నెయ్యి… మాట వింటేనే భారతీయులకు నోరూరిపోతుంది. ప్రాంతంతో పనిలేదు, అస్తిత్వంతో పోలిక లేదు. పొగలు కక్కే అన్నానికి తోడు ఇంకేమీ లేకపోయినా… ఓ చుక్క నెయ్యి జోడిస్తే అది పంచభక్ష్య పరమాన్నాలకు పర్యాయపదంగా మారిపోతుంది. ఆహారంలోనే కాదు అగ్నిదేవత ద్వారా తన ఇష్టదేవతలను ప్రసన్నం చేసుకోవాలని అనుకునే భక్తులకు, హోమగుండంలో వేసి పదార్థాలు భగ్గున మండుతూ స్వాహాదేవికి చేరాలంటే ఘృతమే ఆధారం.
ఒక్కో ఇంధనం ఇచ్చే వెలుగు ఒక్కోలా ఉంటుంది. దాని నుంచి వెలువడే కాంతి, సువాసనలు వేర్వేరు అనుభూతులను ఇస్తాయి. వీటిలో నెయ్యిదే పైచేయి అని నమ్ముతారు. అందుకే నెయ్యితో పెట్టే దీపం శ్రేష్ఠమని చెబుతారు. ఇక నైవేద్యాల సంగతైతే చెప్పనక్కర్లేదు. కొన్ని ఆలయాల పేరు వినగానే గుర్తుకు వచ్చే ప్రసాదాల నుంచి ఇంటి దగ్గర చేసుకునే నైవేద్యాల వరకు నేతికి ఎంత ప్రాధాన్యత ఉందో మనకు తెలుసు. మన భౌతిక జీవనానికి ఆలంబన అయిన ఆహారంలోను, ఆధ్యాత్మిక జీవితాన్ని సూచించే ధూపదీపనైవేద్యాలలోనే కాదు… వైద్యంలోనూ నెయ్యికి ఉన్న ప్రాశస్త్యం అంతా ఇంతా కాదు. ఎంత చెప్పుకొన్నా తరగని నేతి పురాణాన్ని ఓసారి తల్చుకుందాం!
Ghee
మనిషికితెలివి రావడంతోనే ఇల్లు కట్టేసుకోలేదు, కుటుంబాన్ని ఏర్పర్చుకోలేదు. వేల ఏళ్లపాటు సంచార జీవితం గడిపాడు. ముందు పంటలు పండించడం నేర్చుకున్నాడు. సాగులో సాయం కోసం పశువులను మచ్చిక చేసుకోవడం మొదలుపెట్టాడు. అప్పుడు మొదలైంది నాగరికత. ఇంటింటా ఎంతోకొంత పశుసంపద ఉండేది. పొలం పనులలో ఉపయోగపడటంతోపాటు… వాటినుంచి పాలు, పెరుగు, నెయ్యి సమృద్ధిగా లభించేవి. అందుకే పశువులు చేసిన మేలుపట్ల కృతజ్ఞత ఎన్నో సంప్రదాయాల్లో, క్రతువుల్లో కనిపిస్తుంది. వ్యవసాయ ఆధారంగా ఎదిగిన మనదేశంలో ‘పాడి’కి ఉన్న ప్రాధాన్యత ఇంకాస్త ఎక్కువే. అందుకేనేమో ప్రపంచంలో ఎక్కువ నెయ్యిని ఉత్పత్తి చేసేది మనమే.
దాన్ని ఎక్కువగా వినియోగించేదీ మనమే. కానీ చిత్రం ఏమిటంటే… నెయ్యికి మన ఆహారంలో ఉన్న ప్రాధాన్యతను వేల ఏళ్లుగా గుర్తించిన మనం, బయటినుంచి కొన్ని వాదనలు వినిపించగానే దానిని పక్కన పెట్టేయడం మొదలుపెట్టేశాం. మితంగా నెయ్యి మంచిదని పదేపదే మొత్తుకున్న మన పెద్దల మాటల్ని విస్మరించాం. కానీ ఇప్పుడు అదే పాశ్చాత్య లోకం నెయ్యిని ‘సూపర్ ఫుడ్’ అంటున్నది. ఇప్పటికీ మించిపోయింది లేదు. ప్రస్తుతం ఇతర సూపర్ మార్కెట్లలో దొరికే ఖరీదైన ఆహార పదార్థాల ఖర్చులతో పోలిస్తే నెయ్యికి అయ్యే వ్యయం పెద్దదేమీ కాదు. అందుకే కాస్తంత నెయ్యికి మన ఇంట్లో కొంచెమంత చోటిద్దాం. ఇంకాస్త ఆరోగ్యాన్ని మనం ఒంట్లో పెంచుకుందాం!
రకరకాలు కానీ…
వేర్వేరు పాల నుంచి తీసిన నెయ్యికి వేర్వేరు గుణాలు ఉంటాయి. వాటిని చూస్తేనే ఏ రకం నెయ్యో గుర్తుపట్టవచ్చు. ఆవునెయ్యిలో ఉండే బీటా కెరోటిన్ వల్ల అది పసుపు పచ్చగా కనిపిస్తుంది. గేదె నెయ్యిలో ఉండే కొవ్వు పదార్థాల వల్ల అది తెల్లగా ఉంటుంది. ఇక మేక నెయ్యి పలుకులుగా కనిపిస్తుంది. ఇక వీటిలో కూడా రకరకాలు ఉంటాయి. దేశవాళీ ఆవుల నుంచి వచ్చే నెయ్యిని A1 నెయ్యిగా పిలుస్తుంటారు. గిర్, సాహివాల్ లాంటి కొన్ని ప్రత్యేకమైన జాతుల నుంచి వచ్చే నెయ్యిని A2 గా పిలుస్తారు. ఇందులో బీటా కేసిన్ అనే పోషకం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మన ఆరోగ్యానికి కొన్ని అదనపు ప్రయోజనాలు ఉండటంతో పాటు, జీర్ణవ్యవస్థకు కూడా మంచిదని చెబుతారు.
కొంతమంది ఆవునెయ్యి త్వరగా జీర్ణం కాదని అనుమానపడుతుంటారు. ఇలాంటివాళ్లు A2 నెయ్యిని వాడవచ్చు. కాకపోతే మిగతా రకాలతో పోలిస్తే ఇది కొంచెం ఖరీదు ఉంటుంది. ఇక నెయ్యి తయారుచేసే విధానంలోనూ రకరకాల మార్పులు ఉంటాయి. పాల నుంచి తీసిన వెన్నను సన్నటి సెగ మీద కాచి చల్లార్చే ప్రక్రియ మన ముందు తరం వరకూ ఇంటింటా కనిపించేది. ఈ విధానంలో పోషకాలు ఎక్కువ నష్టపోకుండా, కల్తీ జరగకుండా, వాసన చెడకుండా నెయ్యి తయారవుతుంది. పశువుల మేతలోనూ జాగ్రత్తలు తీసుకుని ఆర్గానిక్ నెయ్యి అని అమ్ముతున్నారు. ఎలాగైతే తేనెటీగలు పెరిగే ప్రాంతంలో పూలను బట్టి వాటికి రుచి వస్తుందో… వేర్వేరు మేతలతో ఆవులను పెంచుతుండటంతో గ్రెయిన్ ఫెడ్, గ్రాస్ ఫెడ్ అంటూ రకరకాల నెయ్యి అందుబాటులో ఉంటున్నది. మన శరీర తత్వం, పాత అలవాట్లు, బడ్జెట్‌ను బట్టి కావల్సిన నెయ్యిని ఎంచుకోవడమే!
Ghee
ఆయుర్వేదంలో నెయ్యి
ఘృతం అని పిలుచుకునే నెయ్యికి ఆయుర్వేదంలో ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఆహారంలో సూపర్ ఫుడ్ అయితే, ఆయుర్వేదంలో సూపర్ మెడిసిన్‌గా దీన్ని భావించవచ్చు. చరక సంహిత, అష్టాంగ హృదయం లాంటి ప్రామాణిక ఆయుర్వేద గ్రంథాలలో అప్పుడే పుట్టిన పిల్లల నుంచి వృద్ధుల వరకూ ప్రతి ఒక్కరికీ ఎన్ని రకాలుగా ఈ ఘృతం ఉపయోగపడుతుందో స్పష్టంగా చెప్పారు. అప్పుడే కాచిన నెయ్యి దగ్గర నుంచీ ఏడాదిపాటు నిల్వ ఉంచిన నెయ్యి వరకూ వివిధ చికిత్సలలో ఎలాంటి నెయ్యిని వాడాలో చెప్పుకొచ్చారు.
చర్మంలో మలినాలను తొలగించే అభ్యంగం, ఒంట్లోని దోషాలను పరిహరించే పంచకర్మ, కంటి సమస్యలకు ఉపయోగించే నేత్ర తర్పణం లాంటి చికిత్సలలో నేరుగా నెయ్యిని వాడతారు. మన శరీరంలో ఏర్పడే ఎన్నో సమస్యలకు కారణం వాత, పిత్త, కఫ దోషాలలో వచ్చే మార్పులే అని ఆయుర్వేదం చెబుతుంది. ఈ త్రిదోషాల స్థాయిని నియంత్రించడంలో నెయ్యిది ముఖ్యపాత్రగా భావిస్తుంది. బ్రాహ్మి, అశ్వగంధ, వాస, మహాతిక్తక… ఇలా వేర్వేరు ఔషధాలను ఘృతంతో కలిపి వాడినప్పుడు అద్భుతమైన ఫలితాలు వస్తాయని నమ్ముతారు. ఉదాహరణకు మహాతిక్తక ఘృతం చర్మసంబంధమైన ఎన్నో మొండి సమస్యలకు ఉపశమనం కలిగిస్తుంది.
పాశ్చాత్యులూ ఒప్పుకొంటున్న లాభాలు!
ఇన్నాళ్లూ నెయ్యి తినవద్దు అని మన తరాల అలవాటును తక్కువ చేసిన పాశ్చాత్యులే ఇప్పుడు అందులో ఉన్న లాభాలను చూసి ముచ్చటపడిపోతున్నారు. ఏ కారణాల వల్ల అది ఎలాంటి ప్రయోజనాన్ని అందిస్తుందో చెప్పుకొస్తున్నారు.
Ghee
మెదడుకి మేత నిజమేనా!
నెయ్యి వల్ల మెదడు మరింత చురుగ్గా ప్రభావంగా పనిచేస్తుందన్నది తరచూ వినిపించే మాట. ఇప్పటికీ ఇళ్లలో పెద్దవాళ్లు, పిల్లలకు అన్నం పెట్టేటప్పుడు తప్పకుండా వారికి నెయ్యి వెయ్యమని పోరుతుంటారు. ఇది ఎంతవరకు వాస్తవం? అనే విషయమై కచ్చితమైన జవాబులు ఉన్నాయి. నెయ్యిలో ఉండే షార్ట్ చెయిన్ ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల మెదడు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా… అల్జీమర్స్ లాంటి సమస్యలు త్వరగా రాకుండా చేస్తాయని తేలింది. నెయ్యిలో ఉండే డీహెచ్ఏ, ఈపీఏ లాంటి రసాయనాలు మెదడు మరింత చురుగ్గా పనిచేయడానికి సాయపడతాయట.
అందుకే ఆయుర్వేదంలో నెయ్యిని మేధ్య రసాయనంగా పేర్కొంటూ… నెయ్యి (ఘృతం)తో రూపొందించే మందులను మేధ్య ద్రవ్యాలనీ… వాటివల్ల మెదడుకే కాకుండా నాడీవ్యవస్థకు కూడా మేలు జరుగుతుందని చెబుతారు. మెదడులో కణాలు అభివృద్ధి చెందేందుకు, జ్ఞాపకశక్తి పెరిగేందుకు, ఏకాగ్రత స్థిరపడేందుకు నెయ్యి ఉపయోగపడుతుందన్నది సంప్రదాయ వైద్యులు చెప్పే మాట. కేవలం మెదడు మీదే కాకుండా మొత్తం నాడీ వ్యవస్థ మీదా నెయ్యి సానుకూలమైన ప్రభావాన్ని చూపిస్తుందట. నెయ్యిలో ఉండే ఎ, డి, ఇ, కె లాంటి విటమిన్లన్నీ మెదడుతో పాటుగా ఎముకలు, కండరాలకు కూడా ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఎదిగే పిల్లలకు నెయ్యి అందించాలని చెప్పడం వెనకాల కారణం ఇదే! టీనేజ్‌లో ఉండే పిల్లలకు తలమీద జుట్టు దగ్గర నుంచీ కాలి గోరు వరకూ నెయ్యి మేలుచేస్తుంది.
ఇంతకీ ఏ నెయ్యి మంచిది!
ఆవు నెయ్యి శ్రేష్టం అన్నది ఆయుర్వేదం చెప్పే మాట. గేదె నెయ్యితో పోలిస్తే ఇందులో పోషకాల శాతం కాస్త ఎక్కువగానూ, కొవ్వు తక్కువగానూ ఉండటం ఇందుకు కారణం. అలాగని గేదెనెయ్యినీ తీసిపారేయలేం. రెండిటిలోనూ మనకు రోజువారీగా కావాల్సిన పోషకాలు సమృద్ధిగానే లభిస్తాయి. విటమిన్లను అందించడంతో పాటుగా శక్తిని అందించే క్యాలరీలూ నెయ్యిలో పుష్కలంగా ఉంటాయి. కాకపోతే ఏ పదార్థానికైనా పరిమితి ఉన్నట్టే నెయ్యి తీసుకోవడానికీ పరిమితులు ఉంటాయి.
పసిపిల్లలు రెండు టీస్పూన్లు మించకుండా ఉంటే మంచిది. మిగతావారు రెండు నుంచి మూడు టీ స్పూన్ల వరకూ తీసుకోవచ్చని చెబుతారు. ఇప్పటి జీవనశైలిలో శారీరక శ్రమ తక్కువ కాబట్టి, నెయ్యి ఎక్కువగా తీసుకున్నప్పుడు అందులోని కొవ్వు వల్ల ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. నెయ్యి కూడా పాల ఉత్పత్తే కనుక, పాలు అంటే అలెర్జీ ఉన్నవారికి నెయ్యి కూడా దద్దుర్లు లాంటి సమస్యలు కలిగించవచ్చు. తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నవారు నెయ్యి వాడేముందు ఓసారి వైద్యులను సంప్రదించడం మేలు.
ఇదండీ ఘృతం గొప్పదనం. మితంగా తీసుకుంటే అది ఎన్ని అద్భుతాలు చేస్తుందో తెలిసిపోయింది కాబట్టి ఓ చెంచా నెయ్యిని అన్నంలో కలుపుకొందాం. కమ్మదనంతోపాటు ఆరోగ్యాన్నీ అందుకుందాం. పిల్లలకైతే మొదటి ముద్దను నేతితో పెడితే అమృతాన్ని అందించినట్టే. ఏదైనా అనుమానం ఉంటే పెద్దలను అడుగుదాం. పెద్దలు చెప్పిందీ అనుమానంగా ఉంటే వైద్యుల సలహా తీసుకుందాం. వాళ్లందరూ చెప్పేది ఒకటే మాట… నెయ్యి దివ్యౌషధం. సూపర్ ఫుడ్స్ పేరిట దిగుమతి అయిన ఖరీదైన పదార్థాల బదులు అందుబాటులో ఉన్న నెయ్యికి ఓటేద్దాం!
Ghee
కల్తీని పసిగట్టేది ఎలా!
నెయ్యి కల్తీ జరిగిందా లేదా? ఒకవేళ కల్తీ జరిగితే ఏం కలిపి ఉంటారు అని తెలుసుకునేందుకు Bauduoin Test, Butyro-Refractometer Reading, ReichertMeissl Value, Coliform count, Peroxide Value లాంటి చాలా పరీక్షలే అందుబాటులో ఉన్నాయి.
వీటితో పాటుగా ఆ నెయ్యిలో ఉండే పోషకాలు, కొవ్వు శాతం, రుచి తెలుసుకునేందుకు ఇంకొన్ని పరీక్షలు ఉంటాయి. కానీ ఇవన్నీ ల్యాబొరేటరీలో జరిగే పరీక్షలు కదా! ఇంట్లోనే కల్తీ నెయ్యిని గుర్తించడం ఎలా?
ఇందుకు చాలా తేలికపాటి మార్గాలే ఉన్నాయి. అసలు రంగు, రుచి, వాసనల్లోనే మన ఎదుట
ఉన్నది కల్తీ నెయ్యి అని అర్థం అయిపోతుంటుంది. ఒకవేళ అలాంటి అనుమానం వచ్చిన పక్షంలో…
1 ఓ నెయ్యి చుక్క గ్లాసు నీటిలో వేసినప్పుడు అది తేలితే నాణ్యమైనదని లెక్క.
2 అరచేతిలో వేసుకున్నప్పుడు స్వచ్ఛమైన నెయ్యి త్వరగా కరిగిపోతుంది.
3 స్వచ్ఛమైన నెయ్యి చల్లదనానికి గడ్డకడుతుంది. ఫ్రిజ్‌లో పెట్టి చూడవచ్చు.
4 అయోడిన్ ఎక్కడైనా దొరుకుతుంది. నెయ్యి మీద ఓ రెండు చుక్కల అయోడిన్ వేసినప్పుడు, దాని రంగు మారిపోతే పిండి
లాంటి పదార్థాలు కలిపారని అర్థం!
5 కల్తీ నెయ్యిని కాచితే పొగ, బుడగలు, వాసన వస్తాయి.
6 కాగితం మీద నెయ్యి చుక్క వేసి కాసేపాగి చూసినప్పుడు… కల్తీ నెయ్యి అయితే ఏదో ఒకటి అంటుకుని కనిపిస్తుంది.
పరగడుపునే ఓ చెంచా!
ఉదయం ఏమీ తినక ముందు ఓ స్పూను నెయ్యి నోట్లో వేసుకుని, ఆ తర్వాత కాస్త గోరువెచ్చని నీరు తాగితే చాలా ఉపయోగాలు ఉంటాయని గృహ వైద్యం చెబుతున్నది.
1 జీర్ణ సమస్యలు, అల్సర్లు ఉన్నవారికి పరగడుపున నెయ్యి ఉపశమనాన్ని ఇస్తుంది.
2 నెయ్యిలోని శక్తి ఉపవాసం చేసేవారికి ఆ రోజంతా అలసట లేకుండా చేస్తుంది.
3 మధుమేహం ఉన్నవారు టిఫిన్‌కి ముందు నీరసించిపోకుండా ఉండటానికి సాయపడుతుంది.
4 ఉదయాన్నే చదువుకునే విద్యార్థులకు చదివింది గుర్తుంచుకునేలా మెదడును చురుకుగా మారుస్తుంది.
5 వ్యాయామం, జిమ్, వాకింగ్ అలవాటు ఉన్నవారికి తగినంత సత్తువను అందిస్తుంది.
6 పని ఒత్తిడి ఎక్కువగా ఉండేవారు పరగడుపున స్పూన్ నెయ్యి పుచ్చుకుంటే స్ట్రెస్ లెవెల్స్ అదుపులో ఉంటాయట.
7 చర్మం కాంతిమంతంగా ఉండటానికీ, మోకాళ్లు దృఢంగా మారేందుకు, తినే ఆహారంలోని పోషకాలు పూర్తిగా శరీరానికి అందేందుకు ఉదయాన్నే తీసుకునే నెయ్యి చాలా ఉపయోగపడుతుంది.
ఓ చిత్రమైన పరిశోధన!
నెయ్యి గురించి ఆయుర్వేదంలో చాలా గొప్పగా చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే నెయ్యి మీద ఆధునిక శాస్త్రవేత్తలూ పరిశోధన చేస్తున్నారు. ఈ రెండిటి మధ్యా సమన్వయం ఏ మేరకు ఉందో చూడాలి అనుకున్నారు దీప్శిఖ, గుర్మీత్ అనే పరిశోధకులు. ఇందుకోసం వారు ఆయుర్వేదంలో శుశృత సంహిత, హరిత సంహిత లాంటి ముఖ్యమైన గ్రంథాల్లో ఉట్టంకింపులను నమోదు చేశారు. ఆవు నెయ్యి మొదలుకొని గుర్రం నెయ్యి వరకు ఏ నెయ్యి గురించి ఎలాంటి ప్రస్తావన, ప్రభావం పేర్కొన్నారో చూశారు.
ఆ తర్వాత గత పాతికేళ్లలో ఆధునిక పరిశోధనలు నెయ్యికి ఉన్న ప్రభావాన్ని ఏమేరకు ఒప్పుకొన్నాయో పరిశీలించారు. ఆశ్చర్యకరంగా ఆయుర్వేదం పేర్కొన్న ఓ 15 ముఖ్యమైన లాభాల్లో పదింటికి ఆధునిక పరిశోధకులు కూడా మార్కులు వేశారు. మరీ ముఖ్యంగా కంటిచూపు, మెదడు, రోగనిరోధకశక్తి, చర్మం, గుండె, ఎముకల ఆరోగ్యం విషయంలో, గాయాలను మాన్పడంలో, ట్యూమర్లను అరికట్టడంలో… నెయ్యి మేలు చేస్తుందని తేల్చారు. కాబట్టి నెయ్యి అనేది ఓ చాదస్తం అనే భావన నుంచి వీలైనంత త్వరగా బయటపడటం మంచిది.
బీటా కెరోటిన్
Ghee
ఆవు నెయ్యి కాస్త పచ్చగా ఉండటానికి కారణం… అందులో ఉండే బీటా కెరోటిన్. ఆవుల సహజమైన ఆహారం నుంచే వాటికి ఈ పోషకం అందుతుంది. అందుకే వాటికి పుష్కలంగా గడ్డి దొరికే రుతువు, ప్రాంతం, పెంచే విధానం కూడా ఈ మోతాదు మీద ప్రభావం చూపిస్తుంది. ఇంతకూ ఆవు నెయ్యిలో ఉండే ఈ బీటా కెరోటిన్ ఎందుకంత ప్రత్యేకం అన్నదానికి చాలా కారణాలు కనిపిస్తాయి. ఇందులో ఉండే యాంటి ఆక్సిడెంట్స్ మన వయసును తగ్గించేస్తాయి. బీటా కెరోటిన్ విటమిన్ ఎ గా మారి కళ్లు, చర్మం, రోగ నిరోధక శక్తికి అండగా నిలబడుతుంది.
మరీ ముఖ్యంగా ఇప్పటి పిల్లలకు వస్తున్న కంటి సమస్యలకు నెయ్యి అద్భుతంగా పనిచేస్తుందని చెప్పడానికి కారణం చాదస్తం కాదు… అందులో ఉండే బీటా కెరోటినే. నెయ్యి తినేవారిలో చర్మం మృదువుగా మారడం వెనుక కూడా ఇదే ముఖ్యమైన కారణం. ఇంతేకాదు! మన రోగ నిరోధక శక్తిని పెంచడంలో, ఆస్టియోపొరోసిస్ లాంటి కీళ్ల సమస్యలను నియంత్రించడంలో దీనిదే ప్రముఖ పాత్ర. మెదడు చురుగ్గా పనిచేసేందుకు, ఒంట్లోని చెడు కొవ్వు (LDL)ను తగ్గించేందుకు బీటా కెరోటిన్ చాలా ఉపయోగపడుతుంది.
ఈ బీటా కెరోటిన్తోపాటుగా ఆవు నెయ్యిలో ల్యూటెన్ అనే మరో ముఖ్యమైన పోషకం కూడా ఉంది. బీటా కెరోటిన్, ల్యూటెన్… రెండూ కూడా కెరోటినాయిడ్స్ అనే రసాయనాలకు చెందుతాయి. కాబట్టి ముందు చెప్పుకొన్న లాభాలన్నీ ల్యూటెన్ వల్ల రెట్టింపు అవుతాయి. క్యారెట్, పాలకూరల్లో ఈ ల్యూటెన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టే వాటిని సూపర్ ఫుడ్స్‌గా భావిస్తుంటారు. అవి తింటే కంటికి మంచిదని చెబుతారు. కానీ రోజూ వాటిని తినలేం కదా! ఇప్పటి పిల్లలతో వాటిని తినిపించడమూ కష్టమే. కానీ నెయ్యికి మాత్రం పిల్లలు అభ్యంతర పెట్టరు. కాబట్టి పిల్లలు అన్నం తినే సమయంలో ఓ చెంచా నెయ్యి వేస్తే… నేరుగా వారికి కెరోటినాయిడ్ టాబ్లెట్ అందించినట్లే!
…? కె.సహస్ర