ఇంగువ ఆహారపు రుచిని పెంచుతుంది. ఇందులో ఉండే ఔషధ గుణాలు అజీర్తి, గ్యాస్, మలబద్ధకం మొదలైన సమస్యల నుంచి ఉపశమనాన్ని ఇస్తాయి. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలతో సమృద్ధమైన ఇంగువ నొప్పులను కూడా తగ్గిస్తుంది. పరగడుపునే ఇంగువ తీసుకోవడం వల్ల ఏయే రుగ్మతల నుంచి విముక్తి పొందొచ్చో తెలుసుకుందాం.
కడుపు నొప్పి: ఇంగువలో ఉండే ఔషధ గుణాలు కడుపుబ్బరం సమస్యకు విరుగుడుగా పనిచేస్తాయి. చాలాసార్లు కడుపునొప్పికి కారణం గ్యాస్, కడుపుబ్బరం సమస్యలే. కాబట్టి, చిటికెడంత ఇంగువను పరగడుపున తీసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది.
రక్తపోటు (బీపీ): ఇంగువ శరీరంలో బ్లడ్ క్లాట్స్‌ను నివారిస్తుంది. రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది. రోజూ పొద్దునే ఇంగువ కలిపిన నీళ్లు తాగితే రక్తపోటు నియంత్రణలో సహాయకారిగా ఉంటుంది.
తలనొప్పి: పరగడుపునే ఇంగువ తీసుకోవడం వల్ల తలనొప్పి బాధ నుంచి విముక్తి లభిస్తుంది. ఇంగువలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు తలనొప్పి చికిత్సలో ఉపకరిస్తాయి. కాకపోతే, ఆయుర్వేదం లేదా అలోపతి ఏ విధానంలో అయినా దీన్ని ప్రత్యేక అవసరాల కోసం వాడినప్పుడు డాక్టర్‌ను సంప్రదించిన తర్వాతే తీసుకోవడం మంచిది.