ఆకస్మిక మరణాలకు కార్డియోవాస్కులర్ వ్యాధులే ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. 2022లో 1.98 కోట్ల మంది కార్డియోవాస్కులర్ వ్యాధుల వల్ల మరణించారని అంచనా. వీరిలో 85% మంది గుండెపోటు, స్ట్రోక్ కారణంగానే మృత్యువాత పడ్డారు. ఈ ఆకస్మిక మరణ ప్రమాదాలకు ‘రాత్రి విధులు’ కూడా ప్రధాన కారణమని తాజా అధ్యయనం బయటపెట్టింది. ఇందుకు సంబంధించిన విషయాలన్నిటినీ ‘జర్నల్ ఆఫ్ ది అమెరికన్ హార్ట్ అసోసియేషన్’లో ప్రచురించింది. అధ్యయనంలో భాగంగా, యునైటెడ్ కింగ్డమ్కు చెందిన ‘యూకే బయోబ్యాంక్’ నుంచి డేటాను విశ్లేషించారు. ఈ సందర్భంగా 3,22,777 మంది హెల్త్ రికార్డులను పరిశీలించారు.
వీరంతా 39-74 సంవత్సరాల వయస్సు గలవారే! వారి జీవన శైలితోపాటు జాబ్ షిఫ్టింగులు, రాత్రిపూట నిద్రించే సమయం, ఆహారపు అలవాట్ల గురించిన సమాచారాన్ని విశ్లేషించారు. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలను గుర్తించారు. సాధారణ ఉద్యోగ సమయం (ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు) ఉద్యోగం చేసేవారితో పోలిస్తే.. రాత్రి విధుల్లో ఉండే ఉద్యోగులకు హృదయ సంబంధ సమస్యలు వచ్చే ప్రమాదం 79శాతం ఎక్కువ ఉన్నదని కనుగొన్నారు.
ఇతరుల కన్నా.. వీరు గుండెపోటుతో మరణించే అవకాశం కూడా ఎక్కువేనని తేల్చారు. ఇందుకుగల కారణాలను వివరిస్తూ.. రాత్రిపూట ఆలస్యంగా మేల్కొని ఉండటం వల్ల గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. రాత్రి ఆలస్యంగా నిద్రపోయేవారిలో రక్తపోటు, ఊబకాయం, టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట. ఇవన్నీ చివరికి గుండెపోటు లేదా స్ట్రోక్‌కు దారితీసే అవకాశం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక రాత్రిపూట ఎక్కువగా మేల్కొని ఉండేవారు.. జంక్ ఫుడ్, అధిక కేలరీలు ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటారు.
ఇది రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయులను పెంచుతుంది. అంతేకాకుండా.. నైట్ డ్యూటీలు చేసేవారి సర్కాడియం రిథమ్ గందరగోళానికి గురవుతుంది. శరీరంలోని హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఇక నిద్ర లేకపోవడం వల్ల మెదడుపై ఒత్తిడి పెరిగి, అది పరోక్షంగా గుండె పనితీరుపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా, హృదయ సంబంధ సమస్యలు మరింత తీవ్రమవుతాయి. ఈ సమస్య నుంచి బయట పడటానికి గుండె ఆరోగ్యానికి హామీనిచ్చే ఆహారాన్ని తీసుకోవాలని చెబుతున్నారు. రాత్రి విధులు నిర్వహించేవారు రోజువారీ వ్యాయామంపైనా ప్రత్యేక దృష్టిపెట్టాలని అంటున్నారు.