ప్రకృతి ఒడిలో కథలను రాసుకున్న ఆ యువకుడు… సంక్షేమ పథకాలపై పోలీసుల కర్తవ్యాన్ని గుర్తు చేసిండు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తన భుజం తట్టిన సందర్భాన్ని సార్థకం చేసుకోవాలని ఉన్నత చదువులు చదివినా కెమెరా, యాక్షన్ అంటూ సినిమా బాట పట్టిండు. తాను తీసిన సినిమాలు అనుకున్నంత స్థాయిలో ఆడకున్నా ప్రయత్నాన్ని మాత్రం వదలలేదు. తాజాగా వినూత్నంగా ‘అరేయ్! ఆపండ్రా’ అంటూ సందడి చేశాడు దర్శకుడు తల్లాడ సాయికృష్ణ. జనాలు థియేటర్‌కు రావాలనే ఆలోచనతో మేలైన ఆఫర్లు పెట్టి మరీ తన సినిమా చూపించిన ఈ యువ డైరెక్టర్ బతుకమ్మతో పంచుకున్న సినీ ముచ్చట్లు తన మాటల్లోనే…

మహబూబాబాద్ జిల్లాలోని దంతాలపల్లి మండలంలో ఉన్న రామవరం గ్రామం మాది. పదోతరగతి వరకు ఊర్లోనే చదువుకున్న నేను ఖమ్మంలో బీటెక్ పూర్తిచేశాను. నాన్న ఊర్లోనే కిరాణాకొట్టు నడిపిస్తున్నాడు. అమ్మ గృహిణి. వాళ్లకు ఓపిక మరీ ఎక్కువ. విభిన్న స్వభావం కలిగిన మనుషులతో నిత్యం మాట్లాడటం వల్ల ఆ కళ అబ్బిందేమో! నాకూ ఓపిక ఎక్కువే! చిన్నప్పుడు సైకిల్‌మీద బడికి వెళ్తున్న క్రమంలో ఊర్లో వృత్తికులాల వాళ్లు కనిపించేవారు. వాళ్లందరి శ్రమను వివరిస్తూ కథలు రాసుకునేవాణ్ని. మరోవైపు సినిమాలన్నా ఆసక్తే!
పదో తరగతి కాగానే.. దర్శకుడు కోడి రామకృష్ణ డైరెక్షన్లో శిక్షణ ఇస్తున్నారని తెలిసి.. మూడు నెలల పాటు వైజాగ్ వెళ్లి మరీ ట్రైనింగ్ తీసుకున్నాను. చదువుకుంటేనే విలువ ఉంటుందని ఇంట్లో వాళ్లు చెప్పడంతో ఇంటర్లో చేరాను. తర్వాత బీటెక్‌లో చేరాను. కాలేజీ కల్చరల్ ప్రోగ్రామ్స్‌కి షార్ట్‌ఫిల్మ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు నోటీస్ బోర్డులో పెట్టారు. నా ప్యాషన్‌ను గుర్తు చేసిన ప్రకటన అది. అప్పటికే పీకల్లోతు సినిమా పిచ్చితో ఉన్న నాకు అవకాశం దొరికింది. అలా బీటెక్ పూర్తయ్యేలోపు 40 షార్ట్ఫీల్మ్లు తీసి విడుదల చేశాను.

భుజం తట్టారు
బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా షార్ట్‌ఫిల్మ్ పోటీలు నిర్వహించారు. నేను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను పోలీసులు అమలు చేయిస్తే ఎలాంటి మార్పులు వస్తాయనే కాన్సెప్ట్‌తో షార్ట్‌ఫిల్మ్ తీశాను. ఈ పోటీలో నేను మూడోస్థానంలో నిలిచాను. అవార్డు అందుకునే రోజు పోలీస్ వాహనంలో హైదరాబాద్‌కు వెళ్లాను. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా బహుమతి అందుకున్నాను.
ఆ ఉత్సాహంతో ఇక సినిమాల్లో అదృష్టం పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నాను ఇంట్లో వాళ్లు వద్దన్నా.. తర్వాత నా మీద నమ్మకంతో నా పేరు మీద వేసిన పిక్స్డ్ డిపాజిట్ రూ.40 లక్షలు సినిమా కోసం ఇచ్చారు. 2016లో ‘ఎందరో మహానుభావులు’ సినిమా షూటింగ్ ఖమ్మంలోనే ప్రారంభించాను. గోవాలో తక్కువ ఖర్చుతో షూటింగ్ పూర్తి చేయొచ్చని కొంతమంది చెప్పిన మాటలు నమ్మి సినిమా పూర్తి కాకుండానే రూ.40 లక్షలు నష్టపోయాను. హైదరాబాద్‌కు తిరిగొచ్చాక అప్పులు చేసి ఆ సినిమా పూర్తి చేశాను. 2018లో 70 థియేటర్లలో దాన్ని విడుదల చేశాను. ఆశించిన విజయం సాధించలేదు.
నాలుగు లక్షలతో..
మొదటి సినిమానే ఫ్లాప్ కావడంతో రెండు నెలలు తీవ్రమైన మానసిక క్షోభను అనుభవించాను. నాన్న తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలని బాధపడ్డాను. చుట్టుపక్కల వాళ్లు ఎగతాళిగా మాట్లాడారు. అయినా భరించి అమ్మానాన్నలకు నన్ను నేను నిరూపించుకుంటానని చెప్పి ఒక రెండు సంవత్సరాలు స్క్రిప్ట్ వర్క్మీద లీనమయ్యాను. ఆ తరువాత రూ.4 లక్షలతో సినిమా తీస్తే ఎలాంటి స్పందన వస్తుందనే ఓ ప్రయోగం చేశాను. ఆ సినిమా 20 థియేటర్లలో ఆడింది.
ఆదాయం రాకున్నా లాస్ మాత్రం కాలేదు. కాస్త పుంజుకుంటున్న సమయంలోనే కరోనా కాలం వచ్చింది. ఇంటికే పరిమితమయ్యాను. ఆ సమయంలోనే ఓ వినూత్న ఆలోచనతో మా ఇంట్లో వాళ్లతో కలిసి ‘నమస్తే సేట్జీ’ సినిమా తీశాను. ఆ సినిమా స్థానిక థియేటర్లలో ఆడి మంచి స్పందన వచ్చింది. అదే సమయంలో కరోనాలో రైతన్నలు పడే కష్టాలను తెలిపే ‘మనోగతం’ సినిమా తీశాను. ఆ సినిమాకు జాతీయ స్థాయి పురస్కారం అందుకున్నాను. ఆ తరువాత కష్టమైనా నష్టమైనా సినీ ఇండస్ట్రీలోనే నిలబడాలని నిర్ణయించుకొని హైదరాబాద్‌కు మకాం మార్చాను. నా మీద నమ్మకంతో తనికెళ్లభరణి గారు సహకారం అందించారు.

పూరి సినిమా ప్రొడ్యూస్ చేయాలని..
నేను ఇప్పటివరకు 7 సినిమాలకు దర్శకత్వం వహించాను. అందులో ఆరు సినిమాల్లో నటించాను కూడా. దాంతోపాటు ప్రతి సినిమాకు నేనే ప్రొడ్యూసర్‌గా వ్యవహరించాను. పాత సినిమాలకు రిటర్న్స్ రాలేదు కానీ, గత మూడు సినిమాలకు ఆశించిన ఫలితాలే వచ్చాయి. నేను చేసిన తప్పును బేషరతుగా ఒప్పుకొంటాను. ఈ విషయంలో ఆర్జీవీ, పూరి నాకు ఆదర్శం. హిట్ అయినా ఫ్లాప్ అయినా వాళ్లు సినిమాలు తీస్తూనే ఉంటారు. ఎప్పటికైనా మంచి సక్సెస్‌ను ఇస్తాననే నమ్మకంతోనే ముందుకు సాగుతున్నాను. పూరి జగన్నాథ్ తీసే ఒక్క సినిమానైనా ప్రొడ్యూస్ చేయాలన్నదే నా కోరిక.
‘అరేయ్ ఆపండ్రా’ సినిమా వాస్తవానికి 2015లోనే 40శాతం షూటింగ్ పూర్తి చేశాం. కానీ అనుకొని కారణాల వల్ల మధ్యలోనే నిలిపేశాం. కానీ ఆ కథలో మంచి ఫీల్ ఉండటం వల్ల మళ్లీ ఇన్ని రోజులకు ఆ సినిమాను పూర్తి చేసి విడుదల చేశాం. మొత్తం 38 థియేటర్లలో విడుదలైంది. వారం రోజులపాటు హౌస్‌ఫుల్ అయ్యాయి. ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించాలనే ఆలోచనతో టికెట్ ధరలు తగ్గించాం.
…? రాజు పిల్లనగోయిన
