ఈ రోజుల్లో అధిక బరువు చాలామంది ఎదుర్కొంటున్న సమస్య. బరువు పెరిగేకొద్దీ పొలోమంటూ అనారోగ్యాలూ వచ్చి చేరుతుంటాయి. అంతేకాదు, రోజురోజుకూ ఆహార్యంలోనూ తేడాలు కనిపిస్తాయి. ఆరోగ్యంగా ఉండాలన్నా, అందంగా కనిపించాలన్నా బరువు దించుకోవడం ఒకటే పరిష్కారం. బరువు తగ్గాలి అనగానే ఉపవాస దీక్షకు పూనుకుంటే సరిపోతుందని నోరు కట్టేసుకుంటుంటారు. కానీ, సరైన డైట్ పాటిస్తూ నియమబద్ధమైన వర్కవుట్లు చేస్తే బరువు తగ్గడం పెద్ద సమస్యేం కాదు.రెగ్యులర్‌గా ఈ ఎక్సర్సైజ్లు చేసి చూడండి.. తేడా మీకే తెలుస్తుంది.
రేపట్నుంచి పక్కా వాకింగ్ చేస్తా! వాకింగ్ కన్నా జాగింగ్ మిన్న! జాగింగ్ కన్నా రన్నింగ్ చేస్తే కింగులమే! ఇలా తర్కించుకోవడంతోనే రోజులు గడిపేస్తుంటాం. మాటలు కోటలు దాటినా కాలు గడప దాటకుంటే.. బరువు తగ్గడం మాట అటుంచితే, పెరగడం ఖాయం. అందుకే, వాకింగ్, జాగింగ్, రన్నింగ్ ఏది ఎంచుకున్నా దాన్ని నిత్యకృత్యంగా మలుచుకుంటేనే ఫలితం. క్రమం తప్పకుండా ఇవి చేయడం వల్ల బరువు క్రమంగా తగ్గుతారు. శరీరం ఫిట్‌గా తయారవుతుంది.
శరీరంలో అన్ని భాగాలకు ఉపయోగపడే వ్యాయామాల్లో పుషప్స్ ఒకటి. వీటితో శరీరంలోని దాదాపు అన్ని కండరాలు బలోపేతమవుతాయి. అంతేకాదు, పుషప్స్ కారణంగా బరువు కూడా తగ్గుతారు.
స్క్వాట్స్ చేస్తే ఎక్కువ మోతాదులో క్యాలరీలు బర్న్ అవుతాయి. ఎయిర్ స్క్వాట్స్, సైడ్‌స్టెప్ స్క్వాట్స్, సుమో స్క్వాట్స్, లీప్ స్క్వాట్స్ ఇలా రకరకాల వర్కవుట్లు బాడీని ఫిట్‌గా మారుస్తాయి. అదే సమయంలో బరువును తగ్గిస్తాయి.
శరీరాన్ని ఫిట్‌గా ఉంచే వాటిలో డంబెల్స్‌తో చేసే వ్యాయామం ముఖ్యమైనది. ఇది శరీరంలోని ఫంక్షనల్ మొబిలిటీని పెంచుతుంది. డంబెల్స్ చేతుల్లో పట్టుకొని గుంజిళ్లు తీసినట్టు చేసే ఈ వ్యాయామంతో కాళ్లు ఉక్కు స్తంభాల్లా దృఢంగా తయారవుతాయి. కండరాలు బలోపేతం అవుతాయి.