చాక్లెట్ అనగానే నోటిని తీపి చేసే పదార్థమే అనుకుంటాం. కానీ, ఆ తీపిలోనే చేదు ఉంటుంది. నిజానికి చేదు కూడా మనిషి ఆరోగ్యానికి మంచే చేస్తుంది కదా. అలా ఈ డార్క్ చాక్లెట్ కూడా ఆనందాన్ని పంచడమే కాకుండా ఆరోగ్యాన్నీ కాపాడుతుంది. మరి ఈ డార్క్ చాక్లెట్.. బ్రైట్ సీక్రెట్స్ తెలుసుకుందామా..
డార్క్ చాక్లెట్ను 60-90 శాతం కొకోవా పౌడర్, తక్కువ మోతాదులో చక్కెర కలిపి తయారు చేస్తారు. కానీ, వైట్ (మిల్క్) చాక్లెట్ కంటే ఇందులో తక్కువ చక్కెర ఉంటుంది. వీటిలో ఫ్లేవనాయిడ్స్ లాంటి యాంటి ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.
మెక్సికో: మెక్సికో చుట్టుపక్కల ఉండే కొన్ని తెగల ప్రజలు కొకోవాను దేవుని వరంగా భావిస్తారు. వారు నిర్వహించే పూజల్లో కొకోవాను వినియోగించేవారట.
ఘనా-ఐవనీ కోస్ట్: ఈ రెండు దేశాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద కొకోవా ఉత్పత్తిదారులు ఉన్నారు. ప్రపంచ అవసరాల్లో 60 శాతం కొకోవా సరఫరా ఇక్కడి నుంచే జరుగుతుంది.
జపాన్: ఇక్కడ వాలెంటైన్స్ డే నాడు ‘గిరి చోకో’ అనే సంప్రదాయం పాటిస్తారు. ఆనాడు యువతులు తమకు ఇష్టమైనవారికి డార్క్ చాక్లెట్ బహుమతిగా ఇస్తారు.