దుస్తులంటే నాగరికత. ఆ దుస్తులే అస్తిత్వ పతాకలు. రంగులే అభిరుచుల వ్యక్తీకరణ. ఆహార్యమే గుర్తింపు, గౌరవం, వారసత్వం. అవన్నీ కోల్పోతే పరాయీకరణే. రంగురంగుల హంగులు ఉండే వస్త్రశ్రేణితో అలరించిన నిన్నటి తరం బంజారాలు.. కాల ప్రవాహంలో తమ ఆహార్యాన్ని కోల్పోయారు. ఈ నేపథ్యంలో గతించిన వైభవాన్ని తిరిగి తీసుకురావడమే కాదు.. ఆ బంజారాల వస్త్ర సౌందర్యాన్ని ఆధునిక దుస్తులకు ఆపాదిస్తున్నది బంజారా కసూతి సంస్థ. లంబాడీ మహిళలను ఆత్మన్యూనత నుంచి ఆత్మగౌరవం వైపు నడిపిస్తున్నది.
తెలంగాణలో లంబాడీలు ఉన్నట్టే.. కర్ణాటకలోనూ ఉన్నారు. వీరిని లంబానీలు అని పిలుస్తారు. ప్రాంతం వేరైనా వీరి కట్టూ, బొట్టూ ఒకేలా ఉంటుంది. విజయపుర ప్రాంతంలో లంబాడీ సామాజిక వర్గానికి చెందినవాళ్లు అధిక సంఖ్యలో ఉంటారు. ఇక్కడి మహిళలు చూపు తిప్పుకోలేనంత అందమైన దుస్తులు, ఆభరణాలను నిండుగా ధరించేవారు. ఒకప్పుడు వీరి ఆహార్యం చూడగానే బంజారాలని గుర్తుపట్టేవాళ్లు. కానీ, ఇప్పుడు తలపై నుంచి జారుతూ ఉండే అద్దాల అంచుల టుక్రీ మెరుపులు లేవు.
సంప్రదాయ గాగ్రీ (లెహంగా) కూడా ధరించట్లేదు. కాంక్లీ (రవిక లాంటిది), దాని పైనుంచి వేసుకునే ఆభరణాలు కూడా దాదాపు కనుమరుగయ్యాయి. గాగ్రీ బదులు చీర కట్టుకుంటున్నారు. ఒకప్పుడు వస్త్రధారణ వల్ల ప్రత్యేకంగా కనిపించే ఈ బంజారా బిడ్డలు సాధారణ ప్రజల్లో కలిసిపోయారు. అందరిలా ఉండాలన్న కోరిక వాళ్లకు లేదు. సంప్రదాయ వస్త్రధారణ పట్ల ప్రేమ తప్ప వ్యతిరేకత లేదు. వారసత్వ కళ మీద మమకారమే కానీ ఛీత్కారం లేదు. వారికి లేనిదల్లా ఉపాధే! డబ్బే అన్నిటినీ శాసిస్తున్న ఈ కాలంలో వారి జీవన సౌందర్యం కనుమరుగైపోయింది.
చేతిలో డబ్బుల్లేని కాలం దాపురించడంతో బతుకు దెరువు కోసం కూలీనాలీ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. గూడేల్లో దర్జాగా ఉన్న బంజారా బతుకులు పట్నాల్లో పరుగులు తీయడం మొదలుపెట్టాయి. ఈ క్రమంలో వాళ్లకే సొంతమైన అల్లికలు చిక్కుల్లో పడ్డాయి. అలా మెరిసే అద్దాలు దారాల కుట్లకు దూరమయ్యాయి. రంగురంగుల అతుకులు ఆదరించేవాళ్లు లేక గతుక్కుమన్నాయి. అల్లి‘కళ’కు దూరమై సంప్రదాయ వస్త్రశ్రేణిని కాదని సింథటిక్ చీరలు చుట్టుకుంటున్నారు బంజారా మహిళలు. ఆరోగ్యవంతమైన వస్త్రధారణ వదిలి రోగాల్ని అంటించే వస్ర్తాలను ఆదరిస్తున్నారు. ఈ దయనీయమైన స్థితిని ఆశా పాటిల్ గుర్తించింది. విజయపురలో పుట్టిన ఆమె చిన్నప్పటి నుంచి లంబానీల దుస్తులు, వాటి ప్రత్యేకతలను ముచ్చటపడి చూస్తూ ఉండేది. కాలక్రమంలో వచ్చిన మార్పుల వల్ల లంబాడీల దుస్తులు మాయమవడం ఆమెను కలచి వేసింది. ఆ సామాజిక వర్గంలో ఎంబ్రాయిడరీ మెలకువలు తెలిసిన మహిళల్ని చేరదీసి ఆ కళను బతికించే పనికి పూనుకున్నది. బంజారా కసూతి అనే సంస్థను ప్రారంభించింది. సృజనాత్మకమైన అల్లికల్లో చేతి వృత్తుల వారి నైపుణ్యాలను, సంప్రదాయ దుస్తులను కాపాడుకోవడం ఈ సంస్థ లక్ష్యం.
హస్తకళలు, సంసృతిని కాపాడుకోవడం కోసం పాటుపడితే కడుపునిండట్లేదనే హస్తకళాకారులు ఇతర వృత్తులకు మారిపోతున్నారు. ఈ రెండు పరిణామాలతో ఎన్నో హస్తకళలు అంతరించి పోతున్నాయి. అవసాన దశలో ఉన్న లంబాడీ ఎంబ్రాయిడరీ, చేనేత హస్తకళలను కాపాడుకోవాలంటే ఆర్థిక స్వావలంబన, సామాజిక భద్రత కల్పించడం కూడా బంజారా కసూతి లక్ష్యంగా పెట్టుకుంది. విజయపుర సమీప గ్రామాలను ఒక యూనిట్‌గా ఆశా పాటిల్ ఎంపిక చేసుకుంది. ఆ గ్రామాల్లో అల్లిక నైపుణ్యం ఉన్న 18 మంది బంజారా మహిళలను గుర్తించింది.
వారంతా కలిసి పనిచేసేందుకు, కొత్త పనులు నేర్చుకునేందుకు సిద్ధపడ్డారు. మార్కెట్‌కి అనుగుణంగా ఆధునిక దుస్తులపై లంబాడీల అల్లికల డిజైన్లు వేసేందుకు వాళ్లకు శిక్షణ ఇచ్చారు. ఎంబ్రాయిడరీలో వాళ్లకు ఉన్న నైపుణ్యంతోపాటు అందులో రాటుదేలేలా, పనిచేసేలా ప్రోత్సాహాన్ని అందించింది ఆశా. వర్క్‌షాప్‌లు నిర్వహించి ఆధునిక దుస్తులు, మార్కెట్ గురించి అవగాహన కల్పించింది. బంజారా కసూతి ప్రయాణం మొదలైన తర్వాత ఆశా పాటిల్‌తో కలిసి పనిచేసేందుకు సీమా కిశోర్ చేయి కలిపింది. ఇద్దరూ కలిసి లంబాడీ కళను, సంప్రదాయాలను కాపాడుతూ రేపటి కోసం కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు.
బంజారా కసూతి లక్ష్యం నెరవేర్చేందుకు ఖాదీ, కాటన్, లినెన్, మిక్స్ ఫ్యాబ్రిక్‌లతో రూపొందించిన దుస్తులపై అల్లికల డిజైన్లను వేయించడం మొదలుపెట్టారు. సంప్రదాయ దుస్తులైన కుర్తా పైజామాల నెక్, హ్యాండ్ బార్డర్లపై అద్దాల మెరుపులు, రంగుల అల్లికలతో ఫ్యాషన్ మార్కెట్‌కి కొత్తందాలు పరిచయం చేశారు. చీరలు, రవికెలకు ఈ అల్లికలు మరింత సొబగుగా కుదిరాయి. ఇక పాశ్చాత్య దుస్తులపై వేసిన బంజారా కసూతి డిజైన్లకు విశేషంగా ఆదరణ లభించింది. యువత డిమాండ్‌కు అనుగుణంగా బంజారా అతివలు అద్భుతాలు చేశారు. ఈ విజయం తర్వాత వస్త్రంతో తయారుచేసిన హ్యాండ్ బ్యాగులు, కుషన్లపై కూడా బంజారా అద్దాల మెరుపులు అద్ది ఇల్లు చక్కదిద్దుకుంటున్నారు.
చేనేత వస్ర్తాలను, ఎంబ్రాయిడరీని ఈతరానికి నచ్చేలా తీర్చిదిద్దడంలో బంజారా కసూతి కృషి ఫలించింది. అనుకున్నట్టే వాళ్లకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరడంతో వేరే వ్యవసాయ పనులకు వెళ్లకుండా పూర్తిగా అల్లికలు, కుట్ల పనుల్లోనే ఉండిపోయారు ఆ మహిళలు. ఒక ప్రాంతంలో విజయవంతమైన ఈ ప్రయోగాన్ని మిగతా ప్రాంతాలకు విస్తరిస్తూ పోయారు ఆశా, సీమా. ఇప్పుడు మొత్తం అయిదు ప్రాంతాల్లో బంజారా కసూతి పని చేస్తున్నది. అరవై మంది మహిళలు ఎంబ్రాయిడరీనే జీవనాధారంగా ఎంచుకుని బతుకుతున్నారు. పూర్వికుల నుంచి వారసత్వంగా వచ్చిన ఈ అల్లికను రేపటి తరం మరచిపోకుండా కాపాడుకునేందుకు వారికి బంజారా కసూతి ఓ అవకాశం కల్పించింది. అంతేకాదు లంబాడీల వేషభాషలపై సమాజంలో ఉండే చిన్నచూపు వల్ల వాళ్ల పిల్లల్లో న్యూనతాభావం పెరిగింది. సంప్రదాయ దుస్తులు ధరించడానికి ఆసక్తి చూపట్లేదు. బంజారా కసూతి ప్రయోగంతో బంజారా వస్త్ర శ్రేణికి నగరాల్లో ఆదరణ పెరిగింది. దీంతో తమ వారసత్వ దుస్తు లు ధరించడం కోసం ఆసక్తి చూపడమే కాదు గర్వంగా భావిస్తున్నారు బంజారా అతివలు.