డిజిటల్ కంటి ఒత్తిడి.. ఆధునిక ఆరోగ్య సంక్షోభంగా మారుతున్నది. రోజుకు ఒక గంటసేపు స్మార్ట్‌ఫోన్‌తో గడిపినా.. ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నది. మానసిక, శారీరక ఇబ్బందులను కలిగిస్తున్నది. ‘జర్నల్ ఆఫ్ ఐ మూమెంట్ రీసెర్చ్’లో ప్రచురితమైన తాజా అధ్యయనం.. ఈ విషయాన్ని వెల్లడించింది. రీల్స్ చూడటం, ఈ బుక్స్ చదవడం లాంటివి.. తీవ్రమైన కంటి అలసట, ఆందోళనతోపాటు నిద్ర సమస్యలనూ కలిగిస్తున్నట్లు తేల్చింది.
భారతీయ యువతలో స్మార్ట్‌ఫోన్ వాడకం, కంటి సమస్యలపై ఈ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా రోజుకు కనీసం గంటసేపు స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తున్న వారి హెల్త్ డేటాను పరిశీలించారు. స్మార్ట్‌ఫోన్‌లో ఈ-బుక్ రీడింగ్, వీడియోలు చూడటం, సోషల్ మీడియా రీల్స్ (చిన్న వీడియోలు) ఉపయోగించడం లాంటి కార్యకలాపాలను రికార్డ్ చేశారు. ఈ సర్వేలో పాల్గొన్నవారిలో 60 శాతం మంది స్మార్ట్‌ఫోన్‌ను ఎక్కువసేపు ఉపయోగించిన తర్వాత తీవ్రమైన అసౌకర్యాన్ని అనుభవించినట్లు చెప్పారు. కంటి అలసట, మెడ నొప్పి, చెయ్యి లాగడం లాంటి లక్షణాలు ఉన్నట్లు వెల్లడించారు.
83 శాతం మందిలో ఆందోళన, నిద్రాభంగం, మానసిక అలసట వంటి రుగ్మతలను ఎదుర్కొంటున్నట్లు చెప్పుకొచ్చారు. ఇందుకు గల కారణాలను అధ్యయనకారులు వివరిస్తూ.. సోషల్ మీడియా రీల్స్ స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ వైవిధ్యాలను పెంచుతాయని అంటున్నారు. వీడియోలకు తగ్గట్టుగా స్క్రీన్ బ్రైట్నెస్ పెరగడం, తగ్గడం జరుగుతుంది. ఇక ఈ బుక్స్‌లో చిన్నచిన్న అక్షరాలను చదవడం.. కళ్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇలాంటి మార్పుల కారణంగా కనుపాప తీవ్రంగా ప్రభావితం అవుతుంది. ఇక ఒకేసారి 20 నిమిషాలకు మించి స్మార్ట్‌ఫోన్ వాడితే.. శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
డిజిటల్ పరికరాలు విడుదల చేసే నీలికాంతికి ఎక్కువసేపు గురికావడం వల్ల కంటి అలసట, నిద్ర రుగ్మతలు, దృశ్య సంబంధిత సమస్యలు వస్తాయని సర్వే ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు. డిజిటల్ పరికరాలపై గడిపే సమయం మాత్రమే కాకుండా.. ఉపయోగిస్తున్న కంటెంట్ కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. ఈ క్రమంలో స్మార్ట్‌ఫోన్ వినియోగంపై నియంత్రణ ఉండాలని సూచిస్తున్నారు.