‘సార్.. ఇక్కడ ఒకే గదిలో ఎనిమిదిమంది చనిపోయి ఉన్నారు. మీరు త్వరగా రావాలి సార్’ ముఖంపై చెమటను తుడుచుకొంటూ కంగారుగా చెప్పాడు హెడ్‌కానిస్టేబుల్ రామస్వామి.
అరగంటలో క్రైమ్స్పాట్కు చేరుకొన్నాడు ఇన్స్పెక్టర్ రుద్ర. ఒకేగదిలో ఎనిమిది మంది విగతజీవులుగా పడి ఉన్నారు. మృతుల్లో రెండేండ్లు కూడా నిండని పసిపాపతోపాటు ముగ్గురు మహిళలు ఉన్నారు.
ఆ దృశ్యాన్ని చూసిన రుద్ర ఒకింత ఆవేదనకు గురయ్యాడు.
ఇంతటి కిరాతకానికి ఒడిగట్టింది ఎవరు? పసిపిల్ల అని కూడా చూడకుండా ఈ దారుణం ఎలా చేయాలనిపించింది?..
ఇవే ప్రశ్నలతో రుద్ర మనసంతాఉక్కిరిబిక్కిరి అయింది.
ఇంతలో ‘సార్.. ఇన్సిడెంట్ జరిగిన గదిలో ఇతను కూడా ఉన్నాడు’ అంటూ రామస్వామి చెప్పడంతో అటువైపు చూశాడు రుద్ర. ఏడవడంతో కండ్లు ఎర్రబడి, ముఖమంతా పీక్కుపోయి ఓ వ్యక్తి కనిపించాడు. ‘మీ పేరు?’ ప్రశ్నించాడు రుద్ర. ‘పవన్ సార్. చనిపోయినవారంతా నా కుటుంబసభ్యులే’ బోరుమన్నాడు పవన్. ‘మిస్టర్ పవన్.. కంట్రోల్ యువర్సెల్ఫ్. అసలు జరిగిందేంటో చెప్పండి?’ అడిగాడు రుద్ర. రామస్వామి తీసుకొచ్చిన నీళ్లను తాగిన పవన్.. తనను తాను తమాయించుకొని చెప్పడం ప్రారంభించాడు.
‘సార్.. మేము ఐదుగురం సంతానం. నాతోపాటు ముగ్గురు చెల్లెళ్లు. ఒక తమ్ముడు. మొన్న సంక్రాంతికి చెల్లెళ్లు, బావలు కలిసి ఇంటికి వచ్చారు. అప్పటినుంచి ఇక్కడే ఉన్నారు. నిన్న రాత్రి తొమ్మిదింటికి టెర్రస్‌పై ఉన్న హోమ్ థియేటర్ గదిలో నేను, తమ్ముడు, చెల్లెళ్ల ఫ్యామిలీ ఇలా అందరం కలిసి సినిమా చూశాం. సినిమా స్టార్ట్ అయిన గంటకు నేను నిద్రలోకి జారుకొన్నా. మార్నింగ్ లేచిచూసేసరికి అందరూ ఇలా చనిపోయి ఉన్నారు. మా పెద్దచెల్లి బిడ్డ.. రెండేండ్లు కూడా ఉండవు సార్.. పాపం ఆ పసిది కూడా చనిపోయింది. అసలేం జరిగిందో నాకేం అర్థం కావడం లేదు. భయంతో ఉదయాన్నే మీ స్టేషన్‌కు ఫోన్ చేశా’ అంటూ మళ్లీ బోరుమన్నాడు పవన్. హోమ్ థియేటర్ లోపల గదిని తీక్షణంగా పరీక్షించాడు రుద్ర. స్క్రీన్ కింద ఏసీ, పైన లైట్లు, లోపల ఓ చూరు మూలన సీసీటీవీ కెమెరా ఉండటాన్ని గమనించాడు. రుద్ర కండ్లు ఒక్కసారిగా మెరిశాయి. కానిస్టేబుల్‌ను పురమాయించి సీసీటీవీ ఫుటేజీ తీయించాడు.
గత రాత్రి 9 గంటల ప్రాంతంలో పవన్ చెప్పినట్టే అందరూ సినిమా ముందు కూర్చున్నారు. పసిపాపను ఎత్తుకొని పవన్ కుర్చీలో కూర్చొని సినిమా చూస్తున్నాడు. స్క్రీన్ ముందు చాప పరుచుకొని మిగతావాళ్లు పడుకొని సినిమా చూస్తున్నారు. ఇంతలో పవన్ ఉక్కబోతగా ఉందన్నాడు. దీంతో అతని తమ్ముడు ఏసీ ఆన్ చేయడం కనిపించింది. తర్వాత.. నిద్ర వస్తుందంటూ పవన్ పసిపాపను వాళ్లకు ఇచ్చి.. కాసేపటికే నిద్రలోకి జారుకొన్నాడు. అది జరిగిన గంటకు ఒక్కొక్కరూ నిద్రపోతూ కనిపించారు. ఉదయం ఏడు గంటలకు పవన్‌కు మెలకువ వచ్చినట్టు ఫుటేజీలో ఉంది. నిద్రలేచిన పవన్ కిటీకీలు తెరిచి.. అందర్నీ లేపడానికి ప్రయత్నించాడు. అయితే, ఎంతకీ వాళ్లు లేవలేదు. దీంతో భయపడిపోయిన అతను పక్కనే ఉన్న తన మొబైల్‌తో పోలీసు స్టేషన్‌కు ఫోన్ చేయడం ఫుటేజీలో క్లియర్‌గా ఉంది. ఫుటేజీ చూశాక.. కేసు జటిలంగా మారినట్టు రుద్రకు ఈజీగానే అర్థమైంది.
వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి. కొత్త వ్యక్తులు లోపలికి రాలేదు. బతికి బయటపడ్డ పవన్ వాళ్లపై దాడి
చేశాడనుకొందామంటే సీసీటీవీ ఫుటేజీ క్లియర్‌గా ఉంది. దీంతో రుద్ర బుర్ర వేడెక్కిపోయింది. ‘మిస్టర్ పవన్. మీ పేరెంట్స్ ఎక్కడ?’ అని ప్రశ్నించాడు రుద్ర. ‘లేరు సార్. ఏడాది కిందట చనిపోయారు’ అన్నాడు పవన్. ‘మీకు ఎవరిమీదైనా అనుమానం ఉందా?’ అడిగాడు రుద్ర. లేదన్నట్టు తలూపాడు పవన్. ఇంతలో పోస్ట్‌మార్టం రిపోర్ట్లు వచ్చాయి. ప్రొపేన్తో కలిసిన మరొక ప్రత్యేక టాక్సిక్ గ్యాస్‌ను పీల్చడం వల్లే వీళ్లంతా చనిపోయినట్టు ఆ రిపోర్టులో తేలింది. ‘గదిలో అందరూ కలిసి ఉన్నప్పుడు.. అదే గ్యాస్‌ను పీల్చిన పవన్ ఎలా బతికి బయటపడ్డాడు?’ రుద్ర మెదడు మరింత బరువెక్కింది. పవన్ రాత్రిపూట ముఖానికి మాస్కు వేసుకొన్నాడా? అంటూ ఫుటేజీని మరోసారి పరిశీలించాడు. అలాంటిదేమీ లేదు. పోనీ ఫుటేజీని మానిప్యులేట్ చేశారా? అనే కోణంలోనూ దర్యాప్తు చేశారు. అయితే, అది ఒరిజినల్ పుటేజీనే అని తేల్చారు. దీంతో కేసు ముందుకు జరగట్లేదు.
ఎనిమిదిమంది మరణించారన్న వార్త సిటీలో పెద్ద చర్చనీయాంశమైంది. కేసును త్వరగా సాల్వ్ చేయాలని రుద్రకు పైనుంచి ఒత్తిడి పెరగసాగింది. పవన్‌ను ఎంత విచారించినా.. అతడి వైపు నుంచి అంతా క్లియర్‌గానే ఉన్నట్టు తెలుస్తున్నది. దీంతో కెరీర్లో తొలిసారిగా కేసును సాల్వ్ చేయలేనేమోనని రుద్ర భయపడిపోయాడు. ఆ ఆందోళనతోనే ఇంటికి వచ్చాడు.
టెన్షన్‌గా కనిపిస్తున్న కొడుకుతో రుద్ర అమ్మగారు రూప మాట్లాడుతూ.. ‘ఏమైంది కన్నా.. అంత టెన్షన్‌గా ఉన్నావు?’ అని అడిగింది. కేసు గురించి చెప్పాడు. ‘ఎక్కడో ఏదో మిస్ చేస్తున్నావ్.. అదేంటో కనిపెట్టు. హంతకుడు చేసే చిన్న పొరపాటే.. కేసు సాల్వింగ్‌కు టిప్ అవుతుంది’ అంటూ రూప కొడుక్కి ధైర్యం నూరిపోసింది. తల్లి మాటలతో కాస్త కుదుటపడ్డ రుద్ర.. కాసేపు యూట్యూబ్‌లో పాటలు విందామని టీవీ ఆన్ చేశాడు. తనకు నచ్చిన పాటలను సెలెక్ట్ చేసుకొంటున్న క్రమంలో ఓ వీడియో థంబ్‌నెయిల్‌పై అతని దృష్టి పడింది. ‘వర్షం పడని వింత గ్రామం ఎక్కడుందో తెలుసా?’ అనేది ఆ వీడియోకు థంబ్నెయిల్గా రాశారు. ఇంట్రెస్టింగ్గా ఉందని వీడియోపై క్లిక్ చేశాడు రుద్ర. ‘యెమెన్‌లో భూ ఉపరితలానికి 3,200 మీటర్ల ఎత్తులో ఓ కొండపై అల్హుతైబ్ అనే గ్రామం ఉందట. ఆ గ్రామం మేఘాల కంటే ఎత్తులో ఉండటంతో అక్కడ ఎప్పుడూ వర్షం పడద’ని సదరు వీడియోలో చెప్పారు. అది విన్న రుద్ర మెదడు పాదరసంలా పనిచేసింది. ల్యాప్‌టాప్‌లో ఏదో సెర్చ్ చేశాడు. ముఖంపై చిరునవ్వు మొలిచింది. వెంటనే హెడ్‌కానిస్టేబుల్ రామస్వామికి ఫోన్‌చేశాడు. ‘బాబాయ్.. త్వరగా పవన్‌ను అరెస్ట్ చెయ్యండి. అతనే హంతకుడు’ అని చెప్తూ.. పవన్ ఇంటికి వాయువేగంతో బయల్దేరాడు. ఇంతకీ.. పవనే హంతకుడని రుద్ర ఎలా కనిపెట్టాడు?
సమాధానం:
యూట్యూబ్‌లో వీడియో చూడగానే రుద్ర మెదడులో కొన్ని ప్రశ్నలు ఉదయించాయి. ఏసీ ఆన్ చెయ్యమని తమ్ముడిని పవన్ పురమాయించిన గంటలో అందరూ చనిపోయారు. అంటే ఏసీలోంచే విషవాయువు వచ్చింది. మరి, ఆ వాయువును పవన్ పీల్చలేదా? అంటే.. ప్రొపేన్తో కలిసిన విషవాయువు సాధారణ గాలి కంటే బరువైంది. భూఉపరితలానికి రెండు ఫీట్ల కంటే పైకి వ్యాపించలేదు. ఇది తెలిసే పవన్ కుర్చీలో ధైర్యంగా కూర్చొని అదే గదిలో నిద్రపోయాడు. ఇదేమీ తెలియని మిగతావాళ్లు నేలమీద పడుకొని ఆ ప్రొపేన్ విషవాయువు పీల్చి చనిపోయారు. ఇంకేమైనా గ్యాస్.. గదిలో ఉందన్న అనుమానంతోనే ఉదయం లేవగానే పవన్ వెంటనే కిటికీలు తెరిచాడు. తనపై అనుమానం రాకుండా ఉండేందుకే రాత్రంతా అదే గదిలో ఉన్నాడు. సీసీటీవీని కూడా ఇందుకు వాడుకొన్నాడు. కాగా.. ఆస్తి మొత్తం తానొక్కడే అనుభవించడానికి పవన్ ఇంత దారుణానికి ఒడిగట్టినట్టు తర్వాతి విచారణలో తేలింది.
..? రాజశేఖర్ కడవేర్గు