High Uric Acid levels | మనం తీసుకునే ఆహారాల్లో ప్యూరిన్ అధికంగా ఉండటం వల్ల శరీరంలో యూరిక్ ఆసిడ్ తయారవుతుంది. శరీరంలో పేరుకుపోయే యూరిక్ ఆసిడ్‌ను మూత్రపిండాలు బయటకు పంపిస్తాయి. అయితే, కిడ్నీల్లో వివిధ సమస్యల కారణంగా యూరిక్ ఆసిడ్ శరీరంలోనే పేరుకుపోతుంది. ఫలితంగా కీళ్ల నొప్పులు, వాపు, కదలికల్లో ఇబ్బందులు, కీళ్ల ఆకృతిలో మార్పు వంటి వాటికి దారితీస్తుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే జీవనశైలిలో మార్పులు చేసుకోవడం అవసరం. ప్యూరిన్ తక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం ద్వారా శరీరంలో యూరిక్ ఆసిడ్ అధిక మోతాదులో పేరుకుపోకుండా చూసుకోవచ్చు.
యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగడానికి దారితీసే ఆహార పదార్థం.. ఫ్రక్టోజ్. ఇది వివిధ పండ్లు, కూరగాయల్లో కనిపించే సహజమైన చక్కెర. అందుకని యూరిక్ ఆసిడ్ సమస్యతో బాధపడుతున్న వారు వీటిని తినకుండా చూసుకోవాలి. శరీరంలో యూరిక్ ఆసిడ్ అధిక స్థాయిల్లో పేరుకుపోయిన సందర్బాల్లో ఆపిల్, ఖర్జూరాలు, చింతపండు గుజ్జు, చికూ, గోల్డెన్ రైసిన్‌లను దూరం పెట్టాలి.
యూరిక్ ఆసిడ్ అధిక మొత్తంలో తయారయ్యేందుకు సహాయపడే ప్యూరిన్ అధికంగా ఉండే ఆహారాలైన సార్డినెస్, డ్రై బీన్స్, బీఫ్, పంది మాంసం, టర్కీ, ఫిష్, షెల్ఫిష్, స్కాలోప్స్, మటన్, పుట్టగొడుగులు, కాలీఫ్లవర్, ఆల్కహాల్ మొదలైనవి తినకుండా చూసుకోవాలి.
తోటకూర, బచ్చలికూర, బటానీలతో తయారుచేసే కూరల్లో ఎక్కువగా ప్యూరిన్స్ ఉండే అవకాశం ఉంటున్నందున వీటిని తినొద్దు.
యూరిక్ ఆసిడ్ ఉన్న రోగులు ప్రోటీన్ ఆహారానికి దూరంగా ఉండాలి. ఆల్కహాల్‌ను మానేయాలి.
ఫైబర్ అధికంగా ఉండే కూరగాయలు యూరిక్ ఆసిడ్‌ను నియంత్రిస్తాయి. అందుకని వాటిని ఎక్కువగా తినాలి. అదేవిధంగా చెర్రీలు, కాఫీ తీసుకోవడం వల్ల యూరిక్ ఆసిడ్‌ను స్థాయిలను తగ్గించుకోవచ్చు.
బీట్రూట్ రసం, ఆరెంజ్ జ్యూస్ వంటివి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల యూరిక్ ఆసిడ్ నియంత్రణలో ఉంటుంది. ఎక్కువ నీరు తాగడం వల్ల యూరిక్ ఆసిడ్ మూత్రం ద్వారా బయటకు వస్తుంది.
ఒత్తిడిని తగ్గించుకోవాలి. శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి. ఇన్సులిన్ స్థాయిలను పెరుగకుండా చూడాలి.
శరీరం బరువు పెరుగకుండా నియంత్రించేందుకు ప్రయత్నించాలి.