ప్రణాళికాబద్ధమైన వ్యాయామం.. క్యాన్సర్‌ను తరిమేస్తున్నది. ముఖ్యంగా, పెద్దపేగు క్యాన్సర్‌బారిన పడి.. సర్జరీ, కీమోథెరపీ చేయించుకున్నవారికి పునర్జన్మను ప్రసాదిస్తున్నది. వీరిలో క్యాన్సర్ పునరావృతం కాకుండా ఉంటున్నదని ‘న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్’లో తాజాగా ప్రచురితమైన ఓ అధ్యయనం వెల్లడించింది. ఈ సర్వేలో భాగంగా ఆరు దేశాలకు చెందిన 900 మంది రోగుల హెల్త్ ట్రాక్‌ను అధ్యయనకారులు పరిశీలించారు. రెగ్యులర్ ఎక్సర్సైజ్.. పెద్దపేగు క్యాన్సర్ రోగులకు చికిత్స అందించడమే కాకుండా, వారు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండటానికీ సాయపడుతుందని వారు వెల్లడిస్తున్నారు. కీమోథెరపీ తర్వాత మూడేళ్లపాటు ప్రణాళికాబద్ధమైన వ్యాయామం పాటించినవారిలో.. క్యాన్సర్ పునరావృతమయ్యే ప్రమాదం 28శాతం తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. మరణించే ప్రమాదం 37 శాతం తగ్గుతుందని కనుగొన్నారు. ఇందుకుగల కారణాలను ఇలా వివరిస్తున్నారు.
వ్యాయామంతో శరీరంలో జీవసంబంధమైన ప్రతిస్పందనలు ప్రేరేపితం అవుతాయి. జీవక్రియ మెరుగుపడుతుంది. పొట్టలో బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. పొట్ట లైనింగ్‌కు మరమ్మతు చేస్తుంది. ఇవన్నీ కలిసి పేగుల్లో క్యాన్సర్‌ను ప్రోత్సహించే కణాలు రక్తప్రవాహంలో చేరకుండా అడ్డుకుంటాయి. ఇక నిత్య వ్యాయామం వల్ల కండరాలు, ఇతర శరీర అవయవాల్లో గ్లూకోజ్ అవసరం పెరుగుతుంది. దాంతో క్యాన్సర్ కణాలు వృద్ధి చెందడానికి తక్కువ ఆస్కారం ఉంటుంది.
వ్యాయామంతో ఇన్సులిన్ స్థాయులు కూడా నియంత్రణలో ఉంటాయి. శరీరంలో ఇన్సులిన్ ఎక్కువైతే.. పెద్దపేగు, రొమ్ము, ప్రొస్టేట్ క్యాన్సర్లకు కారణమవుతుందని పలు అధ్యయనాల్లో తేలింది. వ్యాయామం వల్ల రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది. క్యాన్సర్‌గా మారే కణాలను గుర్తించి.. నాశనం చేయడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా.. కీమోథెరపీ, మందుల వల్ల శరీరం బలహీనపడుతుంది.
నిత్యం వ్యాయామం చేయడం వల్ల శరీరం బలంగా తయారవుతుంది. ఇలా.. రోజూ ప్రణాళికాబద్ధమైన వ్యాయామం చేయడం వల్ల క్యాన్సర్ పునరావృతం కాకుండా ఉంటుందని అధ్యయనకారులు చెబుతున్నారు. ఇందుకోసం వారానికి కనీసం 150 నిమిషాలైనా వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. ఏరోబిక్స్, వాకింగ్, సైక్లింగ్ లాంటివి ఎంచుకోవచ్చని అంటున్నారు. ఇక కుటుంబంలో ఎవరికైనా పెద్దపేగు క్యాన్సర్ ఉన్నట్లయితే.. వారు మరిన్ని ముందుజాగ్రత్తలు తీసుకోవాలి. శరీరానికి తగినంత వ్యాయామం, శ్రమ ఉండేలా చూసుకోవాలి. మాంసం తినడం తగ్గించడంతోపాటు ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఏదైనా సమస్య ఉన్నట్టు గుర్తిస్తే.. ముందస్తు స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. దీనివల్ల రోగ నిర్ధారణకు ముందే.. నివారణ మొదలవుతుంది. క్యాన్సర్ నుంచి శరీరానికి తగిన రక్షణ లభిస్తుంది.