ఆకుపచ్చని మచా టీ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండు. అది తాగుతూ ఫొటోలు క్లిక్కుమనిపిస్తూ నెట్టింట సందడి చేస్తున్నారు యువత. సరదా కోసం తాగుతున్నా ఈ పానీయం వెనుక ఆరోగ్య రహస్యాలు ఎన్నో ఉన్నాయి. మచా టీ ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్‌ను నియంత్రించడంలో కీలకంగా వ్యవహరిస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది కెమీలియా సినెన్సిస్ జాతికి చెందిన చెట్టు నుంచి వస్తుంది. ఈ పచ్చటి రంగును ఇచ్చే ఆకుల్లో పాలీఫినాల్స్ పుష్కలంగా ఉంటాయి.
ఇవి క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి. అంతేకాదు, కీమోథెరపీకి క్యాన్సర్ కణాలు బాగా స్పందించేందుకు కూడా ఇవి సహకరిస్తాయి. ఇన్ఫ్లమేషన్ని తగ్గించేందుకు, ఇమ్యూనిటీని పెంచేందుకు, జీవక్రియను మెరుగు పరిచేందుకు కూడా మచా టీ ఉపయోగపడుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే మనం సాధారణంగా తాగే గ్రీన్‌టీతో పోలిస్తే ఎన్నో రెట్లు ఇది శరీరానికి మేలు చేస్తుంది. కాబట్టి మచా టీ తాగడం అన్నది ఆనందం ఒక్కటే కాదు, ఆరోగ్యం కూడా!