కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి మేలని అందరికీ తెలిసిందే. ఎవరికైనా చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా… కొబ్బరి నీళ్లు తాగమని సలహా ఇస్తుంటారు. రోగాలతో ఉన్నవాళ్లకే కాదు ఆరోగ్యంగా ఉన్నవాళ్లకూ ఇందులో ఉండే పోషకాలు అవసరమే. అయితే, అధికంగా పోషకాలు ఉండే కొబ్బరి నీళ్లను ఎన్ని తాగాలి? ఎన్నిసార్లు తాగాలో అవగాహన తక్కువే! పరిమితిని మించితే ఔషధం కూడా వికటిస్తుంది. ఎక్కువ మోతాదులో లవణాలు ఉండే కొబ్బరి నీళ్లను పరిమితంగా తాగడమే మేలని చెబుతున్నారు నిపుణులు. కొందరైతే.. కొబ్బరినీళ్లు లీటర్ బాటిల్ కొని గటగటా తాగేస్తుంటారు. ఇంకొందరు రెండుసార్లు విరామం ఇస్తూ లీటర్ పట్టిస్తారు.
అన్నేసి కొబ్బరినీళ్లు తాగితే.. కిడ్నీలు, ఇతర అవయవాలపై భారం పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఒకసారి 150-200 మిల్లీలీటర్లు తాగితే సరిపోతుందని సలహా ఇస్తున్నారు. ఆరోగ్యవంతులు వారంలో మూడు నుంచి నాలుగుసార్లు కొబ్బరినీళ్లు తాగొచ్చు. అది కూడా ఉదయం, సాయంత్రాల్లో శారీరక శ్రమ చేసిన తర్వాత లేదా వ్యాయామం ముగించిన తర్వాత కొబ్బరి నీళ్లు తాగడం మేలు! కొబ్బరి నీళ్లలో ఉండే పొటాషియం రక్తపీడనాన్ని నియంత్రణలో ఉంచుతుంది. శరీరానికి కావాల్సిన గ్లూకోజ్‌ను వేగంగా అందిస్తుంది. కాళ్ల తిమ్మిర్లు తగ్గిస్తుంది.