వినాయక చవితి కోలాహలం ఇప్పటికే మొదలైంది. వీధివీధిలో మంటపాలు ముస్తాబవుతున్నాయి. ఏకదంతుడి విభిన్న విగ్రహాలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే స్వహస్తాలతో తీర్చిదిద్దిన మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి, పూజిస్తే కలిగే అనుభూతే వేరుగా ఉంటుందంటున్నది అహ్మదా బాద్‌కు చెందిన ఆంత్రప్రెన్యూర్ గీతిక సలూజా. కొన్నేండ్లుగా ఆమె ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నది. పర్యావరణానికి మేలు చేసే ఈ క్రతువు తన ఇంటికే పరిమితం చేయాలనుకోలేదు.
ఈ కార్యక్రమంలో మరెందరినో భాగస్వాములను చేయాలని భావించింది. మూడేండ్ల కిందట కొవిడ్ సమయంలో వాట్సాప్ గ్రూప్ ద్వారా మట్టి వినాయక విగ్రహాల తయారీ వర్క్‌షాప్ నిర్వహించింది. ఆన్లైన్లో విగ్రహ తయారీ పాఠాలు చెప్పి.. అందరితోనూ ముచ్చటైన మూర్తులను తయారు చేయించింది. తర్వాతి సంవత్సరం నుంచి పండుగకు ముందు పదుల సంఖ్యలో వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నది. మట్టి వినాయకుల ప్రాశస్త్యాన్ని తెలియజేస్తూ, పర్యావరణానికి తనవంతుగా మేలుచేస్తూ ఏక దంతుడిని ఎకో దంతుడిగా ప్రతిష్ఠిస్తున్నది.