భారతీయుల ఆహారంలో నెయ్యికి ఉన్న ప్రాధాన్యం తెలిసిందే. ఆరాధనలోనూ నెయ్యికి అగ్రాసనమే. ఆజ్యం, ఘృతం దీనికి పర్యాయపదాలు. మనం ఇష్టంగా ఆరగించే నెయ్యిలో ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఈ కారణంగానే దీన్ని వందల ఏండ్లుగా భారతీయ సంప్రదాయ సౌందర్య సాధనాల్లో విరివిగా ఉపయోగిస్తున్నారు. ఆజ్యం అందం పెరగడానికీ ఉపకరిస్తుందన్నమాట!
నెయ్యి చర్మానికి సహజ మాయిశ్చరైజర్‌గా ఉపయోగపడుతుంది. ఇందులో ఉన్న ఫ్యాటీ ఆమ్లాలు పొడిబారిన చర్మానికి పోషణనిస్తాయి. తేమనిస్తాయి. కొంచెం నెయ్యి తీసుకుని ముఖానికి, శరీరానికి సున్నితంగా మర్దనా చేస్తే సరి. పొడిబారిన చర్మం మళ్లీ హైడ్రేట్ అయిపోతుంది.
మృదువైన పెదవుల కోసం నెయ్యిని పల్చటి పొరలా పూసుకోవాలి. ఇలా చేస్తే పొలుసులు బారిన పెదవులకు హైడ్రేషన్ లభించి తేమతో ఉంటాయి.
నెయ్యిని కొద్ది పరిమాణంలో తీసుకోవాలి. దాన్ని గోరువెచ్చగా వేడిచేయాలి. మాడు, వెంట్రుకలకు పట్టించి ఓ గంటపాటు ఉండనివ్వాలి. తర్వాత షాంపూతో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కురులకు, మాడుకు మంచి పోషణ లభిస్తుంది. వెంట్రుకలు మృదువుగా, మెరుస్తూ ఉంటాయి.
నెయ్యిలోని యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్య ఛాయలతో పోరాడతాయి. నెయ్యిని పూసుకొంటే ముఖం మీద ముడతలు, గీతలు తగ్గిపోతాయి.
కండ్ల కింద ఏర్పడే నల్లటి వలయాలు, చర్మం సాగుదలను అరికట్టాలంటే కొద్ది మొత్తంలో నెయ్యిని పడుకునే ముందు కండ్ల కింద రుద్దుకోవాలి.
చర్మం పైపొర సంరక్షణలో, దాన్ని మృదువుగా ఉంచడంలోనూ నెయ్యి సహకరిస్తుంది.
పొడిబారిన, పగుళ్లిచ్చిన మడమలకు పడుకునే ముందు నెయ్యి రాసుకోవాలి. తర్వాత సాక్స్ వేసుకోవాలి. అలా రాత్రంతా ఉంచాలి. దీంతో మొండి చర్మం నుంచి ఉపశమనం లభిస్తుంది.
మేకప్ తొలగించుకోవడానికి నెయ్యి సహజమైన రిమూవర్‌గా పనికివస్తుంది. ముఖానికి నెయ్యిని ఐప్లె చేసి మేకప్ పోయేవరకు సున్నితంగా మర్దనా చేయాలి. తర్వాత గోరువెచ్చటి తడిగుడ్డతో తుడుచుకోవాలి. దీంతో చర్మం శుభ్రపడుతుంది. మాయిశ్చరైజ్ కూడా అవుతుంది.