ట్రావెలర్లు, టూరిస్టులు మాత్రమేకాదు.. మన దేశంలో క్యాంపింగ్ చేసేవాళ్లూ పెరుగుతున్నారు. అడవి మధ్యలోనో.. పర్వతాల పాదాల దగ్గరో టెంటు వేసుకొని హాయిగా గడిపేస్తున్నారు. జీవితాన్ని మరో కోణంలో ఆస్వాదిస్తున్నారు. అయితే, కొత్తగా ఈ క్యాంపింగ్ చేసే వారిలో చాలామంది బాలారిష్టాలు పడుతుంటారు. క్యాంపింగ్ కోసం ఎలాంటి వస్తువులు తీసుకెళ్లాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. వారికోసం.. నిపుణులు కొన్ని సలహాలు-సూచనలు ఇస్తున్నారు. క్యాంపింగ్ సజావుగా సాగాలంటే.. కొన్ని ముఖ్యమైన వస్తువులు తప్పకుండా వెంట ఉండాలి. అప్పుడే మీ ప్రయాణం, బస సురక్షితంగా, సౌకర్యవంతంగా ముగుస్తాయి. ముఖ్యంగా ప్రకృతి ఒడిలో గడిపేటప్పుడు మీకు అవసరమయ్యే అత్యవసర క్యాంపింగ్ టూల్స్‌ను చూస్తే..
టెంట్, స్లీపింగ్ బ్యాగ్ క్యాంపింగ్‌లో తప్పకుండా ఉండాల్సిందే! ఎండ, వర్షం, చలి నుంచి రక్షించేలా.. అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకొనేలా మంచి నాణ్యమైన టెంట్‌ను ఎంచుకోండి. ఇక రాత్రిపూట పాములు, ఇతర విష పురుగులతో ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా, రాత్రిపూట చలి నుంచి రక్షణ పొందడానికి మన్నికైన ఓ స్లీపింగ్ బ్యాగ్ తీసుకెళ్లాల్సిందే!
ఇక క్యాంపింగ్‌లో మరో ముఖ్యమైన అంశం.. భోజనం. అక్కడే వండుకొని తినాలనుకుంటే.. ఓ పోర్టబుల్ స్టవ్‌ను వెంట తీసుకెళ్లొచ్చు. చిన్నపాటి గ్యాస్‌స్టవ్, క్యాంపింగ్ స్టవ్‌లు వంట చేసుకోవడానికి అనువుగా ఉంటాయి. వంటకోసం తేలికపాటి ప్లేట్లు, స్పూన్లు, చిన్నగిన్నెలు ఉంటే చాలు. ఇక కూరగాయలు కోయడానికి, బాటిల్స్ తెరవడానికి, చిన్న చిన్న పనులకు మల్టీ టూల్, స్విస్ నైఫ్ లాంటివి బాగా పనికొస్తాయి. నదుల్లో పారే నీటిని శుద్ధి చేసుకునేలా పోర్టబుల్ వాటర్ ఫిల్టర్స్ ఉంటాయి. వాటిని తీసుకెళ్తే.. తాగునీటికి ఇబ్బంది లేకుండా ఉంటుంది.
క్యాంపింగ్, ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు చిన్నచిన్న గాయాలు, కాళ్ల నొప్పులు రావడం సహజం. కాబట్టి, వెంట ఓ ఫస్ట్ ఎయిడ్ కిట్ తప్పకుండా ఉండాలి. ఎండ, దోమల నుంచి రక్షణ పొందడానికి.. సన్‌స్క్రీన్ లోషన్స్, మస్కిటో రిపెల్లెంట్ లాంటివి ఎంచుకోవచ్చు. వెలుగు కోసం మాత్రమే కాదు.. మీ భద్రతకు కూడా ఓ టార్చ్‌లైట్ వెంట ఉండటం చాలా కీలకం.
అడవి ప్రాంతాల్లో మొబైల్ సిగ్నల్స్ సరిగ్గా ఉండవు. కాబట్టి, అక్కడ ఆన్లైన్ మ్యాప్స్ పనిచేయవు. అందుకే, మీరు ఎక్కడ ఉన్నారో, ఎక్కడికి వెళ్లాలో తెలుసుకోవడానికి మ్యానువల్ మ్యాప్స్‌ను వెంట ఉంచుకోవాలి. ఇక మొబైల్ ఫోన్లు చార్జింగ్ చేసుకోవడానికి అధిక సామర్థ్యం ఉన్న పవర్ బ్యాంక్ కూడా అవసరమే!