కాలం మారిపోయింది. జీవితాల్లో వేగం పెరిగింది. ఒకప్పటి పెద్దలతో పోలిస్తే ఇప్పటి తరం పిల్లలైనా, పెద్దలైనా ప్రాసెస్డ్ ఆహార పదార్థాలకు అలవాటు పడ్డారనే చెప్పాలి. అయితే, ప్రాసెస్డ్ పదార్థాలను తగ్గించుకోవడం ఆరోగ్యానికి మంచిది. ఇంటి దగ్గర వండుకోవడం, ముతక ధాన్యాలను ఎంచుకోవడం లాంటి మార్పులతో తాజాగా, పోషకాలతో సమృద్ధమైన ఆహారాన్ని ఆస్వాదించవచ్చు. ప్రాసెస్డ్ పదార్థాలను తప్పించుకోవడానికి చేసుకోవాల్సిన కొన్ని మార్పులు ఇవి…
ముతక ధాన్యాలతో ఇంటి దగ్గరే ఆహారం వండుకోవాలి. దీంతో ప్యాకేజ్డ్ ఆహారాలు, ఫాస్ట్ఫుడ్స్లో ఉండే ప్రిజర్వేటివ్‌లు, కృత్రిమమైన రుచి కారకాలు, అధిక సోడియం ముప్పును తప్పించుకోవచ్చు.
మార్కెట్లలో మీరు కొనే ఆహార పదార్థాల ప్యాక్‌లపై రాసి ఉండే వివరాలను చదవండి. యాడిటివ్స్, కృత్రిమ తీపి పదార్థాలు, మనం గుర్తించలేని రసాయనాలు ఏమైనా ఉన్నాయో చూడండి. ఒకవేళ ప్యాకేజ్డ్ ఆహారం తప్పదనుకుంటే సహజమైన పదార్థాలను వాడిన, తక్కువ ప్రాసెస్ చేసిన వాటినే ఎంచుకోండి.
సోడా, ఫ్లేవర్డ్ జ్యూస్‌లు, ఎనర్జీ డ్రింక్స్‌కు సాధ్యమైనంత వరకు దూరం ఉండాలి. నీళ్లు, హెర్బల్ టీలు, ఇంట్లో తయారుచేసుకున్న స్మూతీలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
బాగా మరపట్టిన బియ్యం, రిఫైన్డ్ పాస్తా, ప్రాసెస్డ్ ధాన్యాల కంటే బ్రౌన్ రైస్, క్వినోవా, హోల్ వీట్ బ్రెడ్, ఓట్స్‌కు వంటలో పెద్దపీట వేయాలి. వీటితో మనకు ఎక్కువ ఫైబర్, మరిన్ని పోషకాలు అందుతాయి.
చిప్స్, క్యాండీలు, ప్యాకేజ్డ్ స్నాక్స్ స్థానంలో తాజా పండ్లు, గింజలు, యోగర్ట్‌కు చోటివ్వాలి. ఇలా చేస్తే కృత్రిమ ఫ్లేవర్లు, అనారోగ్యకరమైన కొవ్వులు, అధిక ప్రిజర్వేటివ్‌ల బారిన పడకుండా తప్పించుకోవచ్చు.
చాలామంది పనుల హడావుడిలో పడి చివరి నిమిషం వరకు ఆగి, తర్వాత ప్రాసెస్డ్ ఆహారం తింటూ ఉంటారు. దీనికంటే ముందుగానే ఆరోగ్యకరమైన ఆహారం సిద్ధంగా ఉంచుకోవాలి.
వస్తువులు కొనేటప్పుడు మార్కెట్ మొత్తం తిరగండి. పండ్లు, కూరగాయలు సహా ఆహార పదార్థాలు ఏవైనా సరే ఎక్కువగా ప్రాసెస్ చేయనివే కొనండి.
ముందే ప్యాకై వచ్చిన సాస్‌లను పక్కనపెట్టండి. ఇంటి దగ్గరే తాజాగా ఉండే మూలికలు, మసాలా దినుసులతో సాస్‌లు చేసుకోండి.
అదనపు ప్రిజర్వేటివ్స్, అధిక సోడియం, కృత్రిమ యాడిటివ్స్, అనారోగ్యకరమైన ప్రిజర్వేటివ్స్ లేని తాజా, శీతలీకరించిన పండ్లు, కూరగాయలు ఎంచుకోవాలి.
తినేటప్పుడు శ్రద్ధగా ఉండాలి. దీంతో ఆరోగ్యకరమైన ఆహారాన్నే ఎంచుకుంటాం.