ఒళ్లంతా నీరూరుతూ నిగనిగలాడే కాయగూర కీరదోస. పైకి ముళ్లున్నా.. తేనె దాచుకున్న పండు పైనాపిల్. ఈ రెండూ శరీరానికి మేలుచేసేవే. రెండిటినీ కలిపి జూస్ చేసి కొడితే.. అందం రెట్టింపు అవుతుంది. ముఖంపై ఉన్న ముడతలు మాయం అవుతాయి. మొటిమల అడ్రస్ గల్లంతవుతుంది.
కీరదోసలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. నీటి శాతం ఎక్కువగా ఉన్నందు వల్ల చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. చర్మంపై ఉండే కణాలు ధ్వంసం కాకుండా కీరలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కాపాడతాయి.
చాలామంది ఇష్టంగా తినే పండు పైనాపిల్. ఇందులో ఉండే బ్రొమెలిన్ అనే ఎంజైమ్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మంపై ఉండే వాపులను తగ్గించడంలో సాయపడుతుంది. ప్రతిరోజూ తినే ఆహారంలో పైనాపిల్ చేర్చుకుంటే చర్మం సహజ కాంతిని సంతరించుకుంటుంది.
పైనాపిల్, కీరదోసతో చేసిన డ్రింక్ తాగడం వల్ల కూడా చర్మ సమస్యలకు చెక్ పెట్టొచ్చు. కీర, పైనాపిల్, తాజా పుదీనా ఆకులు, నిమ్మరసంతో చేసే డ్రింక్ తాగితే ముఖంపై ఉండే మచ్చలు తగ్గుతాయి. చర్మం యవ్వనంగా, కాంతిమంతంగా మారుతుంది.
తయారీ ఇలా..
కీరదోస, పైనాపిల్ ముక్కలు, పుదీనా ఆకులు, నిమ్మరసం కలిపి బ్లెండర్లో వేయాలి. మిక్స్ చేసిన తర్వాత ఫిల్టర్ చేయాలి. ఐస్ క్యూబ్స్, పుదీనా ఆకులు వేసుకుని తాగాలి.