పెండ్లి వేడుక అంటే ప్రతిదీ ప్రత్యేకమే. అమ్మాయి, అబ్బాయి అలంకరణ నుంచి వేదిక, భోజనాల దాకా తమకంటూ ఓ స్పెషాలిటీ ఉండాలని భావిస్తారు పెండ్లివారు. ఆ సంబురాలు అంబరాన్నంటేలా రకరకాల తారాజువ్వలూ పేలుస్తుంటారు. కానీ ఇప్పుడు నింగిలో జరిగే వేడుకకు కొత్త రూపు వచ్చి చేరింది. డ్రోన్ లైట్ షోలు పెండ్లి సందడిలో భాగమవుతున్నాయి. అందమైన ప్రేమ గుర్తుల్ని ఆకాశంలో ఆవిష్కరించడమే కాదు, వధూవరుల ప్రేమ ముచ్చట్లనూ నీలాకాశంలో ఆవిష్కరిస్తున్నాయి.
పెండ్లిఅంటే నింగీ నేలను ఏకం చేస్తాం! ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగు… అన్నట్టు వివాహ వేడుకకు ఎనలేని ఘనతను ఆపాదిస్తాం. నిండు నూరేళ్లూ కలిసుండే జంటకు మెండైన మెచ్చుకోలును అందిస్తాం. ఆ వేడుకలో అడుగడుకూ అద్వితీయంగా ఉండేలా చూసుకుంటాం. అందుకే ఆ సంబురాల్లో అరుదైన సంగతి ఒక్కటైనా ఉండాలని ఆరాటపడతాం. ఇప్పటి పెండ్లి వేడుకలో అలాంటి హైలైట్ పాయింట్‌గా డ్రోన్ లైట్ షోలు సరికొత్తగా వచ్చి చేరాయి. గాల్లో ఎగిరే డ్రోన్లకు రంగురంగుల లైట్లను ఏర్పాటు చేసి వాటిని క్రమ పద్ధతిలో అమరేలా చేయడం ద్వారా ఆకాశంలో రకరకాల చిత్రాలను ఆవిష్కరించడం ఇందులోని విషయం. పైన డ్రోన్‌షో జరుగుతుంటే పక్కన చక్కటి మ్యూజిక్, ఉత్సాహపరిచే మాటలు దానికి జతవుతాయి. ఈ షోలను మన దేశంలో వివిధ డ్రోన్ టెక్నాలజీ సంస్థలు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి.
ప్రేమ కథలు
నింగిలో ఎగిరే ఈ మోటార్ పక్షులు వధూవరుల ప్రేమకథలను కువకువలుగా వినిపిస్తాయి. పెండ్లి వేడుకలో ఒకచోట డ్రోన్లని ఉంచి కంప్యూటర్ సాయంతో వాటిని గాల్లోకి ఎగిరేలా చేస్తారు. ఇలా లేచిన డ్రోన్లు హృదయం, నక్షత్రం, పెండ్లి ఉంగరాలు, పేర్లు.. ఇలా రకరకాల చిత్రాలను ఆకాశంలో ఆవిష్కరిస్తాయి. అంతేకాదు.. అబ్బాయి, అమ్మాయి పరిచయాలు, వాళ్ల జీవితంలోని ప్రధాన ఘట్టాలను కూడా బొమ్మల రూపంలో చూపిస్తాయి. ఇలా డ్రోన్ల వెలుగుల్లో తమ ప్రేమకథను ఆకాశంలో చూసుకుని మురిసిపోతున్నాయట ప్రేమించి పెండ్లి చేసుకున్న జంటలు. అయితే ఇక్కడ చిత్రాలు టూడీలో కనిపిస్తాయా, త్రీడీలో కనిపిస్తాయా అన్నది ఎన్ని డ్రోన్లు వాడుతున్నారు అన్నదాన్ని బట్టి ఉంటుంది. ఎంత ఎక్కువ డ్రోన్లు వాడితే చిత్రం అంత బాగా వస్తుందన్నమాట! వంద, రెండు వందలు మొదలు వేల డ్రోన్లు వాడేదాకా ఆప్షన్లు ఉంటున్నాయి. డ్రోన్ షో ఖరీదు కూడా వీటి సంఖ్య, షో సమయం, దాన్ని ఎక్కడ ఏర్పాటు చేశామన్న వాటి మీద ఆధారపడుతుంది. అంబరంలో జరిగే ఈ సంబురాన్ని దాదాపు అయిదు కిలోమీటర్ల దూరం నుంచీ చూడొచ్చు. అంటే, ఇది పెండ్లి జంటకే కాదు… వచ్చిన వారికి కూడా కన్నుల పంట అన్నమాట!