ప్రాణం పోసిన తల్లిదండ్రులను పాణంగా చూసుకోవాలని మేనేజర్ ఉద్యోగాన్ని వదిలి ఊరికి వచ్చాడు. పాణాలను హరించే తిండి కాదు, ఆయువు పోసే ఆహారం అందరికీ అందివ్వాలని రైతుగా మారాడు. రైతు ప్రాణం విత్తనంలోనే ఉందనీ, దాన్ని కాపాడుకునేందుకు దేశమంతాతిరిగాడు. దేశీ పంటల విత్తనం చచ్చిపోకుండా విత్తన సేద్యం చేశాడు.వేల రకాల వంగడాలను ప్రాణంలా కాపాడుకుంటున్న దార్లపూడి రవి విత్తులోనే.. రైతులు,భావితరాల భవిష్యత్తు ఉందంటున్నాడు!
నేను ఎన్విరాన్మెంటల్ సైన్స్‌లో పీజీ చదివాను. మట్టపల్లి (సూర్యాపేట జిల్లా) దగ్గర ఉన్న నాగార్జున సిమెంట్స్‌లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌గా ఉద్యోగం చేశాను. మా తమ్ముడు బెంగళూరులో, చెల్లెలు ఉద్యోగం చేస్తున్నారు. వృద్ధాప్యంలో ఉన్న మా అమ్మానాన్నలను చూసుకోవాలనుకున్నా! అలాగే నాకిష్టమైన వ్యవసాయం చేయాలని ఉద్యోగానికి రాజీనామా చేశాను. మా ఊరు ఉంగరాడ (విజయనగరం)లో మాకు రెండు ఎకరాల ఇరవై సెంట్ల భూమి ఉంది. అది కొండవాలు కింది పొలం. అందులో వర్షాధార పంటలే పండుతాయి. ఒక ఎకరా యాభై సెంట్లలో నాన్న మామిడి తోట పెట్టించారు. చెట్టుకు చెట్టకు మధ్య 30 అడుగుల దూరం ఉంది. కాబట్టి అంతర పంటలు సాగు చేసే అవకాశం ఉంది. అందులో పెసలు, ఉలవలు, నువ్వులు పండించాను.
ఇదిలా ఉండగా పెండ్లిళ్లు, ఇతర వేడుకలకు వెళ్లినప్పుడు కొంతమంది గ్యాస్ట్రిక్ అల్సర్, అజీర్తి, పైల్స్, బీపీ, ఏదో ఒక రోగం పేరు చెబుతూ తిండి తగ్గించడం చూశాను. జిహ్వ చాపల్యం కొద్దీ తిన్నా.. ఇంటికి పోయి మాత్ర వేసుకుంటున్నారు. వాళ్ల సమస్యలకు కారణం రసాయనాలతో పండించిన వ్యవసాయ ఉత్పత్తులే! ఈ దుస్థితి పోవాలంటే మళ్లీ తాతల కాలంనాటి సేంద్రియ వ్యవసాయం అవసరమనుకున్నాను. రసాయన అవశేషాలు లేని కాయగూరలు, ధాన్యం పండించాలనుకున్నాను. ఇంటి పనులు, వ్యవసాయ పనులు చేసుకుంటూనే నా స్నేహితుడు నడిపే వ్యవసాయ సంబంధిత ఎన్జీవోలో చేరాను. రైతులతో కలిసి పయనించాను.
పాలేకర్ బాటలో…
మాది వ్యవసాయ కుటుంబమే అయినా సాగు గురించి పూర్తి అవగాహన లేదు. మంచి ఆహార పంటలు పండించడం కోసం సేంద్రియ వ్యవసాయం గురించి తెలుసుకోవాలనుకున్నాను. రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో కాకినాడలో జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ శిక్షణ ఇచ్చారు. అక్కడ సుస్థిర వ్యవసాయ ఉద్యమకారుడు సుభాష్ పాలేకర్ సేంద్రియ సాగు పద్ధతులను వివరించారు. సేంద్రియ సేద్యం వల్ల కలిగే ప్రయోజనాల గురించి చెప్పారు. సేంద్రియ రైతుల అనుభవాలు విన్నా. పాలేకర్ నిర్వహించే అనేక శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొన్నాను. అనేక ప్రాంతాలు తిరిగాను. రైతులతో మాట్లాడాను. వాళ్ల సాగు పద్ధతులు నేర్చుకున్నాను.
Seed Preservation Darlapudi
కొండపొలం
కొండవాలులో మాది మొదటి పొలం. కాబట్టి సేంద్రియ వ్యవసాయానికి అనువైనది. చుట్టూ జీవ వైవిధ్యం ఉంది. ఆ భూమిలో సేంద్రియ సాగు మొదలుపెట్టాను. ఎనభై సెంట్లలో వరి నాటాను. మామిడి తోటలో అంతర పంటగా పసుపు పెట్టాను. 30 సెంట్ల భూమిలో 30 కిలోల కస్తూరి పసుపు విత్తనం పెడితే మూడు వందల కేజీలు పండింది. ఎండబెడితే 160 కేజీల పసుపు వచ్చింది. పెద్ద కష్టం లేకుండానే పెట్టుబడి కంటే అనేక రెట్లు ఆదాయం వచ్చింది. నాగలితో దున్ని కొర్రలు వేశాను. మంచి దిగుబడి వచ్చింది. ఈ నేలను సారవంతం చేస్తే రకరకాల పంటలు సాగు చేసుకోవచ్చని అర్థమైంది. మట్టిలో సూక్ష్మ జీవులు పెరిగేలా జీవామృతం పోశాను. సేంద్రియ సేద్యంలోకి పూర్తిగా దిగాను. అయిదేండ్ల క్రితం రెండు ఎకరాలు లీజుకి తీసుకున్నాను. అప్పటి నుంచి మూడు ఎకరాల్లో వరి, మరో అరెకరంలో కూరగాయలు సాగు చేస్తున్నాను.
ఏడేండ్ల కిందట కాంబోడియా వెళ్లాను. అగ్రిబడ్డీ సంస్థ తరపున అక్కడి రైతులతో వ్యవసాయం చేయించాను. అక్కడ తమ పొలాల మధ్యే రైతుల ఇళ్లు ఉంటాయి. ఆ ప్రాంతంలో నది పొంగితే నలభై అడుగుల ఎత్తున వరద ప్రవాహం ఉంటుంది. వానాకాలం పడవల్లో ప్రయాణిస్తారు. ఇళ్లు కూడా ఆ వరదల్ని ఎదుర్కొనేట్టు చాలా ఎత్తున కట్టుకుంటారు. ప్రతి పొలంలో చెరువు తవ్వుకుంటారు. వాన నీటిని నిల్వ చేసుకుని వ్యవసాయం చేస్తారు. ప్రకృతికి అనుగుణంగా వారి జీవనం, వ్యవసాయం ఉంది. అది నన్ను బాగా ఆకట్టుకుంది. మా ఊరికి వచ్చాక పొలంలోకి వచ్చిన వాన నీరు కిందికిపోకుండా మట్టి పోయించాను. పొలంలోనే చిన్న కొలను తయారైంది. ఇందులో పది అడుగుల లోతున నీరు నిల్వ ఉంటున్నది. ఏటా మార్చి వరకు నీటికి కొదువ ఉండదు. వేసవిలో మళ్లీ చెరువులో పూడిక తీయిస్తుంటాను.
విత్తం కన్నా విత్తే మిన్న
‘విత్తనం లేనిదే వ్యవసాయం లేదు. విత్తనం మంచిదైతే దిగుబడి మంచిదవుతుంద’ని సుభాష్ పాలేకర్ చెప్పారు. దేశవాళీ విత్తనం ప్రాధాన్యం గురించి ఆయన అవగాహన కల్పించారు. అలా దేశవాళీ విత్తనం పట్ల అభిమానం పెరిగింది. విత్తనాల కోసం ఎండల్లో క్యూలో నిలబడటం, దొరక్కపోతే ప్రభుత్వాన్ని తిట్టడం చూస్తున్నాం. ఒకప్పుడు వెదురుబుట్టల్లో, కుండల్లో విత్తనాలు నిల్వ చేసుకునేవారు. చూరుకి, వసారాకి మొక్కజొన్న కంకులు, బీరకాయలు, సొరకాయలు, బెండకాయలు వేలాడగట్టేవాళ్లు. తన చేతిలో విత్తనం చేజేతులా పోగొట్టుకొని మార్కెట్లో దీనంగా రైతు చేయిచాపుతున్నాడు. ఈ దుస్థితి పోవాలంటే విత్తన స్వావలంబన సాధించాలంటారు పాలేకర్. సుస్థిర అభివృద్ధికి విత్తన భాండాగారం వృద్ధి చేయడమే మార్గం. అందుకోసం దేశవాళీ వంగడాలను కాపాడే ప్రయత్నం మొదలుపెట్టాను.
దేశవాళీ యాత్ర
ఒకప్పుడు పండిన టమాటా కనిపిస్తే నోరూరేది. అప్పట్లో దాని రుచి అది. ఇప్పుడు టమాటా వండటానికి తప్ప తినడానికి పనికిరావట్లేదు. ఈ హైబ్రిడ్ తిండి తిని అనారోగ్యాలతో ఇబ్బందులు పడుతున్నాం. వీటి నుంచి విముక్తి ఇచ్చేది దేశవాళీ పంటలే. అందుకే దేశవాళీ విత్తనాల సేకరణ మొదలుపెట్టాను. మైసూర్, ఉదయ్‌పూర్, బెంగళూరు, హైదరాబాద్‌లో బీజ్ మహోత్సవ్‌లో రైతుల నుంచి ఎన్నో రకాల విత్తనాలు సేకరించాను. వరి వంగడాలు, కూరగాయల విత్తనాలు, పప్పులు, ఆకు కూరలు, ఔషధ మొక్కల విత్తనాలు సేకరించాను. వాటితో పంట తీసి, విత్తనాలను పెంపు చేశాను. ప్రతి సంవత్సరం పది రకాల వరి వంగడాలు పండిస్తుంటా. ఎర్రబుడమలు (రెడ్ రైస్), నెల్లూరు మొలకలు (వరి) లాంటి అంతరించే స్థితిలో ఉన్న వరి వంగడాలను పండించి, విత్తన నిల్వ చేశాను. టిబెట్‌లో పండే సాథి రకం వరి గింజలు తెచ్చి పండించాను. రాజుల చిక్కుడు (ఎరుపు, తెలుపులో ఉండే విత్తనం) అంతరించిపోకుండా కాపాడాను. నేతి బీరలో తొక్క తీయకుండా వంట చేసుకునే గుత్తి బీర (పది నుంచి పన్నెండు కాయలు ఇస్తుంది) రకం ఉంది. దాని విత్తనం సేకరించాను.
ఆర్గానిక్ సీడ్ బ్యాంక్
ఆదిమ్ (ఛత్తీస్‌గఢ్), ఆందోళన్ (ఉత్తరాఖండ్), నమ్మాళ్వార్ ఫౌండేషన్ (తమిళనాడు) సంస్థలతో కలిసి విత్తనాల కోసం కొత్త ప్రయాణం చేశాను. ఆదివాసీలను కలుసుకొని వాళ్లు సాగుచేస్తున్న పంటల విత్తనాలు సేకరించాను. విత్తనం ప్రాధాన్యంతతోపాటు వాటిని ఎలా సాగు చేయాలో అడిగి తెలుసుకుంటాను. నాకు తెలిసిన విషయమే అయినా మళ్లీ అడిగి తెలుసుకుంటాను. వాళ్లు మరో పద్ధతిలో సాగు చేస్తే కొత్త విషయం తెలుస్తుంది కదా! ఇవన్నీ రాసుకుంటాను. సీజన్ రాగానే వాళ్లు చెప్పినట్టుగా సాగు చేస్తాను. పంటద్వారా అధిక మొత్తంలో విత్తనం వస్తుంది. విత్తనాల నిల్వ కోసం పాత తరం పేడను, చెరువు మట్టిని విత్తనాలకు పులిమి ఎండబెట్టేది. వాటిని పేడతో అలికిన వెదురు బుట్టల్లో నిల్వ చేసేది. కాల్చిన మట్టి కుండల్లో, జాడీల్లో, పిడతల్లో కూడా విత్తనాలు కాపాడేది. ఈ పద్ధతులన్నీ పాటిస్తున్నాను. విత్తన సేకరణ, సేంద్రియ సాగు ద్వారా 3,600 రకాల ధాన్యం, పప్పులు, కూరగాయలు, ఆకుకూరల విత్తనాలు భద్రపరిచాను. ఈ సీడ్ బ్యాంక్ నిర్వహణ కోసం ఒక ఎన్జీవోను ప్రారంభించాను. ఆర్గానిక్ సీడ్ స్టోర్ నెలకొల్పాను. ఇక్కడితో నా ప్రయాణం ముగిసింది అనుకోవడం లేదు. మరిన్ని ప్రాంతాలకు వెళ్లాలి, రకరకాల విత్తనాలు సేకరించాలి, వాటిని పండించాలి, మేలైన దేశీయ వంగడాలను ముందుతరాలకు కానుకగా ఇవ్వాలి. ఇదే నా లక్ష్యం.
బెస్ట్ ఫార్మరే బెస్ట్ టీచర్
ఒకసారి నిర్మలా నంద స్వామీజీ శ్రీకాకుళం వచ్చినప్పుడు ఆయన చెప్పిన విశేషాలు విన్నాను. ఆయన స్ఫూర్తితో సేంద్రియ వ్యవసాయం నేర్చుకునేందుకు బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమానికి వెళ్లాను. సేంద్రియ వ్యవసాయ పద్ధతుల గురించి అధ్యయనం చేశాను. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో సేంద్రియ సాగు విధానాలపై రైతులకు పాఠాలు చెబుతున్నాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని ఆర్గానిక్ ఫార్మింగ్ టీచర్లకు స్టేట్ కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నాను. నాకింద నలబై మంది టీచర్స్ ఉన్నారు. ఉత్తమ వ్యవసాయదారుడిగా అవార్డు అందుకున్నాను.
Fabric Business Tohfa
పాత రుచులు కొత్త ప్రయాణం…
సాహు అనే ఉత్తరాది రైతు చిరుధాన్యాలు, పప్పులతో రాగి జంతికలు, రాగి లడ్డూలు, బిస్కట్లు, అరిసెలు మొదలైన ఎన్నో రకాల వంటకాలను తయారు చేస్తాడు. మన వాతావరణం, మన శారీరక అవసరాలకు తగినట్టుగా ఉండే ఈ సంప్రదాయ వంటకాల వల్ల ఆరోగ్యమే కాదు, దేశీయ విత్తనాలను సాగుచేసే రైతుకు ఉపాధి కల్పించవచ్చు. దేశవాళీ విత్తనాలు నిల్వ చేయడం కష్టం. మళ్లీ మళ్లీ సాగు చేస్తే ఆ దిగుబడిని ఏం చేయాలి? ఈ సమస్యకు సాహు దగ్గర నాకో పరిష్కారం దొరికింది. కొన్ని విత్తానాలను సీడ్ బ్యాంక్‌లో భద్రపరచాలి. మిగతావాటితో సాగు చేసి, వచ్చిన దిగుబడితో సంప్రదాయ వంటకాలు తయారు చేయాలి. ఇలా చేయడం వల్ల విత్తన సేద్యం చేసే రైతుకు ఆర్థికంగా మద్దతు లభిస్తుంది. నేను కూడా ఆయన్ని అనుసరించాను. భాస్కర ఆర్గానిక్ అండ్ నేచురల్స్ సంస్థను ప్రారంభించి.. విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేయడం మొదలుపెట్టాను. చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు, గానుగ నూనెలు, బిస్కెట్లు, స్నాక్స్ అమ్ముతున్నాను.
సాగుబడి బాట
మా పొలంలో సాగు పద్ధతులను వీడియోలు, ఫొటోలు తీస్తుంటాను. పాఠశాల పిల్లలకు వాటిని చూపుతుంటాను. వారితో సీడ్ బాల్స్ తయారు చేయించాను. వర్షపాతం తక్కువ ఉన్న ప్రాంతాల్లో వాటిని వేయాలని చెబుతాను. కొండ ప్రాంతాల్లో సీడ్ బాల్స్ వేయడం వల్ల వనం విస్తరిస్తుంది. పండ్ల చెట్లకు చెందిన విత్తనాలు వెదజల్లడం ద్వారా పశుపక్ష్యాదులు బతుకుతాయి. జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ ఆలోచనతో అటవీ శాఖతో కలిసి పని చేస్తున్నాం.
…? నాగవర్ధన్ రాయల