Artificial Intelligence | ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) హవా కొనసాగుతున్నది! పిల్లల పెంపకం నుంచి వృద్ధాప్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల వరకూ ప్రతి విషయంలోనూ ఏఐ సూచనలను తెగ పాటించేస్తున్నారంతా!! అలాంటిది మరి నగల డిజైన్లలోనూ ఆ మార్కు లేకపోతే ఎలా? అందుకే కృత్రిమ మేధను ఉపయోగించి మగువల మనసు దోచే ఆభరణాలను రూపొందిస్తున్నారు తయారీదారులు. ఏఐ చెక్కిన ఈ నగలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. సంప్రదాయం, ఆధునికతల కలబోతగా తయారైన నయా నగల విశేషాలే ఇవి..
దుస్తుల్లోనే కాదు జువెలరీ ట్రెండ్‌ను అనుసరించడంలోనూ ఫ్యాషన్ ఫాలో అవుతున్నారు ఆధునిక అతివలు. అందుకే తయారీదారులు కూడా ఎప్పటికప్పుడు నయా డిజైన్లలో నగలను తీసుకొస్తున్నారు. మగువల మనసు దోచే డిజైన్లను రూపొందించేందుకు ఏఐ సాయాన్ని కూడా తీసుకుంటున్నారు. పాత నగలకు కొత్త హంగులు అద్ది ఆకట్టుకుంటున్నారు. ప్రాచీన పద్ధతులు, వంటలకు ప్రాధాన్యం ఉన్నట్టే.. సంప్రదాయ ఆభరణాలకు ఆదరణ ఎన్నటికీ తరిగిపోదు. మానవ సృజనతో పురుడు పోసుకున్న అలనాటి డిజైన్లకు కృత్రిమ మేధతో సరికొత్త మెరుపులు అద్దుతున్నారు.
అంతేకాదు, ఏఐ సాయంతో మనకు కావాల్సిన డిజైన్‌ను మనమే రూపొందించుకునే వెసులుబాటు కూడా ఉంది. ఆభరణాలు తయారుచేసిన తర్వాత చెప్పిన విధంగా రాలేదని చింతించే పని లేదు. ముందుగానే త్రీడీ ఆర్ట్‌లో ఆభరణాల నగిషీలను తయారు చేస్తారు. కావాలంటే వాటిలో డిజైన్లు మార్చుకోవడమో, అవసరమైన చోట రాళ్లు, పూసలు చేర్చుకోవడమో చేయొచ్చు. నచ్చిన డిజైన్‌లో నగ వచ్చిందని రూఢి చేసుకున్నాకే తయారీకి పంపించొచ్చు. ఇతర రకాల నగల మాదిరిగానే ఈ ఏఐ నగల్లోనూ మ్యాచింగ్ సెట్స్ అందుబాటులో ఉన్నాయి. పాపిట బిళ్ల నుంచి కాలి పట్టీల వరకు ఒకే థీమ్‌తో అందమైన డిజైన్లలో ఆభరణాలు ఆర్డర్ చేయొచ్చు.
బంగారం, వెండి, ప్లాటినమ్ వంటి లోహాలతోనే కాదు అందరికీ అందుబాటులో ఉండే వన్‌గ్రామ్ గోల్డ్, ఇమిటేషన్ జువెలరీలోనూ ఏఐ డిజైన్లను ఉపయోగించవచ్చు. ఆభరణాల కోసం ఎక్కువ మొత్తంలో వెచ్చించలేని వాళ్లు కూడా ఈ ఏఐ నగలను అందంగా అలంకరించుకోవచ్చు. ముఖ్యంగా ఈతరం పెండ్లిళ్లలో ఈ ఏఐ నగలకు ఎనలేని ఆదరణ లభిస్తున్నది. మరెందుకు ఆలస్యం.. మీరు కూడా మనసులోని డిజైన్లను ఏఐ సాయంతో అందమైన నగలుగా మలుచుకుని అలంకరించుకోండి!