మట్టి గణపతే కాదు.. చాక్లెట్ గణపతి, తమలపాకుల గణపతి, చిరుధాన్యాల గణపతి, వివిధ రకాల ఆకులతో తయారుచేసిన గణపతి.. ఇలా పర్యావరణ హితమైన గణపతి విగ్రహాలు చాలా ఉన్నాయి. పర్యావరణానికి ఎటువంటి హానీ కలిగించని విగ్రహాలివి. తాజాగా ప్రాధాన్యం సంతరించుకున్న విత్తన గణపతి మూర్తి ప్రకృతికి మరింత మేలు చేసేది. బంకమట్టితో తయారుచేసిన మట్టి వినాయకుడి విగ్రహంలో విత్తనాన్ని ఉంచుతారు. పూజలు అయిపోయిన తరువాత ..తొట్టిలో ఈ వినాయకుణ్ని నిమజ్జనం చేస్తే దానిలో ఉండే విత్తనం మొలకెత్తి చెట్టుగా మనకు పచ్చదనాన్ని అందిస్తుంది. విత్తన గణపతిని హైదరాబాద్లో దాదాపు 20కి పైగా సంస్థలు తయారుచేస్తున్నాయి. ఇందుకోసం వివిధ రకాల విత్త నాలను వాడుతున్నారు. ఎక్కువమంది కూరగాయల విత్తులు పొదిగిన మృణ్మయ మూర్తిని తయారు చేస్తున్నారు. ఈ గణపతి నిమజ్జనం తరువాత మనకు సేంద్రియ పద్ధతిలో కూరగాయల రూపంలో పోషకాహారాన్ని అందిస్తాడు. వేపలాంటి ఔషధ మొక్కల విత్తనాలతో కూడిన గణపతిని ఇంటి వాకిట్లో గానీ, ఖాళీ ప్రదేశంలో గానీ నిమజ్జనం చేస్తే ఆరోగ్యాన్ని వరంగా ప్రసాదిస్తాడు.