వేసవి వేడి వాతావరణం.. కేశాలకు తీవ్రమైన హాని కలిగిస్తుంది. వేడివల్ల తలపై తేమ తగ్గుతుంది. ఫలితంగా, రక్త ప్రసరణ నెమ్మదించి.. జుట్టు పొడిబారుతుంది. వీటితోపాటు మనకు తెలియకుండానే చేసే మరికొన్ని పనుల వల్ల.. ఎండకాలంలో జుట్టు రాలిపోతుంటుంది. ఈ క్రమంలో వేసవిలో జుట్టుకు హానిచేసే పనులేంటో వివరిస్తున్నారు సౌందర్య నిపుణులు.
ఎండకాలంలో కొందరు ప్రతిరోజూ తలస్నానం చేస్తుంటారు. దీనివల్ల ఉక్కపోత నుంచి ఉపశమనం లభించినా.. జుట్టు ఆరోగ్యం మాత్రం దెబ్బతింటుంది. రోజూ తలస్నానం చేస్తే.. వెంట్రుకలు నిర్జీవంగా మారుతాయి. క్రమంగా రాలిపోతాయి.
తలస్నానం తర్వాత జుట్టు త్వరగా ఆరాలని బ్లో డ్రయర్స్ వాడుతుంటారు. ఇవి జుట్టుకు ఏమాత్రం మంచిదికాదు. ఇక కర్లర్స్, స్ట్రయిటనర్స్ వంటివి వాడటం కూడా జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. వీటిలోంచి వెలువడే వేడి.. వెంట్రుకలకు హాని కలిగిస్తుంది. కాబట్టి, జుట్టును మెత్తని టవల్‌తో తుడుచుకుంటూ.. ఉదయపు ఎండలో ఆరబెట్టుకోవడమే మంచిది. ఎక్కువ వేడి జుట్టును బలహీనంగా మారుస్తుందని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ పరిశోధలోనూ తేలింది.
కాలం ఏదైనా.. వెంట్రుకలకు ఎంత తరచుగా నూనె పెడితే అంత మంచిది. ఎందుకంటే, జుట్టులో తేమశాతం ఎక్కువ సమయంపాటు నిలిపి ఉంచడంలో నూనె సమర్థంగా పనిచేస్తుంది. అందుకే, తలస్నానానికి అరగంట ముందు గోరువెచ్చని నూనెతో జుట్టుకు బాగా మసాజ్ చేయాలి. దాంతో.. జుట్టు కుదుళ్లు బలంగా మారుతాయి.
వెంట్రుకలను ఎప్పుడూ ముడివేసి ఉంచడం వల్ల చిక్కులు పడి తెగిపోతాయి. అలాగే, ఈకాలంలో మామూలు దువ్వెన వాడినా.. జుట్టు రాలిపోతుంది. పళ్లు దూరంగా, వెడల్పుగా ఉన్న దువ్వెనలు వాడటం మంచిది.