Naya Trend | ఏనుగు ఏనుగు నల్లన్నా.. ఏనుగు వెంట్రుక ట్రెండన్నా.. అని పాడుతున్నారిప్పుడు. పాట మారింది ఎందుకన్నది పాఠంలోకి వెళితే మనకే తెలుస్తుంది. అదీ కాదంటే ఇక్కడున్న ఫొటోలను చూసినా సంగతేంటో అర్థం చేసుకోవచ్చు. అవును, ఇక్కడ కనిపిస్తున్నవన్నీ ఏనుగు వెంట్రుకలను వాడి చేసిన బంగారు నగలే. ఎలిఫెంట్ హెయిర్ జువెలరీ ఇప్పుడు నగల్లో నయా ట్రెండ్.
ఏనుగు బతికినా చచ్చినా గొప్పే అంటారు పెద్దలు. ఇప్పుడు ఏనుగే కాదు, దాని వెంట్రుకలు కూడా గొప్పే. కరిరాజు ఒంటి మీది నుంచి రాలిన శిరోజాన్ని, సారీ.. సారీ.. వాలోజాన్ని ఈ నగల తయారీలో ఉపయోగించారు. అదేమిటో అనుకోకండి.. ఇది గజరాజు శిరస్సున ఉన్న వెంట్రుక కాదు.. వాలము నుంచి రాలినది. ఏనుగు తోకలోని వెంట్రుకలు మందంగా పొడవుగా ఉంటాయి. గజరాజులు నడిచే దారుల్లో, నీళ్లు తాగే చోట్ల రాలిపోయి దొరుకుతాయి. లేదంటే, మావటి సాయంతో తోక నుంచి కత్తిరించి కూడా సేకరిస్తారు. మనిషి జుట్టుకన్నా ఎన్నో రెట్లు మందంగా ఉండే ఈ వెంట్రుకలను నీళ్లలో ఉడికించి శుభ్రపరిస్తే.. నగల డిజైన్లకు తగ్గట్టు ఎలా కావాలంటే అలా వంగుతాయి. నగల షాపుల్లో చూసే ఎలిఫెంట్ హెయిర్ రింగ్‌లో ఉండేది ఇవే అన్నమాట. అయితే, ఒక్క ఉంగరాలే కాదు, గొలుసులు, బ్రేస్లెట్లు, జుంకాలు, గాజులు… ఇలా అన్ని నగల్లోనూ ఇప్పుడు ఎలిఫెంట్ హెయిర్ రాజ్యమేలుతున్నది.
ఏనుగు వెంట్రుక చెడును పారదోలి శాంతిని, ప్రేమను, సంపదను, ఆరోగ్యాన్ని ఇస్తుందని ఓ నమ్మకం. నగల్లో ధరిస్తే చెడు దృష్టి సోకదని చెబుతారు. జపాన్, ఆఫ్రికా కథల్లో వీటి ప్రశస్తి మరింత కనిపిస్తుంది. అయితే, ఇవన్నీ నమ్మినా నమ్మక పోయినా వెరైటీ కోసం ఇష్టపడి ధరించే వాళ్లూ ఉంటారు. మన దగ్గర కూడా బ్రిటిష్‌కాలంలో అతిథులకు వీటిని బహుమతులుగా ఇచ్చేవారట. కాస్త ఖరీదు ఎక్కువే అయిన ఈ నగలు మరింత కాలం మన్నాలంటే మాత్రం ఏడాదికి రెండుమూడు సార్లు కాస్త ఆలివ్ నూనెతో తుడ వాల్సిందే. అదీ సంగతి. ఏనుగుకే కాదు, దాని వెంట్రుకలకూ కథలుంటాయి మరి!