చలికాలం వచ్చిందంటే చాలు ఉదయాన్నే పొగమంచును ఆస్వాదిస్తూ వేడి వేడి టీతో మన శరీరాన్ని ఉత్తేజపరుస్తాం. చలి నుంచి తప్పించుకోవడానికి ఇంట్లోని కిటీకీలు, తలుపులన్నీ పరదాలతో కప్పేస్తాం. కానీ, గార్డెనింగ్ ప్రేమికులు మాత్రం చలికాలంలో తమకు అత్యంత ఇష్టమైన మొక్కలను పెంచే పనిలో ఉంటారు. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు గార్డెనింగ్‌కు అత్యంత చక్కని సీజన్‌గా పేర్కొంటారు.
ఈ సమయంలో వాతావరణం చల్లగా, పొడిగాలులతో ఉండటం మూలంగా చాలారకాల పూలు, కూరగాయలు, ఇతర మొక్కలు ఏపుగా పెరుగుతాయి. చలికాలంలో పూదోటలన్నీ రంగురంగుల పూలతో కనువిందు చేస్తుంటాయి. ఈ సీజన్లోనే బంతిపూలు విరివిగా పూస్తాయి.
ఇక పాలకూర, మెంతికూర, ముల్లంగి, బీట్రూట్ వంటివి బాగా పండటంతోపాటు చక్కని రుచినీ అందిస్తాయి. అయితే ఈ సీజన్లో సూర్యరశ్మి తక్కువ ఉంటుంది కాబట్టి మొక్కలను వెలుతురు అధికంగా ఉండే ప్రదేశంలో పెంచాలి. రోజుకు కనీసం 4-5 గంటలైనా సూర్యకాంతి వీటికి అవసరమవుతుంది. చల్లని వాతావరణం ఉన్నందున్న నీటి అవసరం తక్కువే ఉంటుంది.
ఉదయం పూట మాత్రమే నీళ్లు పోస్తే సరిపోతుంది. మట్టిలో మొక్క రక్షణకోసం 2-3 అంగుళాల ఆర్గానిక్ కంపోస్ట్ కలపడంతో పాటు ఫంగస్, పురుగులను నివారించేందుకు నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తే సరిపోతుంది. ప్రకృతి నిద్రలోకి జారుకుంటున్నప్పుడు మీ గార్డెన్ పచ్చదనంతో మేల్కొని ఉండి చలికాలంలోనూ వసంతాన్ని తెస్తుంది.