కారణం అని హెచ్చరిస్తున్నారు. అక్టోబర్ 15న గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డేని పురస్కరించుకొని.. మన చేతులను క్రిముల నుంచి ఎలా సంస్కరించుకోవాలో ఒక లుక్కేద్దాం..
ఏ పని చేయాలన్నా ముందుగా ముందుకొచ్చేవి చేతులే! వాటిని సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే.. చేతులపై పేరుకుపోయిన వ్యాధికారక క్రిములన్నీ మనం తీసుకునే ఆహారం ద్వారా శరీరంలోకి చేరిపోతాయి. డయేరియా, హెపటైటిస్, జలుబు వంటి రకరకాల అనారోగ్యాలు ప్రబలడానికి చేతులతో మనం చేసే చేతలే కారణమని నిపుణుల మాట.
చేతులు కడుక్కోవడం గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది.. చిన్నప్పటి నుంచీ చేసేదేగా అంటారా? కానీ, ఓ అధ్యయనం ప్రకారం చేతులు శుభ్రంగా కడుక్కోకపోవడం వల్ల.. ప్రపంచవ్యాప్తంగా ఏటా 14 లక్షల మంది వివిధ అనారోగ్యాలబారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారట! వినడానికి అమ్మ బాబోయ్ అనేలా ఉన్నా.. ఇది నిజం!
టాయ్‌లెట్‌కు వెళ్లినప్పుడు చేతులు కడుక్కోవడం రివాజు. కానీ, మొబైల్‌పై విన్యాసాలు చేసేటప్పుడు కూడా మన చేతులపై క్రిములు తిష్టవేస్తాయట. చేతులు మారే టీవీ రిమోట్ కూడా బ్యాక్టీరియాకు అలవాలంగా ఉంటుంది. మొబైల్‌ని వదిలేయలేం, టీవీ రిమోట్ పక్కన పెట్టలేం కదా! ఇలాంటప్పుడు రెగ్యులర్‌గా హ్యాండ్ వాష్ చేసుకోవడం ఒక్కటే పరిష్కారం అని గుర్తుంచుకోండి.
హ్యాండ్ వాషింగ్ అంటే.. నిండా నీళ్లు ఉన్న బకెట్లో చేతులు ముంచేసి, అంగీకి రుద్దుకోవడం కాదు! చక్కగా సబ్బు రాసుకొని, 20 సెకన్లపాటు అన్ని డైరెక్షన్లలో చేతులను చక్కగా రుద్దుకోవాలి. సబ్బు నురగ అంతా పోయేలా నీళ్లతో కడగాలి. ఇలా చేస్తే… అరచేతిలో, గోళ్లలో చేరుకున్న క్రిములు నాశనం అవుతాయి.
చేతులను శుభ్రం చేసుకొని.. పచ్చి చేతులతో అవ్వీ ఇవ్వీ తాకొద్దు. శుభ్రమైన వస్త్రంతో తుడుచుకోవాలి. ఫ్రెష్‌గా చేతులు కడిగేసి… అపరిశుభ్రంగా ఉన్న ఉపరితలాలను తాకొద్దు. తినడానికి ముందు, తిన్న తర్వాత కూడా హ్యాండ్ వాష్ సరిగ్గా చేసుకోవాలి.
కరోనా కారణంగా హ్యాండ్ శానిటైజేషన్ చాలామందికి అలవాటుగా మారింది. అయితే, నాణ్యమైన శానిటైజర్లను మాత్రమే ఉపయోగించాలి. అగ్గువ సరుకు కొని.. అదే పనిగా చేతులకు రుద్దుకుంటే, జరిగే లాభం మాట అటుంచి.. తీరని నష్టం తలెత్తవచ్చు.
కొందరు తరచూ చేతులతో ముఖాన్ని రుద్దుకోవడం, నోట్లో వేళ్లు పెట్టుకోవడం, ముక్కు గెలకడం లాంటివి చేస్తుంటారు. ఇది ఆరోగ్యకరమైన పద్ధతి కాదు. వీలైనంత వరకు చేతులను ముఖానికి దూరంగా ఉంచే ప్రయత్నం చేయాలి.
ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం. ఈ విషయాన్ని అందరికీ చేరవేయడానికి 2008లో కొన్ని అంతర్జాతీయ సంస్థలు ‘గ్లోబల్ హ్యాండ్‌వాషింగ్ డే’ కాన్సెప్ట్‌ని ప్రవేశపెట్టాయి. నాటి నుంచి ఏటా అక్టోబర్ 15న ప్రపంచంలో వందకు పైగా దేశాలు దీనిని నిర్వహిస్తున్నాయి. ఆ రోజు పాఠశాలలు, కాలేజీలు, వివిధ కార్యాలయాల్లో చేతులు శుభ్రంగా కడుక్కోవడంపై పలు స్వచ్ఛంద సంస్థలు అవగాహన కల్పిస్తున్నాయి.