నేటితరం ఎక్కువగా సోషల్ మీడియాలోనే కాలం గడుపుతున్నది. ‘స్క్రీన్’పై చూసిందే నిజమనే భ్రమలో మునిగిపోతున్నది. అదే సమయంలో ‘పోలికల సంస్కృతి’ కూడా పెరిగిపోతున్నది. ఈ పరిణామం.. టీనేజర్ల భవిష్యత్తుకు పొగబెడుతున్నది. వారి ఆత్మవిశ్వాసాన్ని భ్రమలతోనే నింపేస్తున్నది. ఈ సంస్కృతి ఇలాగే కొనసాగితే.. వారి జీవితం అంధకారమయ్యే అవకాశమున్నది. ఈ క్రమంలో వారి ఆలోచనా విధానాన్ని మార్చాల్సిన అవసరం ఉన్నది.
ప్రస్తుత కాలంలో ఆత్మవిశ్వాసానికి అర్థమే మారిపోయింది. ఒకప్పుడు ఏదో ఒక నైపుణ్యం నేర్చుకున్నప్పుడో, ఏదైనా సాధించినప్పుడో.. వారిపై వారికి ఆత్మవిశ్వాసం కలిగేది. కానీ, ఇప్పుడు.. ఇతరుల వేలి చివరన ఉండే ‘లైక్’ బటన్‌పై ఒకరి ఆత్మవిశ్వాసం ఆధారపడి ఉంటున్నది. ఒక పోస్ట్‌కు వచ్చే లైకులు, కామెంట్లు, షేర్ల సంఖ్యే.. వారి విలువను నిర్ణయిస్తున్నాయి. దాంతో, తక్కువ లైకులు వస్తే తాము ఎవరికీ నచ్చడం లేదని, తమలో ఏదో లోపం ఉందని కుంగిపోతున్నారు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే చాలామంది.. తమ జీవితంలోని అత్యుత్తమ క్షణాలను మాత్రమే పోస్ట్ చేస్తుంటారు. వాటిని చూసేవాళ్లంతా.. అదే నిజమని భ్రమపడుతుంటారు.
తమ రోజువారీ కష్టాలను, లోపాలను.. ఆ సోషల్ మీడియాలోని ఫొటోలతో పోల్చుకుంటారు. దాంతో, అందరూ సంతోషంగా ఉన్నారనీ, తాను మాత్రమే వెనుకబడి ఉన్నాననే భావన చాలామందిలో పెరుగుతున్నది. ఈ భావన దీర్ఘకాలంలో ఆత్మన్యూనతకు దారితీస్తుంది. ఈకాలంలో సహజసౌందర్యం పత్తా లేకుండా పోతున్నది. సోషల్ మీడియాలో అప్లోడ్ చేసే ఫొటోల్లో చాలావరకు ఫిల్టర్లు, ఎడిటింగ్ యాప్‌లతోనే తీర్చిదిద్దుతున్నారు. ఫలితంగా, వారి సహజమైన ముఖం కంటే, ఎడిట్ చేసిన ఫొటోలే ‘అందం’ అనే భ్రమలో టీనేజర్లు పడిపోతున్నారు. దీంతో తమ సహజరూపాన్ని ఇష్టపడలేక పోతున్నారు. తమ శరీర రంగు, రూపంపై అసంతృప్తిని ప్రదర్శిస్తున్నారు.
టీనేజర్లను ఈ కంపేరింగ్ కల్చర్ నుంచి బయట పడేయాల్సిన అవసరం ఉన్నది. లేకుంటే, అదే నిజమనే భ్రమలతో బతికేసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి, తల్లిదండ్రులు కొన్ని సూచనలు పాటించాలి. ఆత్మవిశ్వాసం అనేది ఇతరుల స్క్రీన్ల నుంచి వచ్చేది కాదు. అది సొంత వ్యక్తిత్వం నుంచి పుడుతుందనే సంగతి టీనేజర్లకు ఎరుక చేయాలి. సోషల్ మీడియాలోని ఫొటోల వెనుక ఉండే ఫిల్టర్లు, లైటింగ్, ప్రమోషన్స్ లాంటి వాస్తవాలను పిల్లలకు వివరించాలి. బాహ్యరూపం కంటే.. అంతర్గత నైపుణ్యాలే గొప్పవని చెప్పాలి. అందం కన్నా.. ప్రతిభ, మంచి ప్రవర్తనతోనే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందనే విషయాన్ని వారికి వివరించాలి. అయితే, సోషల్ మీడియా, పోలికల సంస్కృతి గురించి టీనేజర్లతో మాట్లాడటం కత్తిమీద సాము లాంటిది. కాబట్టి, రోజూ లెక్చర్లు ఇవ్వకుండా.. వారిని డిజిటల్ డిటాక్స్వైపు నడిపించాలి.
‘ఫోన్ వద్దు’ అని చెప్పేకన్నా.. బదులుగా వారు ఏం చేయవచ్చో చూపించాలి. ఇంట్లో ‘నో ఫోన్ జోన్స్’ ఏర్పాటు చేయాలి. డైనింగ్ టేబుల్ దగ్గర, బెడ్రూముల్లో ఫోన్లు వాడకూడదని రూల్ పెట్టాలి. ఈ రూల్ తల్లిదండ్రులు కూడా పాటించాలి. ఇక అవసరం లేని యాప్స్‌లో నోటిఫికేషన్స్ ఆఫ్ చేయించాలి. అప్పుడు ఫోన్ చూడాలనే కోరిక వారిలో తగ్గుతుంది. ఫోన్‌ను ‘గ్రే స్కేల్ మోడ్’లోకి మార్చడం కూడా మార్పు తీసుకొస్తుంది. ఎందుకంటే, రంగులు లేకుండా, ‘బ్లాక్ అండ్ వైట్’లో కనిపించే ఫోన్ వాడటం బోర్ కొడుతుంది. ఇలాంటి చిన్నచిన్న చిట్కాలు పాటిస్తూ ఉంటే.. టీనేజర్లకు ‘డిజిటల్ బ్రేక్’ ఇవ్వొచ్చు.