మారుతున్న ఆహారపు అలవాట్లు, అపసవ్యమైన జీవనశైలి.. కారణాలు ఏవైనా 40 ఏళ్లకే వృద్ధాప్య ఛాయలు కనిపిస్తున్నాయి. యవ్వనంలో ఉండగానే అనారోగ్య సమస్యలు పలకరిస్తున్నాయి. ముఖ్యంగా.. మహిళల్లో 40 ఏళ్ల తర్వాత సహజంగానే కొన్ని మార్పులు సంభవిస్తాయి. అవి.. వారి మానసిక, శారీరక ఆరోగ్యాన్నీ ప్రభావితం చేస్తాయి. అయితే, ముందునుంచే సరైన ప్రణాళికతో ఉంటే.. 50 దాటినా.. నలభైల్లో ఉన్నట్టుగానే కనిపించొచ్చు.
శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం మెదడు. ఇది ఆరోగ్యంగా ఉంటేనే.. మీరు చురుకుగా ఉంటారు. అందుకే, మెదడును ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా, వయసు మీద పడుతున్నకొద్దీ ఇబ్బంది పెట్టే అల్జీమర్స్ లాంటి సమస్యలు ఎదురుకాకుండా చూసుకోవాలి. ఇందుకోసం బెర్రీలను ఆశ్రయించాలి. ప్రతివారం కనీసం రెండు బెర్రీలను తిన్న మహిళల్లో.. జ్ఞాపకశక్తి క్షీణత తగ్గినట్టు హార్వర్డ్ బ్రిగ్హామ్ అండ్ ఉమెన్స్ హాస్పిటల్ పరిశోధకుల అధ్యయనంలో తేలింది.
మెదడు తర్వాతి స్థానం.. కాలేయానిదే! రక్తాన్ని శుద్ధి చేయడం దగ్గరి నుంచి.. ఆహారాన్ని జీర్ణం చేసే ఎంజైమ్స్ విడుదల వరకూ అనేక విధులు నిర్వహిస్తుంది. సాధారణంగా వయసు పెరిగేకొద్దీ కాలేయం పనితీరు నెమ్మదిస్తుంది. దీంతో వివిధ రకాల ఆరోగ్య సమస్యలు దాడిచేస్తాయి. అందుకే, కాలేయం ఆరోగ్యంపైనా శ్రద్ధ చూపాలి. ఇందుకోసం ఆల్కహాల్‌ను దూరంపెట్టాలి. జీవనశైలిలో మార్పులతోపాటు నిత్యం వ్యాయామం చేయాలి.
సర్వేంద్రియాణాం నయనం ప్రధానం! కానీ, వయసుతోపాటు కంటి చూపు కూడా మందగిస్తుంది. కాటరాక్ట్, మాలిక్యులర్ డిజెనరేషన్, గ్లకోమా లాంటి సమస్యలు చుట్టుముడతాయి. త్వరగా మేల్కోకుంటే.. చూపు మరింత మందగిస్తుంది. అందుకే, కంటి ఆరోగ్యాన్ని కాపాడుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. విటమిన్ ఎ అధికంగా లభించే క్యారెట్, పచ్చని ఆకుకూరలు, గుడ్డు, చిలగడదుంప, నారింజ వంటివి రెగ్యులర్‌గా తీసుకోవాలి. కనీసం ఏడాదికోసారైనా కంటి పరీక్షలు చేయించుకోవాలి.
పేగులు బాగుంటేనే.. తిన్న ఆహారం జీర్ణమవుతుంది. శరీరానికి శక్తి వస్తుంది. కాబట్టి, జీర్ణవ్యవస్థపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. పేగుల్లో ఉండే గట్ బ్యాక్టీరియా, సూక్ష్మజీవుల ఆరోగ్యాన్నీ కాపాడుకోవాలి. ఇందుకోసం ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. కూరగాయలు, చేపలు, మాంసం.. పొట్ట ఆరోగ్యానికి మేలు చేస్తాయని గుర్తుంచుకోవాలి.
నలభై దాటాక చాలామందిలో ఎముకల దృఢత్వం, సాంద్రత తగ్గుతుంది. బోలు ఎముకల వ్యాధి పలకరిస్తుంది. మోకాళ్లు, కీళ్లనొప్పులూ దాడిచేస్తాయి. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి, ఎముకలు బలంగా తయారవడానికి.. పాలు, పాల ఉత్పత్తులను రెగ్యులర్‌గా తీసుకోవాలి. జున్ను తినాలి.
ఇక యోగా, ధ్యానంతో రక్తపోటును అదుపులో పెట్టుకోవాలి. 40లోకి ఎంట్రీ ఇవ్వగానే జీవనశైలిలో ఇలాంటి మార్పులు చేసుకోవడం వల్ల.. ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండొచ్చు.