Morning | మీ ఉదయాలు ఎలా ఉంటున్నాయి? ఉత్తేజకరంగానా? నీరసంగానా? మంచం మీదినుంచి లేస్తూనే .. ‘అబ్బా! ఈ రోజు ఎన్ని సమస్యలు ఎదుర్కోవాలో’ అనే ఒత్తిడి మీ మనశ్శాంతిని హరించివేస్తున్నదా? అయితే, ఒక ప్రణాళిక ప్రకారం పని మొదలుపెడితే.. ఉదయాలు ఫ్రెష్‌గా, రిలాక్సింగ్‌గా ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. అదెలాగో తెలుసుకోండి. ఆ విజయఫలాలను ఆస్వాదించండి. ఉదయపు ఘడియలను సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోండి.
ఉదయం.. ఓ కొత్త రోజుకు ఆరంభం. డైరీలో కొత్త పేజీకి ఆవిష్కారం. ఎవరికి తెలుసు? ఈ ఉదయం కొత్త జీవితానికి నాంది కావచ్చు. ఒక విజయానికి పునాది కావచ్చు. ఉదయాన్ని మీరెలా ప్రారంభిస్తారు అనే దానిపైనే.. మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి.. మొత్తంగా రోజంతా ఎలా ఉండబోతుందనేది ఆధారపడి ఉంటుంది. అందుకే ఉషోదయానికి ఇంతటి విలువ, అంతటి ప్రాధాన్యం. ‘ప్రతిరోజూ కీలకమైనదే అనే భావనను మీ హృదయంలో ప్రతిష్ఠించుకోండి’ అంటారు కవి ఎమర్సన్. ఉదయం ఓ గంట సమయాన్ని కోల్పోయామంటే, దానికోసం రోజంతా వెతుక్కోవలసిందే అని చమత్కరిస్తారు కూడా. ‘అన్నిటికంటే గొప్ప విషయం.. ఈ క్షణం వరకూ మనం జీవించి ఉండటం. అందుకే, ఉదయం నిద్రలేవగానే మనం బతికున్నందుకు సంతోషించాలి. సృష్టికర్తకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి’ అంటాడు రోమన్ చక్రవర్తి మార్కస్ అరులియస్. ఒక్కసారి ఆలోచించండి. అందరిలానే రాత్రి ఏ పదింటికో నిద్రపోయినవారిలో.. ఎంతమంది మరుసటి రోజు ఉదయాన్ని చూడగలుగుతారు? ఆ నిద్రే శాశ్వతం కావచ్చు. మరో ఉదయాన్ని చూసే అవకాశమే రాకపోవచ్చు. ఆ మేరకు మనం చాలా అదృష్టవంతులం. ఆ దివంగతులలో మనం ఒకరం కాలేదు. ముఖం మీద చిరునవ్వు, గుండెల నిండా సంతోషం నింపుకొని, ప్రశాంత చిత్తంతో ఓ కొత్త ఉదయానికి స్వాగతం పలుకుదాం రండి!
పొద్దున్నే నిద్రలేవగానే మంచం పక్కన ఉన్న మొబైల్ ఫోన్ అందుకోవడంతోనే చాలామంది దినచర్య మొదలవుతుంది. వాట్సాప్ మెసేజ్‌లు, ఈమెయిళ్లు, సోషల్ మీడియా.. ఇలా ఒకదాని తర్వాత మరొకటి. ఎంతసేపు వాటిలో మునిగిపోతారో చెప్పలేం. బయటపడేసరికి రోజులో విలువైన సమయం కరిగిపోయి ఉంటుంది. వయసుతో నిమిత్తం లేకుండా దాదాపు 61శాతం మందిలో ఈ అలవాటు ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. నిద్రలేవగానే మొబైల్ చూడటం వల్ల అనేక నష్టాలు. సెల్‌ఫోన్ స్క్రీన్ ప్రకాశవంతమైన నీలం రంగును కలిగి ఉంటుంది. ఇది నేరుగా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఫలితంగా ఏకాగ్రత కుదరకపోవడం, తలబరువుగా అనిపించడం.. తదితర సమస్యలు వస్తాయి. ఆందోళన పెరిగిపోయి రక్తపోటుకు దారితీయవచ్చని హెచ్చరిస్తున్నారు. పొద్దున అనేకాదు.. రాత్రి పడుకోబోయేముందు కూడా మొబైల్ ప్రపంచంలో మునిగిపోతుంటారు. దీంతో నిద్ర ఆలస్యమవుతుంది. పడుకున్నా.. మనసులో ఏవో ఆలోచనలు, అర్థంలేని స్వీయ సంభాషణలు. మధ్య మధ్యలో పీడకలలు చికాకు పెడుతుంటాయి. దీనివల్ల లేచీలేవగానే అసహనం మొదలవుతుంది. తాజాదనం అస్సలు కనిపించదు. ఇటీవల చాలామంది హోమ్ జిమ్‌ల వైపు మొగ్గుతున్నారు. ఉదయం వ్యాయామం చేయడానికి కుదరడం లేదంటూ.. రాత్రిళ్లు బరువులెత్తుతారు. ఈ అలవాటు నిద్రను దెబ్బతీస్తుంది. పడుకునే ముందు వేడినీళ్లతో స్నానం చేయటం వల్ల మనసుకు హాయిగా అనిపిస్తుంది. ఏదైనా పుస్తకం చదివితే నిద్ర దానంతట అదే వచ్చేస్తుంది.
ప్రశాంతంగా నిద్ర లేవటానికి మంచి చిట్కా.. రోజూ ఒకే సమయానికి నిద్రపోవటం, ఒకే సమయానికి మేల్కొనడం. ఈ అలవాటును కనక కొనసాగిస్తే, మీ ‘జీవ గడియారం’ అందుకు మిమ్మల్ని సిద్ధం చేస్తుంది. రాత్రులు నిర్ణీత సమయానికంతా టీవీ కట్టేయండి. మొబైల్‌ను దూరంగా నెట్టేయండి. ఎన్నింటికి లేవాలన్నది నిర్ణయించుకోండి. ఆరోగ్యవంతులకు ఎనిమిది గంటల నిద్ర సరిపోతుంది. చాలా మంది మెలకువ వచ్చినా, అలారం ఆపేసి, మళ్లీ ముసుగుతన్నేస్తారు. ఒక్క క్షణం నిద్రమత్తును వదిలించుకుంటే.. రోజంతా మీదే!
సంపూర్ణ ఆరోగ్యాన్ని కోరుకునేవారు ప్రాతఃకాలంలో నిద్రలేవాల్సిందే. బ్రాహ్మీముహూర్తంలో మేల్కొనేవారికి తేజస్సు, బలం, విద్య, ధనం సమృద్ధిగా సమకూరుతాయని ఆయుర్వేదం చెబుతున్నది. మిట్టమధ్యాహ్నం వరకూ గురకపెట్టేవారిని ఆయుఃక్షీణంతో పాటు రకరకాల జబ్బులు వెంటాడతాయని హెచ్చరిస్తున్నది. బ్రాహ్మీ ముహూర్తం.. అంటే సూర్యోదయానికి 96 నిమిషాల ముందు కాలం. ఇది సీజన్‌ను బట్టి మారుతుంది. ఈ సమయంలో ప్రకృతి ప్రశాంతంగా ఉంటుంది. నిద్రలోని ఆఖరు ఝామును ఆస్వాదిస్తూ ఉంటుంది. అప్పటికి వెలుతురు ఇంకా మనల్ని పూర్తిగా చేరుకోదు. రాత్రిపూటలోని చల్లదనాన్ని, పగటిపూటలోని చురుకుదనాన్ని ఇముడ్చుకున్న వేళ అది. ఈ సంధి సమయంలో మనుషులు సత్వగుణ ప్రధానంగా ఉంటారని అంటారు. శరీరంలో కదలికలను, మనసులో ఆలోచనలను ఆ గుణం ప్రభావితం చేస్తుంది. ఎలాంటి పని అయినా చురుగ్గా చేయగలుగుతాం. కాబట్టే, ధ్యాన సాధనకు ప్రశస్తమని యోగశాస్త్రం చెబుతున్నది. మన శరీరంలోని ఇడ, పింగళ, సుషుమ్న నాడుల్లో.. ఈ సమయంలో సుషమ్న నాడి ఉత్తేజితమై ఉంటుంది. ఫలితంగా ధ్యానం సులువుగా సాగిపోతుంది. సాధారణంగా తెల్లవారుజామున వచ్చే గుండెపోటు తీవ్రంగా ఉంటుంది. గుండె సమస్యలు ఉన్నవారు మనసుపై ఒత్తిడి పెంచుకోకూడదు. అందులోనూ వేకువజామున ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి. వృత్తి విద్యావ్యాపారాల వల్ల కావచ్చు, జీవనశైలి మార్పుల వల్ల కావచ్చు, అర్ధరాత్రుల వరకూ పనిచేసే అలవాటు ఎక్కువగా ఉంటున్నది. దీనివల్ల దినచర్యను త్వరగా ప్రారంభించటం సాధ్యం కావటం లేదు. ఆలస్యంగా నిద్రలేచి అన్ని పనులూ చక్కబెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ.. ఏ పనికీ న్యాయం చేయకుండా.. ఒత్తిడి పెంచుకునే బదులు కాసింత ముందుగా లేవటం వల్ల ప్రణాళిక ప్రకారం పనులు చేసుకోవచ్చు.
మేధస్సు జన్యువుల నుంచి వచ్చేది కాదు. కొంత దైనందిన అలవాట్ల వల్ల అబ్బుతుంది. కొంత శిక్షణతో సాధ్యమవుతుంది. అందుకే మనసుకు తగిన శిక్షణ ఇవ్వండి. అప్పుడే, మీ సామర్థ్యాలను వ్యక్తీకరించగలరు. మిమ్నల్ని మీరు తీర్చిదిద్దుకోగలరు. మీరు విద్యార్థి కావచ్చు. గృహిణి కావచ్చు. వృత్తివ్యాపారాల్లో నిమగ్నమైన వారు కావచ్చు. అప్పుడే, సంపూర్ణంగా మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోగలరు. మీదైన రంగంలో ఉన్నతస్థాయికి చేరగలుగుతారు. గతంలో ఏవేవో పరిమితులు మిమ్మల్ని దెబ్బతీసి ఉండొచ్చు. వైఫల్యాలు గాయపరిచి ఉండొచ్చు. అంత మాత్రాన మీరేమీ సాధించలేదని కాదు. ఈ విషయాన్ని బలంగా నమ్మండి. ‘ఈ రోజు నాకు లభించిన గొప్పవరం. దీనిని నేను గౌరవిస్తాను. దాని విలక్షణతను ఇష్టపడతాను. పూర్తిగా సద్వినియోగం చేసుకుంటాను. రాబోయే క్షణాల్లో నన్ను నేను నాయకునిగా నిరూపించుకుంటాను. దూరదృష్టితో వ్యవహరిస్తాను. అత్యంత క్రమశిక్షణతో వ్యవహరిస్తాను. పనిమీద పూర్తిస్థాయిలో మనసు లగ్నం చేస్తాను. నిన్నటి కంటే గొప్పగా సాహసాన్ని ప్రదర్శిస్తాను. మరింత ఆశాభావంతో మెలుగుతాను. సందేహాలు చుట్టుముట్టినా సరే, చేపట్టిన ప్రాజెక్టులను పూర్తిచేసి తీరతాను. నేను మాటల మనిషిని కాదు, చేతల మనిషినని నిరూపించుకుంటాను’.. ఈ వాక్యాలను ఉదయం పూట ఒకటికి రెండుసార్లు మననం చేసుకుని చూడండి. ఆ ప్రభావం మీకే అర్థమవుతుంది. తెలియకుండానే ఉత్సాహం పెరుగుతుంది. నిరాశానిస్పృహలు దరిచేరవు. మీ గతం భవిష్యత్తును నిర్దేశించలేదు. నిన్నటి కంటే ఈ రోజు.. ఈ రోజు కంటే రేపు.. మరింత గొప్పగా ఉండగలుగుతారు. మిమ్నల్ని మీరు సిద్ధం చేసుకున్నప్పుడే మీ శక్తిసామర్థ్యాలు పదునెక్కుతాయి. పోరాటయోధునిగా మారతారు. అవాంతరాలను, అవమానాలను, అవహేళనలను అధిగమించి స్థిరంగా ముందుకు సాగుతారు. గతం తాలూకు భయాలు, భవిష్యత్తు పట్ల ఆందోళన లేకుండా ప్రస్తుత క్షణాల్లో జీవించగలుగుతారు. ఆశావహ దృక్పథానికి ఈ అభ్యాసం దోహదపడుతుంది.
‘ఏది లేదు’ అనే చింతే చికాకులకు కారణమవుతుంది. ‘ఏది ఉంది’ అన్న విషయంపై దృష్టి మళ్లించి చూడండి. జీవితాన్ని మీరు చూస్తున్న తీరు ఒక్కసారిగా మారిపోతుంది. మీ కుటుంబం నుంచి ప్రారంభించి ఇన్నాళ్ల ప్రయాణంలో మిమ్నల్ని ఆదరించిన స్నేహితులు, సన్నిహితులు, బంధువులు, ఎంచుకున్న రంగంలో సాధించిన విజయాలు, కష్టాలను అధిగమించిన తీరు.. ఇవన్నీ గమనంలోకి తీసుకున్నప్పుడు మీకు తెలియకుండా మీరు సమర్థులన్న భావన ఏర్పడుతుంది.
నిజమైన స్నేహితులు, శ్రేయోభిలాషులు నక్షత్రాల్లా ఎప్పుడూ ఉంటారు. కానీ వాళ్లని మనం నేరుగా చూడలేం. కష్టాలనే కారు చీకట్లు కమ్ముకున్నప్పుడే గమనిస్తాం. మేలు చేసిన స్నేహితులకు థ్యాంక్స్ చెప్పండి. అవసరమైన వారికి మీ వంతు సాయం అందించటానికి సిద్ధం కండి. సాయం అంటే ఆర్థికంగానే కాకపోవచ్చు.. మంచి సలహా.. మంచి మాట.. నేనున్నాననే భరోసా.. ఏదైనా కావచ్చు. ఇష్టంగా వ్యక్తీకరించండి. అది మీ మనసుకు తెలియని సాంత్వనను అందిస్తుంది.
నడక అత్యుత్తమ వ్యాయామం. 19 నుంచి 64 సంవత్సరాల మధ్య వారంతా వారానికి 150 నిమిషాలపాటు నడిస్తే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతారు. నడుస్తున్నప్పుడు బ్రీతింగ్ రేట్ పెరుగుతుంది. రక్తంలో ఆక్సిజన్ వేగంగా ప్రయాణించేలా చేస్తుంది. దీనివల్ల శరీరంలోని వ్యర్థాలను తొలగించుకోవటం వీలవుతుంది. గుండెజబ్బులు, పక్షవాతం, అధిక రక్తపోటు, క్యాన్సర్, టైప్2 డయాబెటిస్ అదుపులోకి వస్తాయి. ఎముకలు, కండరాలు గట్టిపడతాయి. ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. కండరాల సామర్థ్యం హెచ్చుతుంది. ఒత్తిడి తగ్గి మంచి నిద్ర పడుతుంది. ఒక కి.మీ. దూరం నడవటం అంటే.. సుమారు 1250 అడుగులు వేయటం అని చెబుతున్నారు. రోజూ పావు మైలు నడిచే వృద్ధులు.. మిగిలినవారితో పోలిస్తే డెమెన్షియా, అల్జీమర్ వ్యాధుల ప్రభావానికి దాదాపుగా లోనుకారని యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా అధ్యయనం వెల్లడించింది. బరువు తగ్గాలనుకునేవారికి నడకకు మించిన ఔషధం లేదు. సైక్లింగ్, స్విమ్మింగ్ లాంటి ఇతర వ్యాయామాలూ ఉత్తమమే.
నిద్రలేవగానే అరచేతులు రెండూ గట్టిగా రుద్దుకుని కళ్లమీద ఉంచుకుంటే, వేలికొసలన్నీ ఒక్కసారిగా ఉత్తేజితమవుతాయి. దానివల్ల నిద్రమత్తు ఎగిరిపోతుంది. కళ్ల నరాలతో పాటు సకల ఇంద్రియాలూ చైతన్యమంతం అవుతాయి.
‘కరాగ్రే వసతే లక్ష్మీ
కరమధ్యే సరస్వతీ
కరమూలే స్థితాగౌరీ
ప్రభాతే కరదర్శనం…
ఉదయం నిద్రలేవగానే కరదర్శనం చేసుకోవాలని పురాణాల సూచన. ‘కరము’ అంటే చేయి. అరచేతి చివర లక్ష్మి (క్రియాదేవత), అరచేతి మధ్యలో సరస్వతి (విద్యాదేవత), మొదట గౌరీదేవి (ఆలోచలనకు, శుభాలకు, శక్తికి అధిదేవత) ఉంటారు. అంతటి పవిత్రమైన అరచేతిని ఉదయమే దర్శిస్తున్నామనే ఆలోచన ఆస్తికులకు ఆధ్యాత్మిక బలాన్నిస్తుంది. అలాగే మంచం మీదినుంచి లేచేటప్పుడు భూమిని కాలు తాకే ముందు భూమాతకు నమస్కరించేవాళ్లు కూడా ఉన్నారు. ఇవన్నీ ఆయా వ్యక్తుల విశ్వాసాలపై ఆధారపడతాయి. కానీ తెల్లవారుజామునే నిద్రలేవడాన్ని, పాజిటివ్ దృక్పథంతో దినచర్యను ప్రారంభించడాన్ని ఎవరూ కాదనలేరు. ప్రాత:కాలంలో నిద్రలేచిన తర్వాత కాలకృత్యాలను తీర్చుకునే ముందు.. పొట్టనిండా నీళ్లు తాగాలని ఆయుర్వేదమే కాదు, అన్ని వైద్యగ్రంథాలూ చెబుతున్నాయి. ‘హైడ్రేషన్’ ఆరోగ్యానికి చాలా అవసరం. ఎక్కువ సేపు నిద్రలో గడపటం వల్ల ఒంట్లో నీటి శాతం తగ్గుతుంది. ఆ లోటును భర్తీ చేస్తే శరీరం తన పని ప్రారంభిస్తుంది. ఆ తర్వాత జీవితలక్ష్యాల సాధనకు మిమ్మల్ని మీరు సమాయత్తం చేసుకోవచ్చు. ఆలస్యమెందుకు? ఆరంభించండి.
ఎంత పరుగులెత్తే జీవితమైనా కుటుంబసభ్యులతో కబుర్లు చెప్పుకొంటూ బ్రేక్ ఫాస్ట్ చేయటం వల్ల ఆ రోజుకు సరిపడా ఉత్సాహం లభిస్తుందని భావిస్తారు కొందరు. మధ్యాహ్న భోజనం ఆఫీస్‌లోనే చేయకతప్పదు, రాత్రి ఎన్నింటికి చేరుకుంటారో చెప్పలేని పరిస్థితి. చేతిలో ఉన్నది బ్రేక్‌ఫాస్ట్ సమయం మాత్రమే. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
నిద్రలేవగానే సెల్‌ఫోన్ పట్టుకుని బాత్రూమ్కి పరుగెత్తుతారు కొంతమంది. అక్కడే వార్తలు చదివేస్తారు. సోషల్ మీడియా అప్డేట్స్ చూసుకుంటారు. బంధువులతో ఫోన్లో మాట్లాడుకుంటారు. ఇది మంచి అలవాటా, కాదా.. ఆరోగ్యకరమా, అనారోగ్యకరమా.. అన్నది పక్కన పెడితే, విజయవంతమైన వ్యాపారదిగ్గజాలు అనుసరించే విధానమిది.
మనసులో వేలాది ఆలోచనలు పేరుకుపోయి మీకు మనశ్శాంతి లేకుండా చేయవచ్చు. ఆ దాడిని క్రమంగా నియంత్రించడానికి ఒకటే మార్గం. వాటి ప్రవాహాన్ని ప్రేక్షకునిలా గమనించటం అలవాటు చేసుకోవాలి. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒకటే.. నేలమీద బాసింపట్టు వేసుకుని కూర్చోండి. మెడ, వెన్నెముక, భుజాలు ఒక సరళరేఖలో ఉండాలి. వీపు దగ్గర ఎలాంటి ఆసరా ఉండకూడదు. చేతుల్ని తొడలమీద ఉంచుకోవాలి. శరీరాన్ని విశ్రాంతిగా ఉంచుకోండి. ప్రశాంతంగా, నిశ్చలంగా ఉన్న భావన అవసరం. ముక్కు నుంచి గాలిపీల్చడం, వదలడం మినహా శరీరాన్ని అటూఇటూ కదపకండి. శరీరం నిశ్చలస్థితికి వచ్చినప్పుడు, పూర్తిగా రిలాక్స్ అయిపోయి మీ ఆలోచనలను మీరు గమనించడం ప్రారంభిస్తారు. సముద్రంలో అలలను, ఆకాశంలో మేఘాలను ఎలా గమనిస్తామో అలా గమనించాలి. ఏ ఆలోచనకూ స్పందించకూడదు. ఆ తర్వాత మిమ్మల్ని మీరు ఓ ప్రేక్షకునిలా పరిశీలించడం మొదలుపెట్టండి. మీ ఆలోచల నుంచి మిమ్నల్ని విడదీసి చూడండి. మొదట్లో మీకు మంచి ఆలోచనలు కలగకపోవచ్చు. కానీ ప్రతి ఉదయం, సాయంత్రం కనీసం 10 నిమిషాల పాటు ఈ అభ్యాసాన్ని కొనసాగిస్తే ప్రభావవంతమైన మార్పు కనిపించి తీరుతుంది. వ్యాయామం మీ శరీరం భావోద్వేగాలను వ్యక్తీకరించే పనిముట్టు. మీ ఆరోగ్యానికి, శ్రేయస్సుకు ఏది అవసరమో శరీరమే చెబుతుంది. ఆ మాటను శిరసావహించమని ఫిట్నెస్ నిపుణులు చెబుతారు. ఏరోబిక్స్ వల్ల ఆందోళన, కుంగుబాటు నుంచి విముక్తం కావచ్చు. వ్యాయామం చేస్తే రక్తప్రసరణ పెరుగుతుంది. రోజువారీ ఒత్తిళ్లను సమర్థంగా ఎదుర్కొంటాం. అంతేకాదు. సవాళ్లను అధిగమించే సామర్థ్యం కూడా రెట్టింపు అవుతుంది.
రోజువారీ అనుభవాలను రికార్డు చేసుకోవటం ద్వారా స్వీయ సమీక్ష సాధ్యమవుతుంది. మన లోపాలను సరిదిద్దుకోవచ్చు. కొత్త పాఠాలు నేర్చుకోవచ్చు. వృత్తిపరంగా ఉత్పాదకత పెంచుకోవచ్చు.
మీకు తెలుసుగా..
మంచి ఆలోచన.. మంచి చర్యలకు
మంచి చర్యలు.. మంచి అలవాట్లకు
మంచి అలవాట్లు..మంచి వ్యక్తిత్వానికి
మంచి వ్యక్తిత్వం.. మంచి భవిష్యత్తుకు దారితీస్తాయి.
ప్రతి ఉదయం మంచి ఆలోచనలతో దినచర్యను ప్రారంభిస్తే అది ఉజ్వలమైన భవిష్యత్తుకు దారితీస్తుంది. ఒక పనిలో నిరంతరం నిమగ్నమై, దాని గురించే ఆలోచించేవాళ్లకు జీవితం సానుకూలంగా మారుతుంది. ఈ సత్యాన్ని గ్రహించండి.
గుడ్ మార్నింగ్!