నేటితరంలో చాలామంది ముఖంపై ముడతలతో బాధపడుతున్నారు. ముప్పైలలోనే వయసుడిగిన వాళ్లలా కనిపిస్తున్నారు. బ్యూటీని కాపాడుకోవడానికి తెగ వర్రీ అయిపోతున్నారు. అయితే, జీవనశైలి లోపాలు, ఆహారపు అలవాట్లే ముఖంపై ముడతలకు కారణమని బ్యుటీషియన్లు చెబుతున్నారు. బ్లూ బెర్రీలను తీసుకుంటే.. అందాన్ని కాపాడుకోవచ్చని సలహా ఇస్తున్నారు.
చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంలో బ్లూ బెర్రీలు అద్భుతంగా పనిచేస్తాయి. ఇందులో ముఖ సౌందర్యానికి ఉపయోగపడే విటమిన్లు, ఫ్లేవనాయిడ్లు, యాంటి ఆక్సిడెంట్లు, పాలీఫినోల్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి చర్మాన్ని ఫ్రీరాడికల్స్ నుంచి రక్షించడంతోపాటు కొత్త చర్మ కణాలను ఉత్పత్తి చేయడంలో సాయపడతాయి. చిన్న వయసులోనే వృద్ధాప్య లక్షణాలు రాకుండా కాపాడుతాయి. బ్లూ బెర్రీలో ఉండే బయోయాక్టివ్ సమ్మేళనాలు.. పర్యావరణ కాలుష్యం వల్ల చర్మానికి ఎదురయ్యే హానికరమైన ప్రభావాలను తగ్గించడంలో సమర్థంగా పనిచేస్తాయి. ఇందులో పుష్కలంగా లభించే యాంటి ఆక్సిడెంట్లు.. అకాల వృద్ధాప్యానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరిస్తాయి.
ముడతలను తగ్గించడంలోనూ ముందుంటాయి. ఇక విటమిన్ సి, ఆంథోసైనిన్లు.. చర్మ కణాల నష్టాన్ని నివారిస్తాయి. విటమిన్ సి.. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. చర్మాన్ని బిగుతుగా, యవ్వనంగా ఉంచడానికి సాయపడుతుంది. బ్లూబెర్రీలలో దొరికే విటమిన్లు, ఖనిజాలు.. చర్మ కణాల మరమ్మతు, పునరుజ్జీవన ప్రక్రియను ప్రోత్సహిస్తాయి.