నాకు హైదరాబాదులో ఇంటర్మీడియెట్ సీటు వచ్చిందన్నప్పటి నుండీ.. ఇంట్లో సందడి మొదలైంది. సందడి కన్నా.. దిగులు ఎక్కువ. ఓ రెండ్రోజులు సంతోషంగా ఉన్నా.. అమ్మా నాన్నల్ని, నానమ్మని, ఇల్లునూ, పరిసరాలనూ వదిలి వెళ్లాలనేటప్పటికి ఎక్కడలేని బెంగ పట్టుకుంది.
నానమ్మ నాతో.. “ఇక్కడ దగ్గరగ హన్మకొండల్నన్న, జనగామలనన్న చదువుకోరాదా? నువ్వు పోతె ఇల్లంత చీకటి అయితది. మేము గుడ్డి దీపాలోలే ఎట్లుండాల్నే?” అన్నది. ఆ మాటల్లోని కవిత్వం నాకప్పుడు అర్థం కాలేదు కానీ, వేదన మాత్రం నా మనసును తాకింది. జనగామ అయితే ఆడపిల్లలకోసం ప్రత్యేకంగా కాలేజీ లేదు. మావాళ్లు అలా చేర్పించే ప్రసక్తే లేదు. ఇక హనుమకొండలో ఉన్న ఒకేఒక దగ్గరి బంధువు.. మా చిన్నాయన కూతురు లచ్చక్కే! ఆమె దగ్గర అప్పటికే అక్క ఉంది. మా ఇద్దరినీ విడిగా పెట్టేంత డబ్బూ, ధైర్యమూ, హంగూ.. మా అమ్మానాన్నలకు లేవు.
అమ్మకు చదువంటే చాలా ఇష్టం. నన్ను వదిలి ఉండలేకపోయినా ఆ దిగులును పైకి కనిపించనీయలేదు. నేను వెళ్లనంటానేమో!.. అనుకుని ఆ ప్రసక్తే మా మధ్య రాకుండా చూసింది. పైగా మంచి కాలేజీ అని కూడా కావచ్చు. అప్పటికి వారం రోజులుగా సమయం దొరికినప్పుడల్లా అమ్మ నాకు సుద్దులు చెబుతూనే ఉంది.
పెద్దవాళ్ల పట్ల మర్యాదగా ఉండాలనీ, వాళ్లు వస్తే లేచి నిలబడాలనీ, నమస్కారం చేయాలనీ, ఏ విషయంలోనూ ఎవరితోనూ వాదించవద్దనీ, వాళ్లు పెట్టేదాకా ఆకలి అవుతుందని అడగొద్దనీ, ఏది పెడితే అది తినాలనీ, ఎదుటి వాళ్ల వస్తువులు ముట్టుకోవద్దనీ, ఎంతో అవసరమైతే అడిగి వాళ్లిస్తేనే తీసుకోవాలనీ, గదుల్లోకి అడక్కుండా వెళ్లొద్దనీ, నేను వాళ్ల దగ్గర ఉండటం.. కేవలం వాళ్ల ఔదార్యమే తప్ప మన హక్కు కాదనీ, మరీ ముఖ్యంగా అడుగడుగునా చూడటానికి తను పక్కన ఉండదు గనుక.. నేను మర్యాదగా, విధేయతతో, సంస్కారంతో మెలగడం నా చేతుల్లోనే ఉంది గనుక.. ఎట్టి పరిస్థితుల్లోనూ తనకు మాట తెచ్చేలా ఉండొద్దనీ.. ఇలా చాలా చెప్పింది. ఇవన్నీ అక్కకు కూడా చెప్పిందా!? అని నాకు డౌట్ వచ్చింది.
నాన్న రోజొకసారైనా.. “బుజ్జీస్! నువ్వు కూడ పోతవా?” అనేవాడు. నాకు ఎంతో బాధ కలిగేది. కానీ, దాన్ని వ్యక్తపరచడం రాదు. “ఏం కాదులే నాన్నా! బాధపడకు” అని ఓదార్చడమూ రాదు. నా బట్టలూ, కావలసిన వస్తువులూ, కొన్ని పుస్తకాలూ సర్దుకున్నాను. మా ఇంట్లో మంచి బ్యాగులు కానీ, సూట్‌కేసులు కానీ లేవు.
మూడు సందుకలు, కొన్ని చేతి సంచులు తప్ప! మా అమ్మ ఎప్పుడో కొన్న బిస్తర్ (హోల్డాల్)లో పక్కబట్టలు, తొడుక్కునే బట్టలు సర్దుకున్నాను. నన్ను మొదటిసారి దింపడానికి నాన్నే వచ్చాడు. అమ్మ చేసిన పిండివంటలు ఓ పెద్ద సంచీలో సర్ది ఇచ్చింది. ఇల్లు వదిలి వస్తుంటే అమ్మ కళ్లనిండా నీళ్లు పొంగివచ్చాయి. నాకూ ఏడుపు ఆగలేదు. మొదటిసారిగా ఈ ఊర్లో ఎందుకున్నామా!? అనిపించింది. రైల్లో కూడా మాటిమాటికీ కళ్లు ఒత్తుకుంటూనే ఉన్నాను. నాన్న మౌనంగా ఉన్నాడు.
నారాయణగూడలోని దీపక్ మహల్ సినిమా టాకీసు ఎదురు సందులో.. ఇంకా చెప్పాలంటే కేశవ మెమోరియల్ స్కూల్ ఎదురుగా ఉండే సందులో నాయనమ్మ, చిన్నాయనలు ఉండే ఇంటికి వెళ్లాం. నాన్న ఎవరింటికైనా వెళ్లడం చాలా అరుదు. అందులోనూ అమ్మను మేనమామ వాళ్లే పెంచారు గనుక.. ఒకరకంగా ఆమెకు అది పుట్టిల్లు గనుక.. వాళ్లు నాన్నను అల్లుడిగానే చూసేవారు. ఆరోజు ఉండి, మర్నాడు ఉదయాన్నే నాన్న వెళ్లిపోయాడు. వెళ్లేముందు నా చేతికి నూటాయాభై రూపాయలిచ్చి.. “జాగ్రత్త! ఫుజూల్ ఖర్చులు పెట్టకు. ఫీజు కట్టి, పుస్తకాలు కొనుక్కో! మిగతావి దాచుకో!” అని చెప్పాడు. నాన్న వెళ్లేటప్పుడు మళ్లీ ఏడుపొచ్చింది, కానీ ఆపుకొన్నాను.
రెడ్డి కాలేజీ అంత గొప్పదని నాకు అందులో చేరేదాకా తెలియదు. ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ ఆలీ ఖాన్ వద్ద.. నిజాం ప్రభుత్వంలో కొత్వాలుగా పనిచేసిన మొదటి హిందూ వ్యక్తిగా, జంట నగరాల కోసం ఎన్నో మంచిపనులు చేసిన వాడిగా రాజా బహదూర్ వెంకట రామారెడ్డి ఆనాటి వారికి చిరపరిచితులు. కొత్వాలు అంటే పోలీస్ కమిషనర్ అట. ఆయన దూర ప్రాంతాల నుండి వచ్చే గ్రామీణ మగపిల్లల కోసం హైదరాబాదులో రెడ్డి హాస్టల్ ప్రారంభించి.. ఎందరో చదువుకునేలా చేశాడట.
ఆ తరువాతి రోజుల్లో ఆయన పేరుమీద రెడ్డి సొసైటీ వారు నారాయణగూడ, బర్కత్‌పురా మధ్యలో ఆడపిల్లల కోసం రాజా బహదూర్ వెంకట రామారెడ్డి ఉమెన్స్ కాలేజీనీ, దానికి అనుబంధంగా ఒక హాస్టల్‌నూ స్థాపించారు. అదే మా కాలేజీ. మా కాలేజీకి అప్పట్లో చాలా పేరుండేది. ఆ కాంపౌండ్ బయట మగపిల్లలు కాసేపు నిలబడ్డానికే భయపడేవారని అనేవారు.
అందులో చదివే ఆడపిల్లలు ఫైర్ బ్రాండ్స్‌గా ఉంటారని అనుకునేవారు. అప్పట్లో ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా మా కాలేజీతోపాటు రాంకోఠీలో ఎగ్జిబిషన్ సొసైటీ వారు నడిపే వనితా మహా విద్యాలయ, సుల్తాన్ బజార్ ఎదురుగా కోఠీ ఉమెన్స్ డిగ్రీ కాలేజీ, సికింద్రాబాద్‌లో కస్తూరిబా కాలేజీ ఉండేవి. మాడపాటి హనుమంతరావు స్కూలు అమ్మాయిలు.. ఎక్కువగా మా కాలేజీలోనే చేరేవారు. అలా.. హైదరాబాద్‌లో నా ఇంటర్ చదువు మొదలైంది.
నెల్లుట్ల రమాదేవి
రచయిత్రి